Monday, July 9, 2012

తొలి సంస్కర్త బసవేశ్వరుడు

ధనవంతులు నిర్మింతురు నీకై
ధగద్ధ గోజ్వల గోపురాదులను
ధనములేని బడుగును నేనెట్టుల
తమకై కట్టుదు శివాలయంబును..?

ఈ ప్రశ్న మనకు ఎంతోమంది వాగ్గేయకారుల్ని,తాత్వికుల్ని,భక్త శిఖామణుల్ని గుర్తు చేస్తుంది.నేను పేద వాడిని కదా...నీకు ఆలయమెలా కట్టగలను?నీకు నిత్య నైవేద్యాలెలా ఇవ్వగలను?నీకు రాజుల తోటల్లోని తాజాపువ్వులెలా సమర్పించగలను?అంటూ...ఈ ప్రశ్నలన్నిటికీ మూలాధారమైన ప్రశ్న బసవేశ్వరుడిదేనంటారు విజ్ఞులు.పన్నెండో శతాబ్దికి చెందిన బసవేశ్వరుడు కన్నడంలో సాహిత్యాన్ని ఎంతగా ప్రభావితం చేశాడో తెలుగులోనూ అంత కన్నా ఎక్కువే చేశాడు.పాల్కురికి సోమనాథుదు తెలుగులో బసవపురాణం రాశాడంటే "బసవేశ్వరుడు" ఎంతగా ఆ కాలాన్ని ప్రభావితం చేశాడో ఊహించవచ్చు.ఇప్పటికీ కర్ణాటక,ఆంధ్ర రాష్ట్రాల్లో బసవేశ్వరుడి అనుచరులు కోట్లల్లో ఉంటారు ! ఆయన వచనాల సారాంశమేమిటో చూద్దాం.

ఉత్తమకులమున కధమ కులమ్ముకు
ఉత్తజన్మమే కారణమెట్లగు?
హింసాత్మకుడగువాడే మాదిగ
నీచు భుజించెడి వాడే మాలడు
సర్వ జీవహితమెవడు కోరునో
సంగమ దేవ కులస్థుండాతడు

"జన్మనా జాయతే శూద్రా" అన్న స్లోకార్థం ఈ వచనంలో ప్రతిధ్వనిస్తోందంటే బసవేశ్వరుడు ఎంత జ్ఞానో,సంస్కరణాభిలాషో అర్థంచేసుకోవచ్చు.పన్నెండో శతాబ్దంలో కర్ణాటకని బిజ్జలుడు పాలిస్తోన్న రోజుల్లో కల్యాణనగరంలో రాజు ఆస్థానంలో గణికులు ఆదాయ వ్యయాలు లెక్కిస్తున్నారు.అప్పట్లో కంప్యూటర్లు,కాలిక్యులేటర్లు లేవు కాబట్టి లెక్కలో తేడా రావడం సహజమే.వారి గణనలో చిన్న పొరపాటు దొర్లనే దొర్లింది.కొంచెం దూరం నుంచి వారిని గమనిస్తోన్న ఓ యువకుడు వారిని సమీపించి అసలు విషయం వివరించాడు.ఆ యువకుని నిర్భీతికి,ధైర్యానికి మెచ్చుకున్న సిద్ధ దండాధీశుడు ఆ యువకుడిని బిజ్జలుని దగ్గరకు తీసుకెళ్లి విషయం చెప్పాడు.రాజు ప్రసన్నుడై తన భాండాగారంలో ఉద్యోగమిచ్చారు.అలా తన కాళ్ల పై నిల్చున్న బసవేశ్వరుడు సంగమ దేవుడి పట్ల ఆకర్షితుడయ్యాడు.అసలు బసవేశ్వరుడు కల్యాణనగరం ఎందుకు వచ్చాడన్నది పెద్ద కథ.బసవేశ్వరుడు "బాగేవాడి"లో మాదిరాజు,మాదాంబలకు జన్మించాడు.వైదిక కర్మలంటే చిన్నతనం నుంచీ బసవేశ్వరుడికి పడేదికాదు.ఉపనయనం చేయాలని తండ్రి ప్రయత్నిస్తే బసవేశ్వరుడు ఇంటి నుంచి పారిపోయాడు.అంటే పన్నెండో శతాబ్దంలోనే ఎంత విప్లవాత్మకంగా ప్రవర్తించాడో అర్థం చేసుకోవచ్చు.రోజూ శివుడిని పూజిస్తు శివుడి ధ్యానంలో గడిపే బసవడికి శివుడే కలలొ కనిపించి కల్యాణపురం వెళ్లమని చెప్పాడన్నది ఐతిహ్యం.ఎలాగైతేనేం తల్లిదండ్రులు సంకల్పించిన వైదిక కర్మల నుంచి పారిపోయిన బసవేశ్వరుడు కల్యాణపురం చేరుకున్న తర్వాత శివుడిని అర్చిస్తూ శివతత్వాన్ని జీర్ణం చేసుకున్నాడు.శివుడే సర్వేశ్వరుడు,శివుడిని మించిన వాడు లేడన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకున్నాడు.అలా వీరశైవమతానికి బీజాలు వేశాడు.బసవుడు తాను చూసిన సమాజాన్ని,గ్రహించిన శాస్త్రసారాన్ని సామన్యులకు అందించాలనుకున్నాడు.

శైవమతం విశేషమేమంటే -
* మనుషులందరూ ఒక్కటే.కులాలు,ఉపకులాలు లేవు.
* శివుడే సత్యం,నిత్యం.
* దేహమే దేవాలయం.
* స్త్రీ పురుష భేదంలేదు.
* శ్రమను మించిన సౌందర్యం లేదు.
* భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యం.

ఇటువంటి ఉపదేశాలతో బసవేశ్వరుడు 64 లక్షల వచనాలు కూర్చాడు.అన్నమయ్య కూర్చిన ముప్పై రెండువేల సంకీర్తనలున్న రాగి రేకుల్లో అక్కడి పూజారులు కరిగించినవి పోగా మనకిప్పుడు పన్నెండు వేలే లభ్యమవుతున్నాయి.అలాగే బసవేశ్వరుడి వచనాలలో కూడా కొన్ని వేలు మత్రమే లభ్యమవుతున్నాయి.
బసవేశ్వరుడు శివభక్తులందర్నీ పూజించి,వారు భోంచేశాకే చివర్లో మిగిలింది తినేవాడు.క్రమంగా వచనాల వ్యాప్తికి,వేదాంత గోష్టికి "అనుభవ మంటపం" నిర్మించి అందులో అన్ని కులాల వారిని నియమించారు.
ఆనాటి సమాజం బసవేశ్వరుడి సంఘసంస్కరణను ప్రశ్నించింది.బసవేశ్వరుడికి ఎన్నో ఆటంకాలు సృష్టించింది.అయినా ఆయన జంకలేదు.

"చెడును స్థావరమును జంగమమిదిగో
పాదములివి ఆలయ కంబములు
పసిడి కలశమగు నా శిరమిదిగో
నడిచెడి యీ దేవాలయమ్ములో
నివసింపుము శ్రీ సంగమేశ్వరా"

తన దేహంలోనే నివసించమని సంగమేశ్వరుడిని ఆహ్వానించిన బసవేశ్వరుడు సాహిత్యపరంగా కూడా ఎంతో విలువైన వచనాలు అందించాడు.

అగ్రజుడెవ్వరు?అంత్యజుడెవ్వడు
బ్రాహ్మణుడెవ్వరు?శ్వపచుండెవ్వరు?
భక్తులెల్ల శ్రీసంగమ కులజులు
కల్లయైన నా ముక్కును చెక్కుము

ఇది బసవేశ్వరుడి సవాలు.ధీమా.నిజమైన భక్తులందరూ శ్రీసంగమ కులజులే.ఇది తప్పయితే నా ముక్కుచెక్కి నాకు శిక్ష విధించమని సవాలు విసిరిన బసవేశ్వరుడు మానవ ప్రవర్తన ఎలా ఉండాలో కూడా స్పష్టం చేశారు.

"దోంగలింపకుము,హత్యల చేయకు
కల్ల లనాడకు,కోపగింపకుము
ఆత్మస్తుతి పరనిందల విడువుము
బాహ్యం తశ్శుద్దుల భావమ్మిదే"

పన్నెండో శతాబ్దంలోనే బసవేశ్వరుడు అన్ని కులాల వారికి తన 'అనుభవ మంటపం'లో ఆశ్రయమిచ్చి వారికి కొన్ని విధులు నిర్దేశించడమేకాక సాహసించి స్వయంగా వర్ణాంతర వివాహం జరిపించాడు.బసవేశ్వరుడి శైవమత విశ్వాసాలను,తీవ్రవాదాన్నీ దెబ్బతీయాలని ఎదురుచూస్తోన్న వారికి ఆ వివాహం బాగా కలసి వచ్చింది.దాంతో బసవేశ్వరుడిపై దొంగదెబ్బ తీయడానికి సాహసించారు.వర్ణాంతర వివాహం చేసుకున్న దంపతులు హత్యకు గురవ్వడంతో 'బసవేశ్వరుడు చలించిపోయాడు.కలచివే'తకు గురై తన ఉద్యోగం వదలి కూడలి సంగమేశ్వరుని సన్నిధిలో శేష జీవితం గడుపుతూ చివరికి ఆయనలో లీనమయ్యాడు.

"భక్తి వంద నమె భక్తి"యనంబడు
మృదువచనంబే 'మంత్ర ' జపంబగు
మృదువచనంబే 'మంత్ర ' తపంబడు
సద్వినియంబే శివప్రణయమగు
గుణహీనమ్మగు కొంగభక్తి నిల
కూడల సంగముడేడ వలచు మరి!

బసవేశ్వరుడి స్పూర్తితో అక్కమాదేవి వంటి భక్తి,తాత్వక కవులు ఎందరో వచ్చారు.అన్నమయ్య,వేమన,వీరబ్రహ్మం వీరందరి భావాల్లో విప్లవాత్మక మార్పులు రావడానికి పరోక్షంగా బసవేశ్వరుడే కారణం అనడంలో సందేహంలేదు.ఆయన వచనాలను ముదిగొండ శివప్రసాద్,దీవి సుబ్బారావు వంటి వారు తెలుగులో అందించారు.