రచన : రాయప్రోలు సుబ్బారావు గారు
శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వ్రాలినది యీ భరతఖండము
భక్తిపాడర తమ్ముడా !
వేదశాఖలు వెలసెనిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట
బాదరాయణ పరమఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా !
విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మదువొలికెనిచ్చట
విపుల తత్వము విస్తరించిన
విమల తలమిది తమ్ముడా !
పాండవేయుల పదనుకత్తుల
మండి మెరసిన మహితరణకథ
పండగల చిక్కని తెలుంగుల
కలిపి పాడవె చెల్లెలా !
దేశగర్వము దీప్తి చెందగ
దేశచరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా !
లోకమంతకు కాక బెట్టిన
కాకతీయుల కదనపాండితి
చీకిపోవని చేవపదముల
చేర్చి పాడవె చెల్లెలా !
తుంగభద్రా భంగములతో
పొంగి నింగిని బొడిచి త్రిళీ
భంగపడని తెలుంగునాథుల
పాటపాడర తమ్ముడా !
మేలి కిన్నెర మేళవించీ
రాలు గరగగ రాగమెత్తీ
పాలతీయని బాలభారత
పథము పాడవె చెల్లెలా !
No comments:
Post a Comment