తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం!

తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనే సదుద్దేశంతో ఈ “తెలుగు వెలుగు "ను మొదలుపెట్టడం జరిగింది. ఆంగ్ల భాష నేర్చుకొనడం లో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా? మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం..! " తెలుగు " ను కొత్త " వెలుగు " లో ప్రపంచానికి చూపిద్దాం!

Saturday, November 26, 2011

భగవాన్ భిక్షాం దేహి

తెలుగే మన గొడుగు

భగవద్గీత సుఖ జీవన గీతిక

తెలుగు తొలిప్రొద్దు వెలుగులు

తెలుగు తొలిప్రొద్దు వెలుగులు

శాసనాలలో తొలి తెలుగు పదం - నాగబు
తొలి పూర్తి తెలుగు శాసనం - రేనాటి చోడులది
తొలి తెలుగు కవి - నన్నయ
తొలి తెలుగు కావ్యం - ఆంధ్రమహాభారతం
తొలి తెలుగు నిర్వచన కావ్యం - నిర్వచనోత్తర రామాయణము
తొలి తెలుగు ప్రబంధము -మనుచరిత్రము
తొలి తెలుగు నవల - రాజశేఖర చరిత్రము
తొలి తెలుగు కవయిత్రి - తాళ్ళపాక తిమ్మక్క
తొలి తెలుగు వ్యాకరణము - ఆంధ్రభాషాభూషణము
తొలి తెలుగు గణిత గ్రంథము -గణితసార సంగ్రహము
తొలి తెలుగు ఛందశ్శాస్త్రము - కవి జనాశ్రయము
తొలి తెలుగు శతకము - వృషాధిప శతకము
తొలి తెలుగు నాటకము - మంజరీ మధుకీయము
తొలి తెలుగు శృంగారకవయిత్రి - ముద్దుపళని
తొలి తెలుగు కథానిక - దిద్దుబాటు
తొలి తెలుగు దృష్టాంతశతకము - భాస్కర శతకము
తొలి తెలుగు రామాయణము - రంగనాథ రామాయణము
తొలి తెలుగు ద్వ్యర్థికావ్యము - రాఘవ పాండవీయము
తొలి తెలుగు జంటకవులు - నంది మల్లయ, ఘంట సింగన
తొలి తెలుగు పురాణానువాదము -మార్కండేయ పురాణము
తొలి తెలుగు ఉదాహరణకావ్యము - బసవోదాహరణము
తొలి తెలుగు పత్రిక - సత్యదూత
తొలి తెలుగు నీతి శతకము - సుమతీ శతకము
తొలి తెలుగు సాంఘిక నాటకము - నందకరాజ్యం
తొలి తెలుగు వాగ్గేయకారుడు - అన్నమయ్య
తొలి తెలుగు ద్విపదకవి - పాల్కురికి సోమన
తొలి తెలుగు పద్యం (శాసనాలలో) - తరువోజ
తొలి తెలుగు పద్యశాసనము - అద్దంకి శాసనము
తొలి తెలుగు ధర్మశాస్త్రము - విజ్ఙానేశ్వరీయము
తొలి తెలుగు పరిశోధనా వాఙ్మయ గ్రంథము - సకల నీతి సమ్మతము
తొలి తెలుగు వ్యావహారిక నాటకము - కన్యాశుల్కం
తొలి తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి - ఆంధ్రుల సాంఘిక చరిత్ర
తొలి తెలుగు ఖురాన్ చిలుకూరి నారాయణరావు
తొలి తెలుగు వ్యావహారికభాషా వచన గ్రంధం హితసూచని (1853) - స్వామినేని ముద్దునరసింహంనాయుడు (1792-1856).
తొలి ఉరుదూ-తెలుగు నిఘంటువు - ఐ.కొండలరావు 1938

Friday, November 25, 2011

దేశ భాషలందు తెలుగు లెస్స

ఆది ద్రావిడం అరవల సొమ్మా?


రాయీ, మన్నూ పుట్టకముందే పుట్టిన ప్రపంచపు తొలిభాష తమిళ్‌. ఇది ప్రపంచ భాషలన్నింటిలోకీ అత్యంత ప్రాచీనమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి నిస్సంకోచంగా ప్రభుత్వ ఉత్తర్వులలో ప్రకటించారు. అదే మాటను ప్రపంచ తమిళ మహాసభల సందర్భంగా ఉద్ఘోషించి చెప్పారు. ఇది తమిళ తంబిల భేషజానికి ఎన్ని తరాలు మారినా మారని వారి అలవి మీరిన అహంకారానికి నిదర్శనంగా కనబడుతోంది. ద్రవిడ భాష అతి ప్రాచీనమైనదే ఎవ్వరూ కాదనరు. దానికి సంస్కృత భాషకున్నంత చరిత్ర ఉన్న మాట కూడా సత్యమే! దాన్ని కూడా ఎవ్వరూ కాదనరు. అయితే అవన్నీ అన్వయించాల్సింది ఆది ద్రవిడానికే కాని తమిళానికి కాదు. ఆది ద్రావిడం అనేక భాషలకు తల్లి లాంటిది. అంత మాత్రాన దాన్ని ప్రపంచ భాషలకు తల్లిలాంటిది అనడం అతిశయోక్తి! తమిళం వేరు ఆది ద్రవిడం అని పిలువబడే మూల ద్రవిడం వేరు అన్న విషయం అంతా గుర్తించాలి. సంస్కృతం ఆర్యుల భాష అయితే ద్రవిడం పూర్తిగా స్థానిక భాష. సంస్కృతం ఆర్యులతోపాటే మన దేశానికి వలస వచ్చిన భాష. శతాబ్దాలుగా ఇక్కడే ఉండి, ఈ దేశానికే సొంతమైనట్టుగా స్థిరపడిపోయింది. భారతీయతకు కీర్తి పతాకగా, మన సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, వేద, పురాణేతిహాసాది భారతీయ సాహితీ సంపదకు అది ఆటపట్టు అన్న వాస్తవాన్ని కూడా ఎవ్వరూ కాదనరు. దాని చరిత్రను, దానికి గల గౌరవాన్ని ఎవ్వరూ శంకించరు. స్థానికంగా ఉన్న ప్రాకృత, పాళి వంటి భాషలను అణగదొక్కి అది రాజభాషగా ఎలా చెలామణి అయిందో అలాగే ఆది ద్రవిడం దక్షిణాదిని ఆవరించి బలమైన స్థానిక భాషగా తలయెత్తి నిలిచింది. ఈ మూల ద్రవిడ భాష ప్రాంతానికి ఒక రకంగా ఉండి అనేక జాతులకు మాతృభాషను అందించింది. అలా మూల మధ్య ద్రవిడ భాష నుంచి పుట్టినది తెలుగుభాష. అనంతమైన ధ్వనిసంపదను, సాహితీ సంపదను కలిగి ఉన్న తెలుగుకు సవర, గొండి, కుయి, కోయ, కొలిమి భాషలు కూడా ఇలాగే పుట్టి తెలుగుకు ఉపభాషలుగా మారిపోయాయి. తెలుగు భాషలో ఉన్నన్ని భాషాధ్వనులు మరే భాషలో లేవంటే అతిశయోక్తికాదు. ఆది ద్రవిడం కుటుంబంలో పుట్టి ఆ భాషామతల్లి పాలు తాగిన భాషలు 26 ఉన్నాయి. అందులో తమిళం ఒకటి మాత్రమే! ఈ విషయం ఆ భాష అంటే ప్రాణాలు వదిలేవాళ్లు గుర్తించాలి. సంస్కృత భాషా సాంగత్యం వల్లే తెలుగు తన ధ్వని సంపదను అనంతంగా విస్తరించుకోగలిగింది. అందువల్ల స్పష్టత, మార్దవం, మాధుర్యం పెంచుకోగలిగింది. అందుకే తెలుగుతేట అని కీర్తి పొందింది. 15వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్‌ యాత్రికుడు నికోలొ డా కాంటి తెలుగును ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అని కీర్తించాడు. తెలుగు భాషా సౌందర్యాన్ని మాధుర్యాన్ని సంపూర్ణంగా గమినించిన వాడు కనుకనే దక్షిణాది భాషలు కరతలామలకం చేసుకున్న శ్రీకృష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స అని కితాబు ఇచ్చాడు. దేశభాషలు ప్రాంతీయ భాషలు అని అర్థం. దక్షిణాన ఉన్న ప్రధాన ప్రాంతాలేమిటి తమిళసీమ, కర్నాటక సీమ, మళయాళ సీమ, తెలుగు సీమ. ఈ ప్రాంతాలలో వ్యవహారంలో ఉన్న అన్ని భాషల కంటే తెలుగు చాలా గొప్పది అని గొంతెత్తి చాటాడు. అంటే ద్రవిడ భాషలలో కెల్లా అమిత మధురమైన భాష తెలుగు అని తేటతెల్లమైంది కదా అక్కడితో ఆగలేదు. తనను తెలుగు వల్లభుడనని, ఆంధ్రభోజుడనని చాటుకున్నాడు.


సాహిత్య సంపదలో తమిళంతో అన్నిటా ముందుండగల భాష తెలుగు. ఇందులో ఉర్దూ, పర్షియన్‌, ఇంగ్లీషు పదాలు సంగమించి ఉన్నాయి. నదులన్నీ సంగమించడం వల్లే సాగరం అంతుపట్టనంతగా విస్తరించింది. అలాగే ఇన్ని భాషలు తమంత తాముగా వచ్చి తెలుగుతో సంగమించబట్టే ఎలాంటి భావాన్నయినా, ఎంతటి క్లిష్టమైన వాఖ్యాన్నయినా అలవోకగా అక్షరబద్ధం చేయగల సత్తా తెలుగుకు ఉంది. ఇక్కడ ఇంగ్లీషులో ఉన్నట్టుగా సైలెంట్‌ అక్షరాలు ఉండవు. ఎలా మాట్లాడతావెూ అలా రాయగలుగుతాము. ఎలా రాయగలుగుతావెూ అలాగే ఉచ్ఛరించగలుగుతాము. అందుకే మనది జీవద్భాషగా వాసికెక్కింది. అందుకే ప్రముఖ జన్యు శాస్త్రవేత్త జెబిఎన్‌ హాల్డెన్‌ తెలుగుకు ఇండియాకు జాతీయ భాషగా నిలువగల అన్ని రకాల అర్హతలు ఉన్నాయని అన్నారు. రెండు పదాలను కలిపి మూడో అర్థం ఇవ్వగల పదాన్ని సృష్టించగల విలక్షణ లక్షణం తెలుగుకు మాత్రమే ఉంది. సౌందర్యాన్ని సంగ్రామ భూమిని సమానంగా ప్రేమించగలవాళ్లు తెలుగువారు అని ఉద్యోతనుడు తన ప్రాకృత గ్రంథం కువలయమాలలో ప్రశంసించాడు. తెలుగు వారు అందమైన వారని, అందాన్ని అమితంగా ఆరాధించేవారని, అందమైన భోజనాన్ని ఆనందంగా ఆరగించే వారని కూడా అన్నాడు. ఈ రోజున ఇండియా మొత్తంలో అత్యధిక ప్రజలు మాట్లాడే రెండవ భాషగా తెలుగు స్థానం దక్కించుకుంది. హిందీని జాతీయ భాషగా చెప్పే వాళ్ళ లెక్క ప్రకారం తెలుగు రెండవ అతిపెద్ద భాషగా ఉంది. దాన్ని ప్రాంతీయ భాషగా లెక్కకట్టి చూస్తే తెలుగే అతి పెద్ద ప్రాంతీయ భాషగా నెంబర్‌ వన్‌ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్ల మంది తెలుగుమాట్లాడే వారున్నారు. తమిళభాషను తోసిరాజనగల తెలుగు భాషకు, తెలుగు జాతికి 2,500 సంవత్సరాల చరిత్ర ఉందని నిర్ద్వద్వంగా నిగ్గుతేలితే దాన్ని పడనివ్వకుండా కోర్టుకెక్కి ప్రాచీన భాషా హౌదా దక్కనివ్వకుండా అడ్డుకున్న సంస్కారవంతులు తమిళులు.
మూల ద్రవిడానికి దగ్గరి భాష మాదే కనుక అసలు ద్రవిడ భాష మాదే అని గడుసుతనంతో నోరేసుకుని అరిచి ప్రచారాలు చేసుకుని వాస్తవాలను చెరిపేసినంత మాత్రాన చరిత్ర చెరిగిపోదు. చింపేస్తే చిరిగిపోదు. తమిళ ప్రభువుల అధికార పీఠాలు వేసుకుని కూచున్న చెన్నై ఎక్కడిది తెలుగువారి ఓడరేవు చెన్నపట్నం కాదా వాళ్ళు గొప్పగా చెపðకునే చాళుక్యులు ఆంధ్ర ఇక్ష్వాకుల సంతతి వారు కారా వారిని తెలుగు రాజులుగా చెపðకోడానికి వారు ఇబ్బంది పడ్డా చరిత్ర సాక్ష్యం పలకడం మానేస్తుందా పల్లవులు పరిపాలించిన తెలుగునేల పల్నాడుగా కీర్తిగాంచలేదా వారి రాజధాని నగరం కాంచీపురంలో కొలువున్న వరదరాజు అచ్చతెలుగు దేవుడు. వరదరాజు, వరదయ్య, వరం వంటి పేర్లు తెలుగు ప్రజలలో విరివిగా కనబడతాయి. శ్రీరంగనాథుడు కొలువున్న కావేరీ తీరం పూర్తిగా తెలుగునేల. కస్తూరి రంగడిగా, కావేటి రంగడిగా ఆ దేవుడు తెలుగు వారి జీవితంలో భాగంగా ఉండిపోయాడు. రంగారావులు, రంగారెడ్డి, రంగయ్య, రంగరాజు, రంగబాబు, రంగనాయకుడు, రంగనాథ్‌లు ఇక్కడ ఉన్నంతగా తమిళనాట లేరు. 'కస్తూరి రంగ రంగ..మాయన్న కావేటి రంగ రంగ' అని పాడని తెలుగు తల్లి ఉందా ఇలా పాడని తమిళ తల్లులు మాత్రం కోకొల్లలుగా ఉన్నారు. తెలుగువాడికే సొంతమైన చిదంబర రహస్యం మరిచిపోయారా సర్వేపల్లి రాథాకృష్ణన్‌ పుట్టినపుడు తిరుత్తణి తెలుగునాడులో ఉందా తమిళనాడులో ఉందా సర్వేపల్లి తమిళనాడు వాడని చంకలు గుద్దుకునే పెద్దలు ఆయన చిననాడు రేణిగుంటలోనూ, తిరుపతిలోనూ ఎందుకు చదువుకున్నాడు తెలుగు మీడియాలో చదువుకుంటే తమిళనాడులో చెల్లుబాటు కాదని తెలియకే చదువుకున్నాడా అన్నది చెప్పాలి. కంచి కామాక్షి, మధుర మీనాక్షి కూడా అచ్చతెలుగు ఆడపడుచులు. మధురనేలిన నాయకరాజులు అచ్చతెలుగు నాయకులు. క్షీణాంధ్ర సాహితీయుగంలో స్వర్ణయుగాన్ని స్థాపించిన వారు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కట్టించింది తెలుగు రాజులుకాదా సరస్వతీమహల్‌ కట్టింది తెలుగువారు కాదా తెలుగు అంటే చిరాకు పడే, మండిపడే పెద్దలు ఇప్పటికీ తమ రాజకీయాలకు పెద్దదిక్కు అని కొలుచుకునే జయలలిత తెలుగు అమ్మాయి కాదా తెలుగుగంగ పారితేగాని గొంతైనా తడుపుకోలేని వీళ్ళు ప్రపంచమంతా నాదేనని మాట్లాడడం శోచనీయం. విడ్డూరం.


తెలుగును తెనుంగు అని పిలిచే వారు తమిళులు. తెన్‌ అంటే దక్షిణాది అని అర్థం. తెనుంగు అనడం ద్వారా అది దక్షిణాది భాష అని అనడానికే తప్ప దాని పూర్తి వికాసరూపమైన తెలుగు పదాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. ద్రవిడ భాషా కుటుంబాలలో అతి ప్రాచీనమైన చరిత్ర కలిగిన జాతి తెలుగుజాతి. తమిళులతో అన్ని విధాల పోటీపడి పోరాటాలు చేయగల నేర్పు, ప్రతిభ గలవారు తెలుగువారు. కనుకనే వారికి తెలుగువారు అంటే సహజమైన మంట ఉంటుంది. అందుకే దాన్ని ఎలాగైనా తొక్కిపట్టాలని, ఇక్కడికి ఎలాంటి ప్రయోజనాలు రాకుండా చూడాలని శక్తి వంచనలేకుండా ప్రయత్నిస్తుంటారు. వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించి వేరుపడిన వారు తెలుగువారు. ఆ తరువాతే కన్నడ, మళయాళ సీమల వారు వేరుపడ్డారు. తెలుగువారు సంఖ్యాపరంగా చాలా ఎక్కువ. ప్రపంచం మొత్తం మీద తమిళం మాట్లాడే వారు ద్రవిడం అనేది ఒక ప్రత్యేకమైన భాషా కుటుంబం. ఇందులో ప్రధానంగా తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం ఉన్నాయి. మళ్ళీ వేటికి వాటికే ఉపభాషలు ఉన్నాయి. మా భాషే శుద్ధమైంది. మిగిలిన భాషలు సంస్కృతాన్ని ఆహ్వానించడం ద్వారా సంకరజాతి భాషలుగా మారిపోయాయి అని వారు అంటుంటారు. ముగ్గదీసుకుని బతకడంలో సంకుచితత్వం ఉంటుంది. అందరినీ ఆదరించగలగడంలో విశాల హృదయం ఉంటుంది. మిగిలిన భాషలు ఆ పని చేయగలిగాయంటే అది అక్కడి సార్వజనీన ధోరణికి నిదర్శనం. శాంతియుతంగా సహజీవనం చేయాలన్నా, సమాన స్థాయినిచ్చి గౌరవించాలన్నా విశాల దృక్పథం, విశాల హృదయం కావాలి. మూల ద్రావిడం తనదే అయినట్టు చెపðకుంటున్న తమిళుల వాదన ఏ రకంగా చూసినా నిజం కాదు. మూల ద్రావిడం అందరిదీ! అది దాక్షిణాత్య భాషలకు అమ్మగారి ఇల్లులాంటిది. ఆ ఉగ్గుపాలు తాగి, ఆ చేతి ముద్ద తిని పెరిగిన భాషలన్నీ ఆ గూటి పాటనే పాడతాయనే విషయం వారు గుర్తుంచుకోవాలి. తమిళభాష మీద మాకు ఉన్న గౌరవం అపారం. ఆ భాష మీద మాకెలాంటి ద్వేషం లేదు. శత్రుత్వం అంతకన్నా లేదు. కానీ ఆ భాష మాట్లాడేవారు చూపించే అతి సంకుచిత మనస్తత్వానికి, ఇరుకైన వారి ఆలోచనా ధోరణిని మాత్రం హర్షించలేం. సరిసమానులను గౌరవించడం ఎవరికైనా మంచిది. అది మర్యాదస్తుల లక్షణం.

ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు


ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు

ఇతరమతాల బారినుండి హిందూ మత సంరక్షణకు కన్యాకుమారి నుండి కటకము వరకు రాయలసీమలో తెలుగుజాతి వీరులను నిల్పిన విజయనగర సామ్రాజ్యపు పట్టుకొమ్మలు కంచి, చంద్రగిరి, పెనుగొండ, గుత్తి రాయదుర్గము, పంపానగర విజయనగరము. ''కంచి'' ఐక్యమత్య విధానంతో శివకంచి విష్ణు కంచి, వేగవతీ నది తీరాన నిల్పిన పుణ్య భూమి.

శ్రీ కృష్ణదేవరాయలు తాత ఈశ్వరరాయలు, తండ్రి నరసరాయలు, తిమ్మరుసు గోవింద రాజులు చంద్రగిరిలో జన్మించారు. శ్రీకృష్ణ దేవరాయలు జన్మస్థానము పెనుగొండ. అన్ని విద్యలూ పెనుగొండ, చంద్రగిరి, విజయనగరాలలో అభ్యసించారు.

శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసు పూర్వీకులు తెలుగుగడ్డలో పుట్టి తెలుగుతల్లి పాలు తాగిన వీరులు. తిమ్మరుసు, తండ్రి రాచిరాజు. తాత వేమరాజు. వీరు కొండవీడు, ఉదయగిరి సామంతరాజు. బహమనీ సుల్తాన్లు గజపతులు తాల్రాజును హతమార్చి నందువలన తిమ్మరుసు తండ్రి రాచిరాజు 1460లో చంద్రగిరి చేరారు. అందుకే తిమ్మరుసు పగపట్టిన కొండవీటి సింహం. గజపతులతో 7 సంవత్సరాలు యుద్ధం జరిపి పగతీర్చుకొన్నాడు. శ్రీకృష్ణ దేవరాయలను గజపతుల అల్లునిగా జేసారు. కాని గజపతులు వ్లుెచ్ఛాబ్ధి కుంభోద్బవులు. తిమ్మరుసు, శ్రీకృష్ణదేవరాయల అంత్య దశలో కుట్రలు పన్నారు. కాని తిమ్మరుసు, శ్రీకృష్ణదేవరాయల అనుబంధము విడదీయరానిది. వారు చివరి వరకూ ఆత్మీయులే. శ్రీకృష్ణదేవరాయలుకు, తిమ్మరుసు 67 సంవత్సరముల వయస్సులో సాధారణ మరణము సంభవించినది. (వసుంధరా పిహ్లెట్‌-ఫ్రాన్స్‌ -విజయనగర్‌-నేషన్‌ బుక్‌ ట్రస్ట్‌).

వరాహపురాణములో తెలుగు ఆది జంటకవులు ఘంటసింగయ్య, నంది మల్లయ్య, శ్రీకృష్ణ దేవరాయల పూర్వీకులు కంచి, అరణి దగ్గర దేవకీపుర దుర్గాధీశులు అని వివరించారు. ఆనాటికి ఈనాటికి కంచి పరిసర ప్రాంతాలలో తెలుగు మాతృభాషగా గల బ్రాహ్మణులు, వైశ్య, కాపు బలిజలు, చేనేత వర్గాలు, బలహీనవర్గాలు, దళితులు, ముస్లిములు ఎక్కువగా యున్నారు. ఆనాటి రాయలకొలువులో రాజకీయ ప్రాబల్యము వీరిదే.

తిమ్మరాజు శ్రీకృష్ణ దేవరాయలు ముత్తాత. భార్య దేవకి పేరున కంచి దగ్గర దేవకీపురము నిర్మించారు. తిమ్మరాజు కుమారుడు ఈశ్వరాయలు, భార్య బుక్కాంబ. క్రీ.శ. 1456 సంవత్సరము నాటికే ఈశ్వరరాయలు విజయనగర రాజప్రతినిధిగా సాళ్వనరసింహరాయలు సేనాధిపతిగా చంద్రగిరి నారాయణ వనములో ఉన్నారు. ఈశ్వరరాయలు సాళ్వనరసింహరాయలు కుడి భుజంగా కన్నడ ప్రాంతాలైన ఉమ్మత్తూరు, శ్రీరంగపట్నము, పశ్చిమ తెలుగు ప్రాంతాలు జయించారు. 1481 మార్చినెలలో బహమనీ సుల్తాన్‌ మహమ్మద్‌ షా కంచి దేవాలయము దోపిడీ సొమ్మును కందుకూరు వద్ద అడ్డగించిసొమ్ముతో సహా శిబిరము దోచుకొన్నాడు. శ్రీకృష్ణ దేవరాయల తండ్రి నరసరాయలు సాళ్వనరసింహరాయల సేనాధిపతిగా, బహమనీ సైన్యాధ్యక్షుడు ఆదిఖాన్‌ ఫకాషి ఉల్ముల్కును పెనుకొండ వద్ద ఓడించాడు.

చివరి సంగమరాజు ప్రౌఢదేవరాయలు బలహీనుడు. ఈ సమయంలో నరసరాయలు పెనుకొండ నుండి సైన్యము సమీకరించుకొని విజయనగరము ప్రవేశించాడు. విజయనగరము అవలీలగా స్వాధీనమైనది. సాళ్వనరసింహరాజు సింహాసనము అధిష్టించాడు (1485).

శ్రీకృష్ణ దేవరాయల తాత ఈశ్వరరాయలు, తండ్రి నరసరాయలు యిరువురూ సాళ్వనరసింగరాయలు వద్ద చంద్రగిరి నారాయణవనములో సేనాధిపతులు, కార్యకర్తలు, విశ్వాసపాత్రులుగా వున్నారు. చంద్రగిరి నారాయణ వనములో జన్మించిన నరసరాయలు చంద్రగిరి , పెనుకొండ, గుత్తి ప్రాంత విజయనగర రాజప్రతినిధిగా ఎక్కువ కాలమున్నాడు.

ఈ కాలములో తిమ్మరుసు చంద్రగిరి నారాయణవనంలో ఉంటూ తమ్ముడు గోవిందరాజులు, నరసరాయలు పెనుకొండ యందు ఎక్కువ కాలము (1485 నుండి 1490) ఉండేవిధంగా ప్రయత్నించారు. ఈ సమయములో 1489లో శ్రీకృష్ణ దేవరాయలు సాగివంశపు రాజకుమారి నాగులాదేవికి పెనుకొండ యందు జన్మించినాడు.

''తిప్పాజీ నాగలాదేవ్యో: కౌసల్య సుమిత్రాయో'' వీరనరసింహ రాయల శాసనము ప్రకారము నాగలాదేవి నరసరాయకుని కుల వధువని దేలుచున్నది. (డా|| నేలటూరి వెంకటరమణయ్య) శ్రీకృష్ణ దేవరాయల తల్లి సాగివంశపు రాజకుమారి అని-శ్రీరాజాదాట్ల వేంకట సింహాద్రి జగపతిరాజు సమర్పించిన తామ్రశాసనము వివరించింది. విజయనగర చరిత్ర-నూతలపాటి పేరరాజు) శ్రీకృష్ణదేవరాయలు జన్మస్థానము చంద్రగిరి నారాయణవనము అనడానికి తక్కువ ఆధారాలు వున్నాయి. అచ్యుత దేవరాయలు, శ్రీరంగరాయలు జన్మస్థానాలు పెనుకొండ. పెనుకొండ సమీపాన స్మార్తసమన్వయ శివకేశవుల దేవాలయాలు 32 ప్రాకారాలు గల చోళ సముద్రం లేపాక్షి శిల్ప, చిత్ర, సంగీత, నాట్య కళల విశిష్ఠ దేవాలయము విరుపన్న నాయకుని సోదరుడు విరుపన్న చేత అచ్యుత దేవరాయలు నిర్మింపజేశాడు. అచ్యుతాపురము, తల్లి ఓ బుళాపురము, తమ్ముడు శ్రీరంగనాయకులు పేరున ఉక్కడం శ్రీరంగాపురం నిర్మించారు.

శ్రీకృష్ణ దేవరాయలు యింటి పేరు సంపెటవారు అని పెద్దన వల్ల తెలుస్తోంది. పెద్దన గారి చాటువు- ''సంపెట నరపాల సార్వభౌముడు''

రాయరావుతుగండ రాచయేనుగు వచ్చి- యార్లకోట గోరాడునాడు- ''సంపెట నరపాల సార్వభౌముడు'' వచ్చి సింహాద్రి జయశిల జేర్చునాడు.

సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణా చార్యులు- మా పెనుకొండ గ్రంథము- పేజీ నెం.59.

పొరపాట్లు చరిత్రలో అనేకం జరుగుతుంటాయి. ''రాయల సీమలో ఒక వింత అలవాటుంది. వంశం పేరు వేరుగా ఉంటుంది. రాయలవంశం తుళువంశం వారి యింటి పేరు సంపెట వారు. నేటికీ అనంతపురం జిల్లాలో సంపెట అని యింటిపేరు గల బలిజలు చాలామంది ఉన్నారు. పెనుకొండలో అనేక యుద్ధాలు జరిగాయి. విజయనగర ప్రారంభదినాల్లో పెనుకొండ ప్రధాననగరము. తర్వాత రాజధానిగా మారింది. పెనుకొండ శాపం వల్ల శిలగా మారిన ఒక అప్సరస.

అల్లసాని పెద్దన మనుచరిత్రలో చంద్రవంశపు యయాతి రాజు కుమారుడు తుర్వసుని కీర్తి స్ఫూర్తి వలన రాజవంశము పేరు తుళువాన్వయ మైయ్యిందని (పద్యము 21-22 యందు) వివరించారు. తెలుగు వ్యాకరణం ప్రకారము ''ర'' ''ళ''గా వ్యవహరింపబడి తుర్వసులు-తుళువసులుగా మారింది.

కర్ణాటకము భాషాపదము కాదు. విశాల దక్షిణాపథములో ఒక భాగం, ఒక రాగం, ఒక కర్నాటక సంగీతం. విజయనగర సామ్రాజ్యము దక్షిణాపథ సామ్రాజ్యము. కన్యాకుమారి నుండి కటకము వరకు గల రాయల సామ్రాజ్యము రాయలసీమ.

విజయనగరము పంపానగరమని, అనాది నుండీ పేరుగల తెలుగు తల్లి పార్వతీ పరమేశ్వురుల పుణ్యస్థలము. తెలుగువారు ఆదిశివగణము నాగులయక్షుల ప్రతిబింబాలు. అందరూ నేడు చాళుక్యుల ప్రాంతము హిరణ్యరాష్ట్రమని అంగీకరిస్తున్నారు. చాళుక్య నందరాజు వారసుడు విజయద్వజుడు క్రీ.శ.1150లో విజయనగరము నిర్మించినారు. ఆ పుణ్యఫలము చేత చాళుక్యుల వారసుడు ఆరవీటి సోమదేవ రాజు కుంజరకోన (ఆనెగొంది)లో మాలిక్‌ నెబిని ఓడించాడు (క్రీ.శ.1334). ఆనెగొంది స్వాధీనం చేసుకొన్నాడు. ఆర్వీటి పిన్నమరాజు, రాఘవుడు కంపిలి రాయలను ఓడించారు. ఆనాడే తెలుగు తేజము కాకతీయుల రాజ్యం శంఖం పూరించి ''తేషాం శిరోభూషణమేవ దేశ త్రిలింగ నామా జగదేక సీమా'' అని తెలుగువారి యందు ఏకతా భావం కలిగించారు. విశాల విజయనగర సామ్రాజ్యానికి తెలుగు రాజులు పునాదులు వేశారు. ముస్లిములు ఆనాడే విభజించి పాలించే విధానాలు ప్రారంభించారు. హరహరరాయులు, బుక్కరాయలు తెలుగువారు కాకతీయుల బంధువులు. విధివశాన ముస్లిము రాజుల చేతిలో బందీలైనారు. ముస్లిము సుల్తాన్‌ పంటపండింది. ముస్లింల సైన్యసహకారంతో ఆనెగొంది, కంపిలి ప్రాంతాల స్వాధీనానికి సహకరించినారు. ప్రారంభంలో హరిహరరాయలు, బుక్కరాయలు ఆరవీటి వారిని వీరబల్లాలుని ఎదురించలేక గుత్తి, పెనుకొండ ప్రాంతాలలో మొదట స్థావరాలు ఏర్పరచుకొని క్రమంగా ఆనెగొంది స్వాధీనపరచుకొన్నారు. కావున విజయనగర స్థపనకు ఆదిస్థానం తెలుగు నేల స్మార్తసమన్వయ బ్రాహ్మణ మత విద్యారణ్య స్వామి అండదండలతో విజయనగర సామ్రాజ్యము అభివృద్ధి చెందింది. విద్యారణ్యస్వామి వారు తెలుగువారు. ఆనాటికి ఈనాటికి విజయనగర సామ్రాజ్యము తెలుగువారి సామ్రాజ్యము. విజయనగర సామ్రాజ్యము కుంజరకోన (ఆనెగొంది) పంపానగరము (హంపి) నేడు కన్నడ రాష్ట్రములో వున్నా తెలుగు వారే ఎక్కువగా ఉన్నారు. విజయనగర సామ్రాజ్యములో మొదటి నుండి చివర వరకు తెలుగు, తమిళ, మళయాళ భాషా ప్రాంతాలు 80 శాతము కన్నడ ప్రాంతాలు కేవలము 20 శాతము! కన్నడ ప్రాంత రాజులు ఉమ్మత్తూరు, శ్రీరంగ పట్నం నిరంతరం స్వతంత్రించేవారు.

విజయనగర సామ్రాజ్యము తల, మొండెము, కాళ్లు, చేతులు కంచి, చంద్రగిరి, పెనుకొండ, గుత్తి పంపానగరము విజయనగరము. విజయనగర సామ్రాజ్య స్థాపన కాలము నుండి చివరి వరకు -యువరాజులు లేక కాబోవు విజయనగర రాజులు ఈ ప్రాంతాల రాజప్రతినిధులుగా ఉన్నారు.

శ్రీకృష్ణ దేవరాయలు రెండవ రాజధాని విజయనగరం వలే ఏడు కోటలు గల పెనుకొండ, వేసవి విడిది, వసంతోత్సవాలు స్థావరంగా ఎక్కువ కాలము గడిపేవారు. వ్యాసరాయలు కృష్ణరాయలు ఏకాంతంగా రాజకీయాలు పెనుకొండలో చర్చించుకొనేవారు. నాగలాపురము, నాగసముద్రము గ్రామాలు పెనుకొండ సమీపంలో వున్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు జన్మస్థానమో? విద్యాస్థానమో? రణరంగ విద్యాబుద్ధులు అప్పాజీ, గోవిందరాజులు నేర్పించిన స్థానమో? చారిత్రక పరిశోదనలు అవసరము. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి, రాజకవి, కవిపోషకుడు. భువనవిజయంలో అశువుగా కవిత్వం చెప్పగల మేథావి. యాంధ్రులతో గుడిమాడి జీవనము సల్పియాంధ్రమున గ్రంథరచనము చేసి యాంధ్రకవుల నాదరించి పోషించి యాంధ్రవాజ్ఞయమును పెంపొందించిన తుళువరాజులు ఆంధ్రులనడంలో సందేహం లేదు. -డాక్టర్‌ నేలటూరి వెంకటరమణయ్య.

దేవకి, తిప్పాంబ, నగలాదేవి, ఓబాంబ, తిరుమలమ్మ, వరదరాజమ్మ తెలుగు రాజ పుత్రికలను వివాహమాడిన విజయనగర రాజులు తెలుగువారే.

శ్రీకృష్ణదేవరాయలు శ్రీవేంకటేశ్వరుని నిరంతర భక్తుడు. తిరుమలాంబ, చిన్నాదేవి విగ్రహాలు తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆలయప్రాంగణంలో ఆనాడు కొలువు తీరి వుండేవి. మరి ఈనాడో?

చివరికి మిగిలేది? శ్రీకృష్ణదేవరాయల అమరగాథ తెలుగువారి అందరి కథ. చిటికన వేలు కొనగోటితో దక్షణాపథము సంరక్షించిన తిమ్మరుసు తమ్ముడు గోవిందరాజు స్మృతి చిహ్నాలు పెనుకొండలో నిదిరిస్తున్నవి. ఆ స్మృతి చిహ్నాలను శ్రీకృష్ణదేవరాయలు రాయలసీమ రాజసం, తేజంతో ఉట్టి పడేలా నిర్మించారు. ఆనాడుబానిసలం. తిమ్మరుసు వర్దంతి ఉత్సవాలు సమాధుల వద్ద జరుపలేదు.

నేడు స్వంతంత్రులం. కాని ఈనాడో?

Friday, November 18, 2011

మనుచరిత్ర - ద్వితీయశ్వాసము

ద్వితీయాశ్వాసము

శ్రీఖండ శీతనగ మ
ధ్యాఖండక్షోణిమండ లాఖండల వి
ద్యాఖేలనభోజ సుధీ
లేఖద్రుమ కృష్ణరాయ లీలామదనా

అవధరింపుము జైమిని మునీంద్రునకుం ప్రజ్ఞాసాంద్రంబులగు పక్షీంద్రంబు లవ్వలికథ ఇట్లని చెప్పందొడంగె

అటజనికాంచె భూమిసురు డంబరచుంబి శిర స్సర జ్ఝరీ
పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌
కటకచరత్‌ కరేణు కర కంపిత సాలము శీతశైలమున్‌

కాంచి అంతరంగంబునం తరంగితంబగు హర్షోత్కర్షంబున

నరనారాయణ చరణాం
బురుహ ద్వయ భద్రచిహ్నముద్రిత బదరీ
తరు షండమండలాంతర
సరణిన్‌ ధరణిసురుండు సన చన నెదుటన్‌

ఉల్లల దలకా జలకణ
పల్లవిత కదంబ ముకుళ పరిమళ లహరీ
హల్లోహల మద బంభర
మల్లధ్వనులెసగ విసరె మరుదంకురముల్‌

తొండముల్‌ సాచి యందుగు చిగుళ్ళకు నిక్కు
కరుల దంతచ్ఛాయ కడలుకొనగ
నెలవుల వనదంశములుమూగి నెరెవెట్ట
కోల్పులుల్‌ పొదరిండ్ల గురకలిడగ
సెలయేటి యిసుకలంకల వరాహంబులు
మొత్తంబులై త్రవ్వి ముస్తెలెత్త
అడ్డంబు నిడువు నాబడ్డలగతి మను
బిళ్ళు డొంకలనుండి క్రేళ్ళుదాట

ప్రబల భల్లుక నఖ భల్ల భయద మథన
శిథిల మధుకోశ విసర వికీర్ణ మక్షి
కాంతరాంతర దంతురి తాతపమున
పుడమి తిలతండుల న్యాయమున వెలుంగ

పరికించుచు డెందంబున
పురికొను కౌతుకముతోడ భూమీసురు డ
గ్గిరి కటక తట నిరంతర
తరు గహన గుహా విహార తత్పరమతియై

నిడుద పెన్నెరిగుంపు జడగట్ట సగరు ము
మ్మనుమండు తపము గైకొనిన చోటు
జరఠ కచ్ఛప కులేశ్వరు వెన్ను గానరా
జగతికి మిన్నేరు దిగిన చోటు
పుచ్చడీకతనంబుపోబెట్టి గిరికన్య
పతిగొల్వ నాయాసపడిన చోటు
వలరాచరాచవా డలికాక్షు కనువెచ్చ
కరగిన యల కనికరపు చోటు

తపసియిల్లాండ్ర చెలువంబు తలచి తలచి
మున్ను ముచ్చిచ్చును విరాళిగొన్న చోటు
కనుపవులు వేల్పుబడవాలు కన్నచోటు
హర్షమున జూచి ప్రవరాఖ్యు డాత్మలోన

విలయ కృశానుకీలముల వేడిమి పోడిమి మాలి వెల్మిడిన్‌
కలసిన భూతధాత్రి మరి క్రమ్మర రూపయినిల్చి యోషధుల్‌
మొలవగ జేయునట్టి నయముం ప్రతికల్పము నెట్లు గాంచు నీ
చలిమలవల్ల నుల్లసిలు చల్లదనంబును నూనకుండినన్‌

పసపునిగ్గులుదేరు పాపజన్నిదమొప్ప
ప్రమథాధిపతి యింటిపట్టెరింగె
శచి కీత గరపుచు చదలేట సురరాజు
జలకేశి సవరించు చెలువెరింగె
అదనుతో చేపి చన్నవిసి యోషధుల మ
న్మొదవు కొండలకెల్ల పిదుకనెరిగె
వేల్పుటింతులలోన విర్రవీగుచు మేన
నవరత్నరచనల రవణమెరిగె

పరిపరివిధంపు జన్మంపు పరికరంపు
సొంపుసంపద నిఖిల నిలింపసభయు
నప్పటప్పటికిని జిహ్వత్రుప్పు డుల్ల
నామెత లెరింగెనీ తుషారాద్రి కతన

తలమే బ్రహ్మకునైన యీ నగమహత్వ్తంబెన్న నే నియ్యడం
గల చోద్యంబులు రేపు కన్గొనియెదం గాకేమి నేడేగెదన్‌
నళినీబాంధవ భాను తప్త రవికాంత స్యంది నీహార కం
దళ చూత్కారపరంపరల్‌ పయిపయిన్‌ మధ్యాహ్నముం దెల్పెడున్‌

అనుచు గ్రమ్మరువేళ నీహారవారి
బెరసి తత్పాదలేపంబు కరగిపోయె
కరగిపోవుట యెరుగ డద్ధరణిసురుడు
దైవకృతమున కిల నసాధ్యంబు కలదె

అతడ ట్లౌషధహీనుడై నిజపురీ యాత్రా మిళత్‌ కౌతుకో
ద్ధతి బోవన్‌ సపది స్ఫుటార్తి చరణద్వంద్వంబు రాకుండినన్‌
మతి చింతించుచు నవ్విధం బెరిగి హా నన్నిట్లు దైవంబ తె
చ్చితె యీ ఘోర వనప్రదేశమునకున్‌ సిద్ధాపదేశంబునన్‌

ఎక్కడి యరుణాస్పదపుర
మెక్కడి తుహినాద్రి క్రొవ్వి యే రాదగునే
అక్కట మును సనుదెంచిన
దిక్కిదియని యెరుగ వెడలుతెరు వెయ్యదియో

అకలం కౌషధసత్వముం దెలియ మాయా ద్వార కావంతి కా
శి కురుక్షేత్ర గయా ప్రయాగములు నే సేవింప కుద్దండ గం
డక వేదండ వరాహ వాహరిపు ఖడ్గ వ్యాఘ్ర మిమ్మంచుకొం
డకు రాజెల్లునె బుద్ధిజాడ్యజని తోన్మాదుల్‌ గదా శ్రోత్రియుల్‌

నను నిముసంబుగానకయున్న నూరెల్ల
నరయు మజ్జనకుడెం తడలునొక్కొ
ఎపుడు సంధ్యలయందు నిలువెళ్ళనీక న
న్నోమెడు తల్లి యెంతొరలునొక్కొ
అనుకూలవతి నాదు మనసులో వర్తించు
కులకాంత మదినెంత కుందునొక్కొ
కేడ తోడునీడలై వర్తించు సచ్ఛాత్రు
లింతకు నెంత చింతింతురొక్కొ

అతిథిసంతర్పణంబు లేమయ్యెనొక్కొ
అగ్నులేమయ్యెనొక్కొ నిత్యంబులైన
కృత్యములబాసి దైవంబ కినుకనిట్లు
పారవైచితె మిన్నులుపడ్డ చోట

నను నిలుసేర్చు నుపాయం
బొనరింపగజాలు సుకృతి యొక డొదవడొకో
యనుచున్‌ చింతాసాగర
మున మునిగి భయంబు గదుర పోవుచు నెదురన్‌

కులిశధారాహతి పొలుపున పైనుండి
యడుగుమోవగ జేగురైనతటుల
కనుపట్టులోయ గంగానిర్ఝరము వార
చలువయౌ నయ్యేటి కొలకులందు
నిసుకవెట్టిన నేల నేచి యర్కాంశుల
చొరనీక దట్టమై యిరులు గవియు
క్రముక పున్నాగ సారంగ రంభా నారి
కేళాది విటపి కాంతారవీథి

గెరలు పిక శారికా కీర కేకి భృంగ
సారసధ్వని తనలోని చంద్రకాంత
దరులు ప్రతిశబ్దమీన గంధర్వ యక్ష
గాన ఘూర్ణితమగు నొక్క కోనగనియె

కనుగొని యిది మునియాశ్రమ
మను తహతహవొడమి యిచటి కరిగిన నాకున్‌
కననగు నొక తెరకువ యని
మనమునగల దిగులు కొంత మట్టువడంగన్‌

నికట మహీధరాగ్ర తట నిర్గత నిర్ఝరధార బాసి లో
యకు తలక్రిందుగా మలకలైదిగు కాలువవెంట పూచు మ
ల్లిక లవలంబనంబుగ నలిప్రకరధ్వని చిమ్మిరేగ లో
నికి మణిపట్టభంగసరణిన్‌ ధరణీసురుడేగి చెంగటన్‌

తావుల్‌ క్రేవలజల్లు చెంగలువ కేదారంబు తీరంబునన్‌
మావుల్‌ క్రోవులు నల్లిబిల్లిగొను కాంతారంబునం దైందవ
గ్రావాకల్పిత కాయమాన జటిల ద్రాక్షా గుళుచ్ఛంబులన్‌
పూవుందీవెల నొప్పు నొక్క భవనంబున్‌ గారుడోత్కీర్ణమున్‌

కాంచి తదీయ విచిత్రో
దంచిత సౌభాగ్యగరిమ కచ్చెరువడి య
క్కాంచనగర్భాన్వయమణి
యించుక దరియంగ నచటికేగెడు వేళన్‌

మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలుపు తెలుపు నొక్క మారుతమొలసెన్‌

అతడా వాతపరంపరా పరిమళ వ్యాపార లీలన్‌ జనా
న్విత మిచ్చోటని చేరబోయి కనియెన్‌ విద్యుల్లతావిగ్రహన్‌
శతపత్రేక్షణ చంచరీకచికురన్‌ చంద్రాస్య చక్రస్తనిన్‌
నతనాభిన్‌ నవలా నొకానొక మరున్నారీ శిరోరత్నమున్‌

అమల మణిమయ నిజమందిరాంగణస్థ
తరుణసహకార మూల వితర్ధి మీద
శీతలానిల మొలయ నాసీనయైన
అన్నిలింపాబ్జముఖియు అయ్యవసరమున

తతనితం బాభోగ ధవళాంశుకములోని
అంగదట్టపు కావిరంగువలన
శశికాంతమణిపీఠి జాజువారగ కాయ
లుత్తుంగ కుచపాళి నత్తమిల్ల
తరుణాంగుళీ ధూత తంత్రీస్వనంబుతో
జిలిబిలిపాట ముద్దులు నటింప
ఆలాపగతి చొక్కి యరమోడ్పు కనుదోయి
రతిపారవశ్య విభ్రమము తెలుప

ప్రౌఢి పలికించు గీతప్రబంధములకు
కమ్ర కరపంకరుహ రత్న కటక ఝణఝ
ణధ్వనిస్ఫూర్తి తాళమానములు కొలుప
నింపు తళుకొత్త వీణ వాయింపుచుండి

అబ్బురపాటుతోడ నయనాంబుజముల్‌ వికసింప కాంతి పె
ల్లుబ్బి కనీనికల్‌ వికసితోత్పలపంక్తుల క్రుమ్మరింపగా
గుబ్బమెరుంగు చన్గవ గగుర్పొడువన్‌ మదిలోన కోరికల్‌
గుబ్బతిలంగ చూచె నలకూబరసన్నిభు నద్ధరామరున్‌

చూచి ఝళంఝళత్‌ కటకసూచిత వేగ పదారవిందయై
లేచి కుచంబులున్‌ తురుము లేనడు మల్లలనాడ నయ్యెడన్‌
పూచిన యొక్క పోక నునుబోదియజేరి విలోకనప్రభా
వీచికలన్‌ తదీయ పదవీ కలశాంబుధి వెల్లిగొల్పుచున్‌

మునుమున్‌ పుట్టెడు కొంకు లౌల్యమునిడన్‌ మోదంబు విస్తీర్ణతన్‌
జొనుపన్‌ కోర్కులు క్రేళ్ళుద్రిప్ప మదిమెచ్చుల్‌ రెప్పలల్లార్ప న
త్యనుషంగస్థితి రిచ్చపాటొసగ నొయ్యారంబునన్‌ చంద్రికల్‌
దనుకన్‌ చూచె లతాంగి భూసురు ప్రఫుల్లన్నేత్రపద్మంబులన్‌

పంకజముఖి కప్పుడు మై
నంకురితములయ్యె పులక లావిష్కృత మీ
నాం కానల సూచక ధూ
మాంకురములు బోలె మరియు నతనిన్‌ చూడన్‌

తొంగలిరెప్పలం తొలగద్రోయుచు పైపయి విస్తరిల్లు క
న్నుంగవ యాక్రమించుకొనునో ముఖచంద్రు నటంచు పోవనీ
కంగజు డానవెట్టి కదియన్‌ గురివ్రాసె ననంగ జారి సా
రంగమదంబు లేజెమట క్రమ్మె లలాటము డిగ్గి చెక్కులన్‌

అనిమేషస్థితిమాన్పె బిత్తరపుచూ పస్వేదతావృత్తి మా
న్పె నవస్వేదసమృద్ధి బోధకళమాన్పెన్‌ మోహవిభ్రాంతి తో
డనె గీర్వాణవధూటికిన్‌ భ్రమరకీటన్యాయ మొప్పన్‌ మను
ష్యుని భావించుట మానుషత్వము మెయింజూపెట్టెనా నత్తరిన్‌

ఇట్లతని రూపరేఖావిలాసంబులకుం జొక్కి యక్కమలపత్రేక్షణ యాత్మగతంబున

ఎక్కడివాడొ యక్షతన యేందు జయంత వసంత కంతులన్‌
చక్కదనంబునన్‌ గెలువజాలెడువాడు మహీసురాన్వయం
బెక్కడ ఈ తనూవిభవమెక్కడ యేలనిబంటుగా మరున్‌
డక్కకొనంగరాదె అకటా నను వీడు పరిగ్రహించినన్‌

వదనప్రభూత లావణ్యాంబుసంభూత
కమలంబులన వీని కన్నులమరు
నిక్కి వీనులతోడ నెక్కసక్కెములాడు
కరణినున్నవి వీని ఘనభుజములు
సంకల్పసంభ వాస్థానపీఠికవోలె
వెడదయైకనుపట్టు వీని యురము
ప్రతిఘటించు చిగుళ్ళపై నెర్రవారిన
రీతినున్నవి వీని మృదుపదములు

నేరెటేటియసల్‌ తెచ్చి నీరజాప్తు
సానబట్టిన రాపొడిచల్లి మెదిసి
పదను సుధనిడి చేసెనో పద్మభవుడు
వీని కాకున్న కలదె ఈ మేనికాంతి

సుర గరు డోరగ నర ఖే
చర కిన్నర సిద్ధ సాధ్య చారణ విద్యా
ధర గంధర్వ కుమారుల
నిరతము కనుగొనమె పోలనేర్తురె వీనిన్‌

అని చింతించుచు మీనకేతన ధనుర్య్జా ముక్త నారాచ దు
ర్దిన సమ్మూర్ఛిత మానసాంబురుహయై దీపించు పెందత్తరం
బున పేటెత్తిన లజ్జ నంఘ్రికటకంబుల్‌ మ్రోయ నడ్డంబు ని
ల్చిన నయ్యచ్చర జూచి చేరజని పల్కెన్‌ వాడు విభ్రాంతుడై

ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ ఒంటి చరించె దోటలే
కివ్వనభూమి భూసురుడ నే ప్రవరాఖ్యుడ త్రోవతప్పితిన్‌
క్రొవ్వున నిన్నగాగ్రమునకున్‌ చనుదెంచి పురంబుచేర నిం
కెవ్విధి కాంతు తెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగున్‌

అని తనకథ నెరిగించిన
తన కనుగవ మెరుగులుబ్బ తాటంకములున్‌
చనుగవయు నడుము వడకగ
వనిత సెలవివార నవ్వి వానికి ననియెన్‌

ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏ
కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా
గింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ
కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్‌

అని నర్మగర్భంబుగా బలికి క్రమ్మర నమ్మగువ యమ్మహీసురున కిట్లనియె

చిన్ని వెన్నెలకందు వెన్నుదన్ని సుధాబ్ధి
పొడమిన చెలువ తోబుట్టు మాకు
రహివుట్ట జంత్రగాత్రముల రాల్‌ కరగించు
విమలగాంధర్వంబు విద్య మాకు
అనవిల్తుశాస్త్రంపు మినుకు లావర్తించు
పని వెన్నతోడ పెట్టినది మాకు
హయమేధ రాజసూయములన పేర్వడ్డ
సవనతంత్రంబు లుంకువలు మాకు

కనకనగసీమ కల్పవృక్షముల నీడ
పచ్చరా చట్టుగమి రచ్చపట్టు మాకు
పద్మసంభవ వైకుంఠ భర్గ సభలు
సాముగరిడీలు మాకు గోత్రామరేంద్ర

పేరు వరూధిని విప్ర కు
మార ఘృతాచీ తిలోత్తమా హరిణీ హే
మా రంభా శశిరేఖ లు
దారగుణాఢ్యలు మదీయలగు ప్రాణసఖుల్‌

బహురత్న ద్యుతిమేదురోదర దరీభాగంబులం బొల్చు ని
మ్మిహికాహార్యమునన్‌ చరింతుమెపుడున్‌ ప్రేమన్‌ నభోవాహినీ
లహరీ శీతల గంధవాహ పరిఖేల న్మంజరీ సౌరభ
గ్రహణేందిందిర తుందిలంబులివి మత్కాంతార సంతానముల్‌

భూసుర కైతవకుసుమశ
రానన మాయింటి విందవైతివి గైకొ
మ్మా సముదంచ న్మణిభవ
నాసీనత సేద తీరి యాతిథ్యంబున్‌

కుందనమువంటి మేను మధ్యంది నాత
పోష్మహతి కందె వడదాకె నొప్పులొలుకు
వదన మస్మద్గృహంబు పావనము సేసి
బడలికలు వాసిచను మన్న బ్రాహ్మణుండు

అండజయాన నీవొసగునట్టి సపర్యలు మాకునచ్చె నిం
దుండగరాదు పోవలయునూరికి నింటికి నిప్పుడేను రా
కుండ నొకండువచ్చి మరియొండునె భక్తియ చాలు సత్క్రియా
కాండముతీర్ప వేగ చనగావలయున్‌ కరుణింపు నాపయిన్‌

ఏ నిక నిల్లుసేరుటకు నెద్ది యుపాయము మీ మహత్వ్తముల్‌
మానిని దివ్యముల్‌ మది తలంచిన నెందును మీ కసాధ్యముల్‌
కానము కాన తల్లి ప్రజలన్‌ నను కూర్పుమటన్న లేత న
వ్వాననసీమ తోప ధవళాయతలోచన వానికిట్లనున్‌

ఎక్కడియూరు కాల్నిలువ కింటికిబోయెదనంచు పల్కె దీ
వక్కట మీ కుటీరనిలయంబులకున్‌ సరిరాకపోయెనే
యిక్కడి రత్నకందరము లిక్కడి నందనచందనోత్కరం
బిక్కడి గాంగసైకతము లిక్కడి యీ లవలీనికుంజముల్‌

నిక్కముదాపనేల ధరణీసురనందన యింక నీపయిన్‌
చిక్కె మనంబు నాకు నను చిత్తజుబారికి నప్పగించెదో
చొక్కి మరందమద్యముల చూరల పాటలువాడు తేంట్ల సొం
పెక్కినయట్టి పూవు పొదరిండ్లను కౌగిట గారవించెదో

అనుటయు ప్రవరుం డిట్లను
వనజేక్షణ యిట్లు పలుక వరుసయె వ్రతులై
దినములు గడిపెడు విప్రుల
చనునే కామింప మది విచారము వలదే

వేలిమియున్‌ సురార్చనయు విప్రసపర్యయు చిక్కె భుక్తికిన్‌
వేళ యతిక్రమించె జననీజనకుల్‌ కడువృద్ధు లాకటన్‌
సోలుచు చింతతో నెదురుసూచుచునుండుదు రాహితాగ్ని నే
దూలు సమస్తధర్మములు తొయ్యలి నేడిలుసేరకుండినన్‌

నావుడు విన్నబాటు వదనంబున నించుక దోప పల్కె నో
భావజరూప యిట్టి యెలప్రాయము వైదికకర్మనిష్ఠలం
పోవగ నింక భోగములబొందుట యెన్నడు యజ్ఞకోటులం
బావనులౌటకున్‌ ఫలము మా కవుగిళ్ళ సుఖించుటే కదా

సద్యోవినిర్భిన్న సారంగనాభికా
హృదమై పిసాళించు మృగమదంబు
కసటువో బీరెండ కరగి కర్రలవంటి
గమగమ వలచు చొక్కపుజవాజి
పొరలెత్తి ఘనసారతరువుల తనుతాన
దొరగిన పచ్చకప్పురపు సిరము
గొజ్జంగి పూబొదల్‌ కురియంగ పటికంపు
దొనల నిండినయట్టి తుహినజలము

వివిధ కుసుమకదంబంబు దివిజతరుజ
మృదుల పనస ఫలాస వామేయ రత్న
భూషణంబులు కలవిందు భోగపరుడ
వయి రమింపుము ననుగూడి యనుదినంబు

అందునకు కొరయె వెన్నెల
గంధర్వాంగనల పొందు కాదని సంసా
రాంధువున పడియె దకట ది
వాంధము వెలుగుగని గొందినడగిన భంగిన్‌

ఎన్ని భవంబులన్‌ కలుగు నిక్షుశరాసన సాయక వ్యథా
ఖిన్నత వాడి వత్తలయి కేల కపోలములూది చూపులన్‌
విన్నదనంబు తోప కనువేదురునన్‌ పయిగాలి సోకినన్‌
వెన్నవలెన్‌ కరంగు అలివేణుల కౌగిటచేర్చు భాగ్యముల్‌

కుశలత యే వ్రతములనగు
నశనాయాపీడ నింద్రియనిరోధమునన్‌
కృశుడవయి యాత్మనలచుట
సశరీరస్వర్గసుఖము సమకొని యుండన్‌

అనిన ప్రవరుండు నీవన్న యర్థమెల్ల
నిజము కాముకుడైనవానికి అకాము
డిది గణించునె జలజాక్షి యెరిగితేని
నగరమార్గంబు చూపి పుణ్యమున పొమ్ము

బ్రాహ్మణు డింద్రియవశగతి
జిహ్మాచరణైక నిపుణ చిత్తజ నిశితా
జిహ్మగముల పాలై చెడు
బ్రహ్మానందాధిరాజ్య పదవీచ్యుతుడై

అనిన నత్తెరవ యక్కరకరిపలుకుల కులికి గరిగరింగరప గరకరిం జెరకువిలుకాడు పరగించు విరిదమ్మిగొరకలు నెరకుల చురుకుచురుక్కునం గాడిన గడుం గెరలి పరిణత వివిధ విబుధతరు జనిత మధురమధురసం బాను మదంబు నదటునం జిదిమిన నెరుంగక మదనహరునైన జదురునం గదియ గమకించు తిమురునం గొమిరెప్రాయంపు మదంబునను నొంటిపాటునం గంటికిం బ్రియంబై తంగేటిజున్ను చందంబునం గొంటుదనంబెరుంగక కురంగటనున్న యమ్మహీసురవరకుమారు తారుణ్య మౌగ్య్ధంబులం జేసి తన వైదగ్య్ధంబు మెరయగలిగెనని పల్లవించు నుల్లంబు నుల్లాసంబునం గదురు మదంబున నోసరించక చంచల దృగంచలప్రభ లతని ముఖాంబుజంబున బొలయ వలయ మణిగణచ్ఛాయాకలాపంబు లుప్పరంబెగయ కొప్పుచక్కం జెక్కుచు జక్కవగిబ్బలుంబోని గబ్బిగుబ్బలన్‌ జొబ్బిల్లు కుంకుమరసంబునం బంకిలంబులగు హారముక్తా తారకంబుల నఖకోరకంబులం గీరి తీరువడంజేయుచు పతిత వనతరు కుసుమ కేసరంబులు రాల్చు నెపంబున పయ్యెదవిదిల్చి చక్కసవరించుచు నంతంతం బొలయు చెలులం దలచూపకయుండం దత్తరంబునంజేసి బొమముడిపాటుతో మగిడిమగిడి చూచుచు జిడిముడిపాటు చూపుల నంకురించు జంకెల వారించుచుం జేరి యిట్లనియె

ఎందే డెందము కందళించు రహిచే నేకాగ్రతన్‌ నిర్వృతిం
జెందుం కుంభగత ప్రదీపకళికాశ్రీ దోప నెందెందు పో
కెందే నింద్రియముల్‌ సుఖంబు గను నా యింపే పరబ్రహ్మ, “మా
నందో బ్రహ్మ” యటన్న ప్రాజదువు నంతర్బుద్ధి నూహింపుమా

అనుచు తన్నొడబరుచు నయ్యమరకాంత
తత్తరము జూచి యాత్మ నతండు తనకు
సిగ్గు వెగటును బొడమ నిస్పృహత తెలుపు
నొక్క చిరునవ్వు నవ్వి యయ్యువిద కనియె

ఈ పాండిత్యము నీకు దక్క మరియెందే కంటిమే కామశా
స్త్రోపాధ్యాయిని
నా వచించెదవు మేలోహో త్రయీధర్మముల్‌
పాపంబుల్‌ రతి పుణ్యమంచు నిక నేలా తర్కముల్‌ మోక్ష ల
క్ష్మీప థ్యాగమసూత్ర పంక్తికివెపో మీ సంప్రదాయార్థముల్‌

తరుణీ రేపును మాపు హవ్యములచేతం తృప్తుడౌ వహ్ని స
త్కరుణాదృష్టి నొసంగు సౌఖ్యము లెరుంగన్‌ శక్యమే నీకు ఆ
కరణుల్‌ దర్భలు నగ్నులుం ప్రియములైన ట్లన్యముల్‌ కా వొడల్‌
తిరమే చెప్పకు మిట్టితుచ్ఛసుఖముల్‌ మీసాలపై తేనియల్‌

అనుటయు మాటలేక హృదయాబ్జము జల్లన మోము వెల్లనై
కనలుచు నీరుదేరు తెలికన్నుల నాతని పుల్కుపుల్కునన్‌
కనుగొని మాటలం బొదువు గద్గదికం తలయూచి యక్కటా
వనిత తనంతతా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌

వెతలంబెట్టకుమింక నన్ననుచు నీవీబంధమూడన్‌ రయో
ద్ధతి నూర్పుల్‌ నిగుడన్‌ వడిన్‌ విరులుచిందం కొప్పువీడం తనూ
లత తోడ్తో పులకింపగా ననునయాలా పాతిదీ నాస్యయై
రతిసంరంభము మీర నిర్జరవధూరత్నంబు పైపాటునన్‌

ప్రాంచద్భూషణ బాహుమూలగతితో పాలిండ్లుపొంగార పై
యంచుల్‌ మోవగ కౌగిలించి యధరంబాసింప హా శ్రీహరీ
యంచున్‌ బ్రాహ్మణు డోరమోమిడి తదీయాంసద్వయం బంటి పొ
మ్మంచున్‌ ద్రోచె కలంచునే సతులమాయల్‌ ధీరచిత్తంబులన్‌

త్రోపువడి నిలిచి ఘన ల
జ్జా పరవశయగుచు కొప్పుసవరించి యొడల్‌
దీపింప నతని చురచుర
కోపమునన్‌ చూచి క్రేటుకొనుచున్‌ పలికెన్‌

పాటున కింతులోర్తురె కృపారహితాత్మక నీవు త్రోవ ని
చ్చోట భవన్నఖాంకురము సోకె కనుంగొనుమంచు చూపి య
ప్పాటలగంధి వేదననెపంబిడి యేడ్చె కలస్వనంబుతో
మీటిన విచ్చు గుబ్బచనుమిట్టల నశ్రులు చిందువందగన్‌

ఈ విధమున నతికరుణము
గా వనరుహనేత్ర కన్నుగవ ధవళరుచుల్‌
కావికొననేడ్చి వెండియు
నా విప్రకుమారు జూచి యలమట పల్కెన్‌

చేసితి జన్నముల్‌ తపము చేసితి నంటి దయావిహీనతన్‌
చేసిన పుణ్యముల్‌ ఫలముసెందునె పుణ్యములెన్నియేనియున్‌
చేసినవాని సద్గతియె చేకురు భూతదయార్ద్రబుద్ధి కో
భూసురవర్య యింత తలపోయవు నీచదువేల చెప్పుమా

వెలివెట్టిరే బాడబులు పరాశరు బట్టి
దాశకన్యాకేళి తప్పుచేసి
కులములో వన్నెతక్కువయయ్యెనే గాధి
పట్టికి మేనక చుట్టరికము
అనుపుకాడై వేల్పు నాగవాసము గూడి
మహిమ గోల్పడియెనే మాందకర్ణి
స్వారాజ్య మేలంగనీరైరె సుర లహ
ల్యాజారుడైన జంభాసురారి

వారికంటెను నీ మహత్వ్తంబు ఘనమె
పవన ప ర్ణాంబు భక్షులై నవసి యినుప
కచ్చడాల్‌ కట్టుకొను మునిమ్రుచ్చులెల్ల
తామరసనేత్ర లిండ్ల బందాలు కారె

అనిన నేమియు ననక యవ్వనజగంధి
మేని జవ్వాదిపస కదంబించు నొడలు
కడిగికొని వార్చి ప్రవరుండు గార్హపత్య
వహ్ని నిట్లని పొగడె భావమున తలచి

దివిషద్వర్గము నీముఖంబునన తృప్తిం గాంచు నిన్నీశుగా
స్తవముల్‌ సేయు శ్రుతుల్‌ సమస్తజగదంతర్యామివిన్‌ నీవ యా
హవనీయంబును దక్షిణాగ్నియును నీయం దుద్భవించున్‌ క్రతూ
త్సవసంధాయక నన్ను కావగదవే స్వాహావధూవల్లభా

దాన జ పాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ
ధ్యానరతుండనేని పరదారధనాదుల కోరనేని స
న్మానముతోడ నన్ను సదనంబున నిల్పు మినుండు పశ్చిమాం
భోనిధిలోన క్రుంకకయమున్న రయంబున హవ్యవాహనా

అని సంస్తుతించిన నగ్నిదేవుం డమ్మహీదేవు దేహంబున సన్నిహితుం డగుటయు నమ్మహాభాగుండు గండుమీరి పొడుపుగొండ నఖండ సంధ్యారాగ ప్రభామండ లాంతర్గతుండగు పుండరీకవనబంధుడుంబోలె నుత్తప్త కనకద్రవధారాగౌరంబగు తనూచ్ఛాయా పూరంబున నక్కాన వెలిగించుచు నిజగమననిరోధిని యగు నవ్వరూధిని హృదయకంజంబున రంజిల్లు నమందానురాగరస మకరందంబు నందంద పొంగంజేయుచు పావకప్రసాద లబ్ధంబగు పవనజవంబున నిజమందిరంబునకరిగి నిత్యకృత్య సత్కర్మకలాపంబులు నిర్వర్తించెనని మార్కండేయుండు క్రోష్టికిం జెప్పెనని చెప్పిన

జైమిని యా దివ్య ఖగ
గ్రామణులం జూచి వేడ్కగడలుకొనంగా
ఆ మీద వరూధిని విధ
మేమయ్యె నెరుంగ చెప్పరే నా కనుడున్‌

మనుచరిత్ర - ప్రథమశ్వాసము

(తొలితెలుగు ప్రబంధం మనుచరిత్ర. నీతినీ ధర్మాన్నీ భక్తినీ బోధించటం అంతకుముందు వచ్చిన తెలుగు రచనల గమ్యం (శ్రీనాథుడి శృంగారనైషథం విషయంలో తప్ప) ఐతే పెద్దన తన మనుచరిత్రతో తెలుగు సాహిత్యాన్నంతటినీ ఓ మలుపు తిప్పాడు. ఈ రచన ఉచ్ఛస్థితిలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల వల్ల ప్రజల్లో కలిగే పట్టరాని ఆనందానికి, జీవితమ్మీద భవిష్యత్తుమీద కలిగే అకుంఠితమైన ఆశాభావానికి అద్భుతరూపం. కృష్ణరాయల విజయాల్ని అతిచేరువగా చూస్తూ, వాటివల్ల ఆ సమాజంలో పెరుగుతోన్న ఆత్మస్థైర్యాన్ని, కనీవినీ ఎరుగని సౌభాగ్యాన్ని అనుక్షణం అవలోకిస్తూ, ఆనందించిన ఒక మహామనీషి హృదయంలోంచి మహోల్లాసం పెల్లుబికి ఈ కావ్యంగా బయటకు వచ్చింది. వాల్మీకి శోకం శ్లోకం ఐతే పెద్దన ఆనందం ప్రబంధమైంది.

సామాజికస్థితిగతులు అసంతృప్తికరంగా ఉన్నప్పుడు, జీవితం దుఃఖభాజనంగా కనిపించినప్పుడు “సాహిత్యప్రయోజనం సమాజశ్రేయస్సే” అన్న దృష్టి సాహితీకారులకు కలగటం చూశాం, ఇప్పుడూ చూస్తున్నాం. సుఖసంతోషాల్తో సౌభాగ్యంతో ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ఉన్న సమాజపు జీవనదృష్టిని ప్రతిబింబించేవి తొలితరం ప్రబంధాలు. వాటిలో తొలిదీ ఉన్నతమైనదీ ఈ మనుచరిత్ర.

ప్రథమాశ్వాసము

శ్రీవక్షోజ కురంగనాభ మెదపై చెన్నొంద విశ్వంభరా
దేవిం తత్కమలాసమీపమున ప్రీతిన్నిల్పినాడో యనం
గా వందారు సనందనాది నిజభక్తశ్రేణికిం దోచు రా
జీవాక్షుండు కృతార్థుజేయు శుభదృష్టిం కృష్ణరాయాధిపున్‌

ఉల్లమునందు నక్కటికమూనుట మీకులమందు కంటిమం
చల్లన మేలమాడు అచలాత్మజమాటకు లేతనవ్వు సం
ధిల్ల కిరీటి పాశుపత దివ్యశరాఢ్యుని చేయు శాంబరీ
భిల్లుడు కృష్ణరాయల కభీష్టశుభ ప్రతిపాది కావుతన్‌

నాలుగుమోములన్‌ నిగమనాదములుప్పతిలం ప్రచండవా
తూలగతిన్‌ జనించు రొదతోడిగుహావళి నొప్పు మేరువుం
బోలి పయోజపీఠి మునిముఖ్యులుగొల్వగ వాణిగూడి పే
రోలగమున్న ధాత విభవోజ్వ్జలుజేయుత కృష్ణరాయనిన్‌

అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా
ల్యాంకవిచేష్ట తొండమున అవ్వలిచన్‌ కబళింపబోయి ఆ
వంక కుచంబు గాన కహివల్లభహారము గాంచి వే మృణా
ళాంకురశంక నంటెడు గజాస్యుని కొల్తు నభీష్టసిద్ధికిన్‌

చేర్చుక్కగానిడ్డ చిన్నిజాబిల్లిచే
సిందూరతిలకంబు చెమ్మగిల్ల
నవతంస కుసుమంబునందున్న ఎలదేటి
రుతి కించిదంచితశ్రుతుల నీన
ఘనమైన రారాపు చనుదోయి రాయిడి
తుంబీఫలంబు తుందుడుకుజెంద
తరుణాంగుళిచ్ఛాయ దంతపుసరకట్టు
లింగిలీకపు వింతరంగులీన

ఉపనిషత్తులు బోటులై యోలగింప
పుండరీకాసనమున కూర్చుండి మదికి
నించువేడుక వీణవాయించు చెలువ
నలువరాణి మదాత్మలో వెలయుగాత

కొలుతున్‌ మద్గురు విద్యా
నిలయున్‌ కరుణా కటాక్ష నిబిడ జ్యోత్స్నా
దళితాశ్రితజన దురిత
చ్ఛల గాఢ ధ్వాంత సమితి శఠకోపయతిన్‌

వనజాక్షోపము వామలూరుతనయున్‌ ద్వైపాయనున్‌ భట్టబా
ణుని భాసున్‌ భవభూతి భారవి సుబంధున్‌ బిల్హణుం కాళిదా
సుని మాఘున్‌ శివభద్రు మల్హణకవిం చోరున్‌ మురారిన్‌ మయూ
రుని సౌమిల్లిని దండి ప్రస్తుతుల పేర్కొంచున్‌ వచశ్శుద్ధికిన్‌

వ్యాసరచిత భారతామ్నాయ మాంధ్రభా
షగ నొనర్చి జగతి పొగడు కనిన
నన్నపార్యు, తిక్కనను కృతక్రతు, శంభు
దాసు నెర్రసుకవి తలతు భక్తి

భరమైతోచు కుటుంబరక్షణకుగా ప్రాల్మాలి చింతన్‌ నిరం
తర తాళీదళసంపుట ప్రకర కాంతారంబునం దర్థపుం
తెరువాటుల్‌ తెగికొట్టి తద్‌జ్ఞపరిషద్‌ విజ్ఞాత చౌర్యక్రియా
విరసుండై కొరతంబడుం కుకవి పృధ్వీభృ త్సమీపక్షితిన్‌

అని యిష్టదేవతా వం
దన సుకవిస్తుతులు కుకవితతి నికృతియు చే
సి నవీనకావ్యరచనకు
అనుకూలకథల్‌ తలచు ఆసమయమునన్‌

ఉదయాచలేంద్రంబు మొదల నెవ్వాని కుమా
రతకు క్రౌంచాచలరాజమయ్యె
ఆవాడపతి సకంధర సింధురాధ్యక్షు
లరిగాపు లెవ్వాని ఖరతరాసి
కా పంచగౌడధాత్రీపదం బెవ్వాని
కసివారుగా నేగునట్టి బయలు
సకలయాచకజనాశాపూర్తి కెవ్వాని
ఘనభుజదండంబు కల్పశాఖి

ప్రబల రాజాధిరాజ వీరప్రతాప
రాజపరమేశ బిరుదవిభ్రాజి యెవ్వ
డట్టి శ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యు
డొక్కనాడు కుతూహలంబుప్పతిల్ల

ఇందీవరంబులనీను క్రాల్గన్నుల
శరదిందుముఖులు చామరములిడగ
బణినసూను కణాద బాదరాయణ సూత్ర
ఫక్కి విద్వాంసు లుపన్యసింప
పార్శ్వభూమి నభీరు భటకదంబ కరాళ
హేతి చ్ఛటా చ్ఛాయ లిరులుకొనగ
సామంత మండనోద్దామ మాణిక్యాంశు
మండలం బొలసి యీరెండ కాయ

మూరురాయర గండ పెండార మణి మ
రీచి రింఛోళి కలయ నావృతములగుచు
అంకపాళి నటద్దుకూలాంచలములు
చిత్రమాంజిష్ట విభ్రమశ్రీ వహింప

భువనవిజయాఖ్య సంస
ద్భవన స్థిత భద్రపీఠి ప్రాజ్ఞులగోష్టిన్‌
కవితామధురిమ డెందము
తవులన్‌ కొలువుండి సదయతన్‌ నను పల్కెన్‌

సప్తసంతానములలో ప్రశస్తి గాంచి
ఖిలముకాకుండునది ధాత్రి కృతియ కాన
కృతి రచింపుము మాకు శిరీషకుసుమ
పేశల సుధామయూక్తుల పెద్దనార్య

హితుడవు చతురవచోనిధి
వతుల పురాణాగమేతిహాస కథార్థ
స్మృతియుతుడ వాంధ్రకవితా
పితామహుడ వెవ్వరీడు పేర్కొన నీకున్‌

మనువులలో స్వారోచిష
మనుసంభవ మరయ రససమంచిత కథలన్‌
విననింపు కలిద్వంసక
మనఘ భవచ్చతురరచన కనుకూలంబున్‌

కావున మార్కండేయ పురాణోక్త ప్రకారంబునం జెప్పుమని కర్పూరతాంబూలంబు వెట్టినం పట్టి మహాప్రసాదం బని మోదంబున నమ్మహాప్రబంధ నిబంధనంబునకు ప్రారంభించితి నేతత్కథా నాయకరత్నంబగు నమ్మహీనాథు వంశావతారం బెట్టిదనిన

కలశపాథోరాశి గర్భవీచి మతల్లి
కడుపార నెవ్వాని కన్నతల్లి
అనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాడు
వన్నెవట్టు ననార్తవంపు పువ్వు
సకల దైవత బుభుక్షాపూర్తి కెవ్వాడు
పుట్టు గానని మేని మెట్టపంట
కటికిచీకటి తిండి కరముల గిలిగింత
నెవ్వాడు దొగకన్నె నవ్వజేయు

నతడు వొగడొందు మధుకైటభారి మరది
కళల నెలవగువాడు చుక్కలకు రేడు
మిసిమి పరసీమ వలరాజు మేనమామ
వేవెలుంగుల దొర జోడు రేవెలుంగు

ఆ సుధాధాము విభవ మహాంబురాశి
కుబ్బు మీరంగ నందను డుదయమయ్యె
వేదవేదాంగ శాస్త్రార్థ విశద వాస
నాత్త ధిషణా ధురంధురుండైన బుధుడు

వానికి పురూరవుడు ప్ర
జ్ఞానిధి యుదయించె సింహసదృశుడు, తద్భూ
జానికి నాయువు తనయుం
డై నెగడె, నతండు గనె యయాతి నరేంద్రున్‌

అతనికి యదు తుర్వసు లను
సుతు లుద్భవమొంది రహిత సూదనులు కళా
న్వితమతులు వారిలో వి
శ్రుతకీర్తి వహించె తుర్వసుడు గుణనిధియై

వాని వంశంబు తుళువాన్వవాయ మయ్యె
నందు పెక్కండ్రు నృపు లుదయంబు నొంది
నిఖిల భువన ప్రపూర్ణ నిర్ణిద్రకీర్తి
నధికులైరి తదీయాన్వయమున బుట్టి

ఘనుడై తిమ్మ క్షితీశాగ్రణి శఠ కమఠ గ్రావ సంఘాత వాతా
శన రా డాశాంత దంతి స్థవిర కిరుల జంజాటముల్‌ మాన్పి యిమ్మే
దిని దోర్దండైక పీఠిన్‌ తిరముపరచి కీర్తిద్యుతుల్‌ రోదసిం బ
ర్వ నరాతుల్‌ నమ్రులై పార్స్వముల గొలువ తీవ్రప్రతాపంబు సూపెన్‌

వితరణఖని యా తిమ్మ
క్షితిపగ్రామణికి దేవకీదేవికి నం
చితమూర్తి యీశ్వర ప్రభు
డతిపుణ్యుడు పుట్టె సజ్జనావన పరుడై

బలమదమత్త దుష్టపుర భంజనుడై పరిపాలితార్యుడై
యిలపయి తొంటి యీశ్వరుడె యీశ్వరుడై జనియింప రూపరెన్‌
జలరుహనేత్రలం దొరగి శైలవనంబుల భీతచిత్తులై
మెలగెడు శత్రుభూపతుల మేనుల దాల్చిన మన్మథాంకముల్‌

నిజ భుజాశ్రిత ధారుణీ వజ్రకవచంబు
దుష్ట భుజంగాహి తుండికుండు
వనజేక్షణా మనోధన పశ్యతోహరుం
డరిహంస సంస దభ్రాగమంబు
మార్గణగణ పిక మధుమాస దివసంబు
గుణరత్న రోహణ క్షోణిధరము
బాంధవసందోహ పద్మవనీ హేళి
కారుణ్యరస నిమ్నగాకళత్రు

డన జగంబుల మిగుల ప్రఖ్యాతి గాంచె
ధరణిధవ దత్త వివిధోపదా విధా స
మార్జిత శ్రీ వినిర్జిత నిర్జరాల
యేశ్వరుడు తిమ్మభూపతి యీశ్వరుండు

ఆ యీశ్వరనృపతికి పు
ణ్యాయతమతియైన బుక్కమాంబకు తేజ
స్తోయజహితు లుదయించిరి
ధీయుతులగు నారసింహ తిమ్మ నరేంద్రుల్‌

అందు నరసప్రభుడు హరి
చందన మందార కుంద చంద్రాంశు నిభా
స్పంద యశ స్తుందిల ది
క్కందరుడై ధాత్రి యేలె కలుషము లడగన్‌

శ్రీరుచిరత్వ భూతి మతి జిత్వర తాకృతి శక్తి కాంతులన్‌
ధీరత సార భోగముల ధీనిధి యీశ్వర నారసింహు డా
వారిజనాభ శంకరుల వారికుమారుల వారితమ్ములన్‌
వారి యనుంగుమామలను వారి విరోధుల బోలు నిమ్మహిన్‌

అంభోధి వసన విశ్వంభరా వలయంబు
తన బాహుపురి మరకతము జేసె
నశ్రాంత విశ్రాణ నాసార లక్ష్మికి
కవికదంబము చాతకముల జేసె
కకుబంత నిఖిల రాణ్ణికరంబు చరణ మం
జీరంబు సాలభంజికల జేసె
మహనీయ నిజ వినిర్మల యశ స్సరసికి
గగనంబు కలహంసకంబు జేసె

నతి శిత కృపాణ కృత్త మత్తారివీర
మండలేశ సకుండల మకుట నూత్న
మస్త మాల్య పరంపరా మండనార్చి
తేశ్వరుండగు నారసింహేశ్వరుండు

ఆ నృసింహప్రభుడు తిప్పాంబ వలన
నాగమాంబిక వలన నందనుల గాంచె
వీరనరసింహరాయ భూవిభుని నచ్యు
తాంశసంభవు కృష్ణరాయ క్షితీంద్రు

వీరనృసింహుడు నిజభుజ
దారుణ కరవాల పరుష ధారా హత వీ
రారి యగుచు నేకాతప
వారణముగ నేలె ధర నవారణ మహిమన్‌

ఆ విభు ననంతరంబ ధ
రావలయము దాల్చె కృష్ణరాయడు చిన్నా
దేవియు శుభమతి తిరుమల
దేవియునుం దనకు కూర్చు దేవేరులు గాన్‌

తొలగెను ధూమకేతు క్షోభ జనులకు
నతివృష్టి దోష భయంబు వాసె
కంటకాగమ ధీతి గడచె నుద్ధత భూమి
భృత్కటకం బెల్ల నెత్తువడియె
మాసె నఘస్ఫూర్తి మరుభూము లందును
నెల మూడువానలు నిండ గురిసె
నాబాలగోపాల మఖిల సద్వ్రజమును
నానందమున మన్కి నతిశయిల్లె

ప్రజలకెల్లను కడు రామరాజ్య మయ్యె
చారుసత్వాఢ్యు డీశ్వర నారసింహ
భూవిభుని కృష్ణరాయ డభ్యుదయ మొంది
పెంపు మీరంగ ధాత్రి బాలింపుచుండ

అల ప్రోతిప్రభు దంష్ట్ర, భోగివర భోగాగ్రాళి రా, లుద్భటా
చల కూటోపల కోటి రూపు చెడ నిచ్చల్‌ రాయగా నైన మొ
క్కలు భూకాంతకు నున్ననయ్యె నరస క్ష్మాపాలు శ్రీకృష్ణరా
యల బాహా మృగనాభి సంకుమద సాంద్రాలేప పంకంబునన్‌

క్రూర వనేభ దంత హత కుడ్య పరిచ్యుత వజ్రపంక్తి బొ
ల్పారు మిడుంగురుంబురువు లంచు వెసన్‌ గొనిపోయి పొంత శృం
గార వన ద్రుమాళి గిజిగాడులు గూడుల జేర్చు దీపికల్‌
గా రహి కృష్ణరాయ మహికాంతుని శాత్రవ పట్టనంబులన్‌

తొలుదొల్త నుదయాద్రి శిల దాకి తీండ్రించు
నసిలోహమున వెచ్చనై జనించె
మరి కొండవీడెక్కి మార్కొని నలియైన
యల కసవాపాత్రు నంటి రాజె
నట సాగి జమ్మిలోయ బడి వేగి దహించె
గోన బిట్టేర్చె, కొట్టాన తగిలె
కనకగిరి స్ఫూర్తి గరచె గౌతమి గ్రాచె
నవుల నా పొట్నూర రవులుకొనియె

మాడెములు ప్రేల్చె నొడ్డాది మసి యొనర్చె
కటకపురి గాల్చె గజరాజు కలగి పరవ
తోకచిచ్చన నౌర యుద్ధురత కృష్ణ
రాయ బాహు ప్రతాప జాగ్రన్మహాగ్ని

ధర కెంధూళులు కృష్ణరాయల చమూధాటీ గతిన్‌ వింధ్య గ
హ్వరముల్‌ దూరగ జూచి, తా రచట కాపై యుండుటన్‌ చాల న
చ్చెరువై యెర్రని వింత చీకటులు వచ్చెం జూడరే యంచు వే
సొరిదిం జూతురు వీరరుద్ర గజరా ట్శుద్ధాంత ముగ్ధాంగనల్‌

అభిరతి కృష్ణరాయడు జయాంకములన్‌ లిఖియించి తాళ స
న్నిభముగ పొట్టునూరి కడ నిల్పిన కంబము సింహ భూధర
ప్రభు తిరునాళ్ళకున్‌ దిగు సురప్రకరంబు కళింగమేదినీ
విభు నపకీర్తి కజ్జలము వేమరు బెట్టి పఠించు నిచ్చలున్‌

ఎకరాలన్‌ మండువా సాహిణముల గల భద్రేభ సందోహ వాహ
ప్రకరంబున్‌ గొంచు తత్తత్ప్రభువులు వనుపన్‌ రాయబారుల్‌ విలోకో
త్సుకులై నిత్యంబు శ్రీకృష్ణుని యవసరముల్‌ చూతు రందంద కొల్వం
దక యా ప్రత్యూష మాసంధ్యము పనిపడి తన్మందిరాళింద భూమిన్‌

మద కలకుంభి కుంభ నవమౌక్తికముల్‌ కనుపట్టు దట్టమై
వదలక కృష్ణరాయ కరవాలమునం దగు ధారనీట న
భ్యుదయము నొంది శాత్రవుల పుట్టి మునుంగగ ఫేనపంక్తితో
బొదిగొని పైపయిన్‌ వెడలు బుద్బుదపంక్తులు వోలె పోరులన్‌

వేదండ భయద శుండాదండ నిర్వాంత
వమథువుల్‌ పైజిల్కు వారి గాగ
తత్కర్ణ విస్తీర్ణ తాళవృం తోద్ధూత
ధూళి చేటల జల్లు దుమ్ము గాగ
శ్రమ బుర్బుర త్తురంగమ నాసికాగళ
ద్పంకంబు వైచు కర్దమము గాగ
కుపిత యోధాక్షిప్త కుంత కాంతార ఖే
లనములు దండ ఘట్టనలు గాగ

చెనటి పగర ప్రతాపంబు చిచ్చు లార్చు
కరణి గడిదేశములు చొచ్చి కలచి యలచు
మూరు రాయర గండాంక వీర కృష్ణ
రాయ భూభృ ద్భయంకర ప్రబల ధాటి

కరుణాకర వేంకటవిభు
చరణ స్మరణ ప్రసంగ సంగతమతి కీ
శ్వర నరసింహ మహీభృ
ద్వరనందన కృష్ణరాయ ధరణీపతికిన్‌

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పం బూనిన స్వారోచిష మనుసంభవంబను మహాప్రబంధంబునకు కథాక్రమం బెట్టిదనిన జైమినిముని స్వాయంభువమను కథాశ్రవణానంతరంబున మీదనెవ్వండు మనువయ్యె నెరింగింపు మనవుడు పక్షులు మార్కండేయుండు క్రోష్టికిం జెప్పిన ప్రకారంబున నిట్లని చెప్పందొడంగె

వరణాద్వీపవతీ తటాంచలమునన్‌ వప్రస్థలీ చుంబితాం
బరమై సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ
హరిణంబై అరుణాస్పదంబనగ ఆర్యావర్తదేశంబునన్‌
పురమొప్పున్‌ మహికంఠహార తరళ స్ఫూర్తిన్‌ విడంబింపుచున్‌

అచటి విప్రులు మెచ్చ రఖిలవిద్యాప్రౌఢి
ముది మదితప్పిన మొదటివేల్పు
నచటి రాజులు బంటునంపి భార్గవునైన
బింకాన పిలిపింతు రంకమునకు
అచటి మేటికిరాటు లలకాధిపతినైన
మును సంచిమొదలిచ్చి మనుప దక్షు
లచటి నాలవజాతి హలముఖాత్తవిభూతి
నాదిభిక్షువు భైక్షమైన మాన్చు

నచటి వెలయాండ్రు రంభాదులైన నరయ
కాసెకొంగున వారించి కడపగలరు
నాట్యరేఖా కళా ధురంధర నిరూఢి
నచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ

ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా
షాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ
క్షాపరతంత్రు డంబురుహగర్భ కులాభరణం బనారతా
ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూవిలాసుడై

వాని చక్కదనము వైరాగ్యమున చేసి
కాంక్షసేయు జారకామినులకు
భోగబాహ్యమయ్యె పూచిన సంపెంగ
పొలుపు మధుకరాంగనలకు బోలె

యౌవనమందు యజ్వయు ధనాఢ్యుడునై కమనీయ కౌతుక
శ్రీవిధి కూకటుల్‌ కొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ సౌ
ఖ్యావహయై భజింప సుఖులై తలిదండ్రులు కూడి దేవియున్‌
దేవరవోలెనుండి ఇలుదీర్పగ కాపురమొప్పు వానికిన్‌

వరణాతరంగణీ దరవికస్వర నూత్న
కమల కషాయగంధము వహించి
ప్రత్యూషపవనాంకురములు పైకొను వేళ
వామనస్తుతిపరత్వమున లేచి
సచ్ఛాత్రుడగుచు నిచ్చలు నేగి అయ్యేట
అఘమర్షణస్నాన మాచరించి
సాంధ్యకృత్యము తీర్చి సావిత్రి జపియించి
సైకతస్థలి కర్మసాక్షి కెరగి

ఫల సమిత్కుశ కుసుమాది బహుపదార్థ
తతియు నుదికినదోవతులు కొంచు
బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు
వచ్చు నింటికి ప్రజ తన్ను మెచ్చిచూడ

శీలంబుం కులమున్‌ శమంబు దమముం చెల్వంబు లేబ్రాయముం
పోలంజూచి ఇతండె పాత్రుడని ఏ భూపాలు డీవచ్చినన్‌
సాలగ్రామము మున్నుగా కొనడు మాన్యక్షేత్రమున్‌ పెక్కుచం
దాలం పండు నొకప్పుడుం తరుగ దింటం పాడియుం పంటయున్‌

వండనలయదు వేవురు వచ్చిరేని
అన్నపూర్ణకు నుద్దియౌ అతని గృహిణి
అతిథులేతేర నడికిరేయైన పెట్టు
వలయు భోజ్యంబు లింట నవ్వారి కాగ

తీర్థసంవాసు లేతెంచినారని విన్న
ఎదురుగా నేగు దవ్వెంతయైన
ఏగి తత్పదముల కెరగి ఇంటికి తెచ్చు
తెచ్చి సద్భక్తి నాతిథ్యమిచ్చు
ఇచ్చి ఇష్టాన్నసంతృప్తులుగా చేయు
చేసి కూర్చున్నచో చేరవచ్చు
వచ్చి ఇద్ధరకల్గు వనధి పర్వత సరి
త్తీర్థ మాహాత్మ్యముల్‌ తెలియనడుగు

అడిగి యోజనపరిమాణ మరయు అరసి
పోవలయుచూడ ననుచు ఊర్పులు నిగుడ్చు
అనుదినము తీర్థసందర్శనాభిలాష
మాత్మనుప్పొంగ అత్తరుణాగ్నిహోత్రి

ఈవిధమున నభ్యాగత
సేవాపరతంత్ర సకల జీవనుడై భూ
దేవకుమారకు డుండం
గా వినుమొకనాడు కుతపకాలము నందున్‌

ముడిచిన యొంటికెంజెడ మూయ మువ్వన్నె
మెగముతోలు కిరీటముగ ధరించి
కకపాల కేదార కటక ముద్రిత పాణి
కురుచ లాతాముతో కూర్చిపట్టి
ఐణేయమైన ఒడ్డాణంబు లవణిచే
నక్కళించిన పొట్టమక్కళించి
ఆరకూటచ్ఛాయ నవఘళింపగ చాలు
బడుగుదేహంబున భస్మమలది

మిట్టయురమున నిడుయోగపట్టె మెరయ
చెవుల రుద్రాక్షపోగులు చవుకళింప
కావికుబుసంబు జలకుండికయును పూని
చేరె తద్గేహ మౌషధసిద్ధు డొకడు

ఇట్లు చనుదెంచు పరమయోగీంద్రు కాంచి
భక్తి సంయుక్తి నెదురేగి ప్రణతుడగుచు
అర్య్ఘపాద్యాది పూజనం బాచరించి
ఇష్టమృష్టాన్న కలన సంతుష్టు చేసి

ఎందుండి ఎందుపోవుచు
ఇందులకేతెంచినార లిప్పుడు విద్వ
ద్వందిత నేడుగదా మ
న్మందిరము పవిత్రమయ్యె మాన్యుడనైతిన్‌

మీమాటలు మంత్రంబులు
మీమెట్టినయెడ ప్రయాగ మీపాదపవి
త్రామల తోయము లలఘు
ద్యోమార్గచరాంబు పౌనరుక్య్తము లుర్విన్‌

వానిది భాగ్యవైభవము వానిది పుణ్యవిశేష మెమ్మెయిన్‌
వాని దవంధ్యజీవితము వానిది జన్మము వేరుసేయ కె
వ్వాని గృహాంతరంబున భావాదృశ యోగిజనంబు పావన
స్నానవి ధాన్నపానముల సంతసమందుచు ప్రోవు నిచ్చలున్‌

మౌనినాథ కుటుంబ జంబాల పటల
మగ్న మాదృశ గృహమేధిమండలంబు
నుద్ధరింపంగ నౌషధమొండు కలదె
యుష్మదంఘ్రిరజో లేశమొకటి తక్క

నావిని ముని ఇట్లను వ
త్సా మావంటి తైర్థికావళి కెల్లన్‌
మీవంటి గృహస్థుల సుఖ
జీవనమున కాదె తీర్థసేవయు తలపన్‌

కెలకులనున్న తంగెటిజున్ను గృహమేథి
యజమాను డంకస్థితార్థపేటి
పండిన పెరటికల్పకము వాస్తవ్యుండు
దొడ్డిబెట్టిన వేల్పుగిడ్డి కాపు
కడలేని అమృతంపునడబావి సంసారి
సవిద మేరునగంబు భవనభర్త
మరుదేశ పథమధ్య ప్రప కులపతి
ఆకటికొదవు సస్యము కుటుంబి

బధిర పం గ్వంధ భిక్షుక బ్రహ్మచారి
జటి పరివ్రాజ కాతిథి క్షపణ కావ
ధూత కాపాలికా ద్యనాథులకు కాన
భూసురోత్తమ గార్హత్యమునకు సరియె

నావుడు ప్రవరుం డిట్లను
దేవా దేవర సమస్త తీర్థాటనమున్‌
కావింపుదు రిలపై నటు
కావున విభజించి అడుగ కౌతుకమయ్యెన్‌

ఏయే దేశములన్‌ చరించితిరి మీరేయే గిరుల్‌ చూచినా
రేయే తీర్థములందు క్రుంకిడితి రేయే ద్వీపముల్‌ మెట్టినా
రేయే పుణ్యవనాళి ద్రిమ్మరితి రేయే తోయధుల్‌ డాసినా
రాయా చోటులకల్గు వింతలు మహాత్మా నాకెరింగింపవే

పోయి సేవింపలేకున్న పుణ్యతీర్థ
మహిమ వినుటయు నఖిల కల్మషహరంబ
కాన వేడెదననిన అమ్మౌనివర్యు
డాదరాయత్తచిత్తుడై అతని కనియె

ఓ చతురాస్యవంశ కలశోదధి పూర్ణశశాంక తీర్థయా
త్రాచణశీలినై జనపదంబులు పుణ్యనదీనదంబులున్‌
చూచితి నందు నందు గల చోద్యములన్‌ కనుగొంటి నాపటీ
రాచల పశ్చిమాచల హిమాచల పూర్వదిశాచలంబుగన్‌

కేదారేశు భజించితిన్‌ శిరమునన్‌ కీలించితిన్‌ హింగుళా
పాదాంభోరుహముల్‌ ప్రయాగనిలయుం పద్మాక్షు సేవించితిన్‌
యాదోనాథసుతాకళత్రు బదరీనారాయణుం కంటి నీ
యా దేశంబననేల చూచితి సమస్తాశావకాశంబులన్‌

అదియట్లుండె వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరధతురంగ శృంగార చారుచామర చ్ఛటా ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమరసముదయంబగు నుదయంబునంగల విశేషంబులు శేషఫణికినైన లెక్కింప శక్యంబె అంధకరిపు కంధరావాస వాసుకి వియోగభవజుర్వ్యథాభోగ భోగినీ భోగభాగ పరివేష్టిత పటీర విటపివాటికా వేల్లదేలా లతావలయంబగు మలయంబునంగల చలువకు విలువ యెయ్యది అకటకట వికట కూటకోటి విటంక శృంగాటకాడౌకమాన జరదిందుబింబ గళదమృతబిందు దుర్దినార్దీకృత చల్లకీపల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబగు అస్తంబునంగల మణిప్రస్తరంబుల విశ్రాంతిం జింతించిన మేనం బులక లిప్పుడుం బొడమెడు స్వస్వప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహసందోహ దోహద ప్రధానాసమాన ఖేలదైలబిల విలాసినీ విలాస వాచాల తులాకోటి కలకలాహుమాన మానస మదాలస మరాళంబగు రజతశైలంబు నోలంబులం కాలగళు విహారప్రదేశంబులంగన్న సంస్రృతిక్లేశంబులు వాయవే సతత మదజల స్రవణపరాయ ణైరావణ విషాణకోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్కురువింద కందళవ్రాత జాతాలాత శంకాపసర్పదభ్రము భ్రమీవిభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం గనుంగొనుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక యేల చేకూరనేర్చు నేనిట్టి మహాద్భుతంబు లీశ్వరానుగ్రహంబున స్వల్పకాలంబునం గనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసన గ్రసిష్ణు గండయుగళుండగుచు ప్రవరుం డతని కిట్లనియె

వెరవక మీకొనర్తునొక విన్నప మిట్టివియెల్ల చూచిరా
నెరకలుకట్టుకొన్న మరి యేండ్లును పూండ్లును పట్టు ప్రాయపుం
జిరుతతనంబు మీమొగము చెప్పకచెప్పెడు నద్దిరయ్య మా
కెరుగ తరంబె మీమహిమ లీర యెరుంగుదు రేమిచెప్పుదున్‌

అనిన పరదేశి గృహపతి
కనియెన్‌ సందియము తెలియనడుగుట తప్పా
వినవయ్య జరయు రుజయును
చెనకంగా వెరచుమమ్ము సిద్ధులమగుటన్‌

పరమంబైన రహస్యమౌ నయిన డాపన్‌ చెప్పెదన్‌ భూమిని
ర్జరవంశోత్తమ పాదలేపమను పేరంగల్గు దివ్యౌషధం
పు రసం బీశ్వరసత్కృపంగలిగె తద్భూరిప్రభావంబునం
చరియింతుం పవమాన మానస తిరస్కారి త్వరాహంకృతిన్‌

దివి బిసరుహబాంధవ సైం
ధవసంఘం బెంతదవ్వు దగలేకరుగున్‌
భువి నంత దవ్వు నేమును
ఠవఢవ లే కరుగుదుము హుటాహుటి నడలన్‌

అనినన్‌ విప్రవరుండు కౌతుకభరవ్యగ్రాంతరంగుండు భ
క్తి నిబద్ధాంజలి బంధురుండునయి మీ దివ్యప్రభావం బెరుం
గని నా ప్రల్లదముల్‌ సహించి మునిలోకగ్రామణీ సత్కృపన్‌
నను మీ శిష్యుని తీర్థయాత్ర వలనన్‌ ధన్యాత్ముగా చేయరే

అనుటయు రసలింగము నిడు
తన వట్రువ ప్రేపసజ్జ దంతపుబరణిన్‌
నినిచిన యొకపస రిదియది
అనిచెప్పక పోసె తత్పదాంబుజయుగళిన్‌

ఆ మందిడి అతడరిగిన
భూమీసురుడరిగె తుహినభూధర శృంగ
శ్యామల కోమల కానన
హేమాఢ్య దరీ ఝరీ నిరీక్షాపేక్షన్‌

అనిన విని యమ్మహీసురవరు డట్లరిగి యెట్లు ప్రవర్తించె నతని పుణ్యవర్తనశ్రవణంబు మనంబునకు హర్షోత్కర్షంబు కల్పించె తరువాతి వృత్తాంతంబు కృపాయత్తచిత్తంబున నానతీయవలయునని యడుగుటయును

గంగా స్వచ్ఛ తరంగ భంగిక యశో గాఢ చ్ఛవి చ్ఛన్న సా
రంగాంకాంక నిరంకుశ ప్రతికళా ప్రౌఢి ప్రియంభావుకా
గాంగేయాచలదాప నూపుర వచో గాంభీర్య లీలాస్పదా
బంగాళాంగ కళింగ భూప సుభటాభ్రశ్రేణి ఝంఝానిలా

మండలిక తపనశోభిత
కుండలపతిశయన కర్ణకుండలిత రసా
ఖండ కవికావ్య దిగ్వే
దండ శ్రుతిదళన కలహతాడిత పటహా

కుకురు కాశ కురు కరూశ కోస లాంధ్ర సింధు భా
హ్లిక శకాంగ వంగ సింహళేశ కన్యకామణి
ప్రకర పాణిఘటిత రత్నపాదుకా కలాచికా
ముకుర వీటికా కరండ ముఖ్య రాజలాంఛనా

ఇది శ్రీమదాంధ్ర కవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్ష పాదాంబుజాధీన మానసేందిందిర నందవరపుర వంశోత్తంస శఠకోపతాపస ప్రసాదాసాదిత చతుర్విధ కవితా మతల్లి కాల్లసాని చొక్కయామాత్యపుత్త్ర పెద్దనార్యప్రణీతంబైన స్వారోచిషమనుసంభవంబను మహాప్రబంధంబునందు ప్రథమాశ్వాసము
ద్వితీయాశ్వాసం

మనకు తెలియని మన త్యాగరాజు - !




త్యాగరాజు చిత్రపటం
(విలియం జాక్సన్ పుస్తకం నుండి)

తెలుగు భాషా, సంస్కృతీ దేదీప్యమానంగా విరాజిల్లిన విజయనగర సామ్రాజ్యం 17 వ శతాబ్దం మధ్య లో విచ్ఛిన్నమయ్యింది. అరవీడు వంశంలో ఆఖరి రాజు శ్రీరంగంతో విజయ నగర రాజుల పాలన అంతమయ్యింది. అంతవరకూ విజయనగర సామ్రాజ్య పాలకుల ఆధీనంలో ఉన్న మధురై, తంజావూరు, కలాడి, మైసూరు, చిత్రదుర్గ సంస్థానాలు స్వయం పరిపాలిత రాజ్యాలయ్యాయి. సరిగ్గా అప్పుడే దక్షిణాన బ్రిటిషు వారి ఆక్రమణ మెల్ల మెల్లగా మొదలయ్యింది. ఉత్తరాది నుండి ముస్లిం రాజుల దాడులతో రాజ్యాలాన్నీ ముక్కలయిపోయాయి. ప్రజల జీవితాలు కకావికలయ్యాయి. రాజకీయ అస్థిరత ప్రజల్లో భయం రేపింది. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితిల్లో, సుస్థిర ప్రాంతాల వైపు వలసలు మొదలయ్యాయి. దక్షిణాది నున్న రాజ్యాలలో తంజావూరు కాస్త నయంగా ఉండేది. అంతేకాకుండా తంజావూరు రాజులు సాహిత్యాన్నీ, కళల్నీ పోషించండంతో తెలుగునాట పండితులందరూ వలసలు మొదలుపెట్టారు.

తంజావూరు రాజ్యాన్ని 1675 నుండీ మరాఠా రాజులు పాలించారు. తంజావూరుని నాయక రాజులే సింహ భాగం పాలించినా, చివర్లో మరాఠా రాజుల ఆక్రమణతో వారి వశమయ్యింది. తెలుగు, తమిళం తంజావూరు రాజ భాషలు గా చెలామణీ అయ్యేవి. 1758 వ సంవత్సరంలో ఫ్రెంచి వాళ్ళు తంజావూరు పై దండెత్తి, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. 1793 లో బ్రిటీషు వాళ్ళ ఆధీనంలోకి తంజావూరు వచ్చింది. పేరుకు తంజావూరు మరాఠా రాజుల పాలనలో ఉన్నా బ్రిటిషు వాళ్ళ చేతుల్లోనే పరిపాలన జరిగేది. ఒక రకంగా తంజావూరు రాజులు బ్రిటీషు వారి చేతిలో కీలుబొమ్మలు. బ్రిటిషు వారి కనుసన్నల్లో మరాఠా రాజుల వేలిముద్ర పాలన సాగింది. అ ప్పటి వరకూ తమిళ భాష రాజభాషల్లో ఒకటిగా ఉన్నా, మరాఠా రాజులు సంస్కృతానికీ, తెలుగుకే పెద్ద పీట వేసారు. ఈ మరాఠా రాజుల హయాంలో తెలుగు, సంస్కృత భాషలు విలసిల్లాయి. సాహిత్యమూ, లలిత కళలూ విరాజిల్లాయి. ఏ మూల చూసినా ఆ సమయంలో, భారతదేశంలో స్థిరత్వం లేదు. ఒక పక్క బ్రిటీషు వాళ్ళూ, ఫ్రెంచి వాళ్ళూ, మరో పక్క ముస్లిం నవాబులూ, ఇంకోపక్క సామరస్యం లేని హిందూ రాజులూ, ఇలా అనేక మంది ప్రజాజీవనాన్ని నిర్దేశించేవారు. సరిగ్గా అప్పుడే తంజావూరు రాజ్య సంగీత ప్రపంచంలో ఓ మహాద్భుతం జరిగింది. కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ఓ మలుపు తిప్పింది ఓ మహా వ్యక్తి జననం. ఆ మహామనీషి శ్రీ త్యాగరాజు. ఆ మహానుభావుడి పుట్టుక కర్ణాటక శాస్త్రీయ సంగీతానికొక ఒరవడీ, ప్రత్యేకతా తీసుకొచ్చింది.

సంగీతం అంటే కొంచెం తెలుసున్న వారెవరైనా, కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్నీ, త్యాగరాజునీ వేరు చేసి చూడ లేరు. ఎందుకంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఆయన చేసిన అసమానమైన కృషి అలాంటిది. కర్ణాటక సంగీతానికీ, త్యాగరాజుకీ విడదీయరాని బంధం ఉంది. లాగుడు పీకుడు రాగాలతో శాస్త్రీయ సంగీతం అంటే ఆమడ దూరం పరిగెత్తే జనాలకి, అందులో ఉండే మాధుర్యం, మత్తూ చూపించీ, సంగీతం అంటే మరింత ఆసక్తిని కలిగించిన వాడు త్యాగరాజు. ప్రస్తుతమున్న కచేరీ పద్ధతికి ప్రాణం పోసిన వాళ్ళల్లో ఆద్యుడు. సరళమైన భాషలో వినసొంపైన శాస్తీయ సంగీతాన్ని అజరామరం చేసాడు. రామ భక్తుడిగా తనదైన ప్రత్యేకమైన ముద్రతో సంగీతాన్ని భక్తి వాహకంగా వాడుకొన్న వ్యక్తి.

కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి తనవంతుగా అందించిన అనితర సాధ్యమైన సృజనాత్మక కృషిని చూసి, త్యాగరాజుని దేవుడి అవతారంగా మార్చేసారు ఆయన శిష్యులు. ఆయన జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలకి దైవత్వం ఆపాదిస్తూ, భక్తి పురాణ గాధగా త్యాగరాజు జీవిత కథని మార్చేసారు. రాముణ్ణీ ఆయన ఇంటికి పంపించేసారు. ఆయన్ని దేవుని అంశగా తీర్చి దిద్దారు. నేను దేముణ్ణి కాదంటూ, గొంతు చించుకొని ఎంత చెప్పినా వినని భక్తులు, వందేళ్ళ క్రితం నాటి సాయిబాబానీ దేముడి అవతారంగా మలిచి, వీధికో గుడి కట్టి, అభిషేకాలతో, పూజలతో ఊపిరి సలపనివ్వకపోవడం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. ఇంతలా కాకున్నా, త్యాగరాజుకీ సుమారుగా జరిగిందిదే. ఈ ఫక్కీలోనే అనేక రచనలూ, వ్యాసాలూ వచ్చాయి. హరికథలూ, నాటకాలూ, సినిమాలూ తయారయ్యాయి. మనందరికీ తెలుసున్న త్యాగరాజు ఈయనే!

సరిగ్గా చరిత్ర చూస్తే త్యాగరాజు రెండు వందల ఏళ్ళ క్రితం వాడు. అప్పటికే ముస్లిం రాజుల పాలన మొదలయ్యి వందల సంవత్సరాలయ్యింది. బ్రిటిషు వాళ్ళూ, ఫ్రెంచి వాళ్ళూ, డచ్చి వాళ్ళూ, ఇలా ఎందరో భారతదేశంలో పీఠం వేసారు. చరిత్రకారులు ఈ సంఘటనలన్నీ తేదీలతో సహా నిక్షిప్తం చేసారు. ప్రతీ దానికీ ఆధారాలున్నాయి. కాకపోతే ఇందులో త్యాగరాజు జీవితం గురించి ప్రస్తావన మాత్రం అతి తక్కువగా ఉంది. ఆయన కృతులు తప్ప ఆయన గురించి ఎక్కడా ప్రస్తావించ బడలేదు. అవి కూడా త్యాగరాజు శిష్యులు పొందుపరిచినవే! “శ్రీ త్యాగరాజ పరబ్రహ్మణేనమః” అని శ్రీకారంతో మొదలుపెట్టి రాసిన అనేక కృతుల వ్రాత ప్రతులు వీణ కుప్పయ్యర్ అనే శిష్యుడి దగ్గర లభించాయి. ఈ ప్రతులపై 1826 సంవత్సరం అని రాసుంది. అప్పట్లో ఈ వ్రాత ప్రతులు టి. ఎస్ పార్థసారధి అనే విద్వాంసుడి ఆధీనంలో ఉండేవి. ప్రస్తుతం ఇవి తంజావూరు సరస్వతీ మహల్లో ఉన్నాయి. ఈ ప్రతుల్లో కూడా త్యాగరాజు కృతులే ఉన్నాయి తప్ప ఆయన జీవిత విశేషాలు రాసి లేవు.

ఆయన అనుంగు శిష్యులిద్దరు రాసిన రచనల ఆధారంగానే ఆయన జీవిత విశేషాలు తెలిసాయి. త్యాగరాజు చూపించిన అపారమైన సంగీత జ్ఞానానికి ముగ్ధులైన ఆ శిష్యులిద్దరూ స్వతహాగా హరికథకులవడంతో ఆయన్ని దేవుని అంశగా భావిస్తూ రాసారు. అక్కడక్కడి సంగతులు తప్ప క్రమబద్దంగా రాసినవేవీ లేవు. పోనీ త్యాగరాజ వంశీకులెవరైనా ఉన్నారా అంటే అదీ లేదు. ఆయనకొక్కత్తే కూతురు. ఆ కూతురికీ ఒక కొడుకు పుట్టి, అర్థాంతరంగా మరణించాడు. అందువల్ల ఆయన ప్రత్యక్ష వంశీకులెవరూ ఉన్న ఆధారాలు లేవు. ఏవో చిన్నా చితకా ఆధారాలు తప్ప, వివరంగా ఎక్కడా పొందుపర్చిన దాఖలాలు లేవు. ఇది మాత్రం అంతుబట్టని విషయం.

త్యాగరాజు అడిగిన వాళ్ళకి కాదనకుండా సంగీతం నేర్పాడు. ఆయనకి దాదాపు పాతిక మంది పైగా ప్రధాన శిష్యులున్నారన్న ఆధారాలున్నాయి. ఇది మాత్రం విచిత్రమో, యాదృచ్ఛికమో తెలీదు. పైన చెప్పిన ఇద్దరు తప్ప ఎవ్వరూ ఆయన జీవిత చరిత్ర రాయడానికి పూనుకోలేదు. వీరు రాసిన జీవితచరిత్ర ఆధారం తోనే కొత్త కొత్త సంఘటనలూ, విశేషాలూ అతికించబడి అనేక కథలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత చాలా మంది త్యాగరాజు జీవిత చరిత్ర రాసారు. కొన్ని సంఘటనలకీ, విశేషాలకీ ఆధారాలెక్కడవి అనే ప్రశ్న ఉదయించకుండా, అవన్నీ రాముని లీలలుగా అభివర్ణించేసి, ఆయన జీవిత చరిత్రని ప్రజల కందించారు.

1859 వ సంవత్సరంలో మద్రాసు (ప్రస్తుతం చెన్నై) లో సంగీతానికి సంబంధించీ, “సంగీత సర్వార్థ సార సంగ్రహము” అనే ఒక పుస్తకం ప్రచురించారు. అందులో 20 పైగా త్యాగరాజ కృతులు (స్వరాలు లేకుండా) ప్రచురించారు. ఇందులో కూడా త్యాగరాజు పేరు మాత్రం ఉంది కానీ, ఆయన గురించి ఒక్క వాక్యమూ లేదు.

1893 లో చిన్నస్వామి ముదలియార్ అనే క్రిష్టియన్ మతస్థుడు “దక్షిణ భారత సంగీత పరంపర” [South Indian Musical Tradition] అనే గ్రంధ ప్రచురణ నిమిత్తమై, అనేక కర్ణాటక సంగీత కృతులు సమీకరించాడు. త్యాగరాజుకి ముఖ్య శిష్యుల్లో ఒకరైన కృష్ణ స్వామి భాగవతార్ అనే ఆయన సహకారంతో “ఓరియంటల్ మ్యూజిక్ ఇన్ స్టాఫ్ నొటేషన్” [Oriental Music In Staff Notation] గ్రంధం ప్రచురించాడు. అందులో “శాస్త్రీయత మరియు శ్రావ్యత లోనూ, సృజనాత్మకతలోనూ, వెలువడిన పలు త్యాగరాజ కృతులకి సాటి కర్ణాటక సంగీతంలో ఎక్కడా లేదు” (by far the most scientific, charming, voluminous and variegated in all Dravidian Music…) అని ప్రస్తావించబడింది. త్యాగరాజ కృతుల గొప్పదనం వివరించబడింది తప్ప ఆయన జీవిత విశేషాలు మాత్రం ప్రచురించ లేదు.

1896 లో సురేంద్ర మోహన్ టాగూర్ అనే ఆయన “యూనివర్సల్ హిస్టరీ ఆఫ్ మ్యూజిక్” అనే పుస్తకం ప్రచురించాడు. అందులో భారత దేశంలోనున్న 10 మంది అత్యంత ప్రముఖ సంగీత విద్వాంసుల్లో త్యాగరాజు పేరూ ప్రస్తావించబడింది.

“Among the renowned musicians of the present century in Southern India might be named Tigya Raj, who was a native of TiruDi (Tiruvaayoor)…” [ Universal History of Music, 1896, Surendra Mohan Tagore]

వెంకటరమణ భాగవతార్ తెలుగులో రాసిన తాళ పత్ర గ్రంధమే త్యాగరాజ జీవిత చరిత్ర గురించి వచ్చిన మొట్ట మొదటి రచన. కానీ అదీ అసంపూర్తిగానే ఉంది. కొంతవరకూ సాఫీగా సాగిన ఆ రచన మధ్యలో ఆగిపోయింది. కారణాలు ఎవరికీ తెలియవు. ఇది టి.ఎస్.రామారావు గారి సహకారంతో కలసి చేసిన రచన. ఈ రామారావు త్యాగరాజు కి ప్రియ శిష్యుడు. త్యాగరాజు కుటుంబ వ్యవహారాలన్నీ ఈయనే చూసేవాడని చెబుతారు.

ఆ తరువాత కృష్ణ స్వామి భాగవతార్ రాసినది రెండవ రచన. దీనికీ మొదటి రచనే ఆధారంగా కనిపిస్తుంది. ఇందులోనూ కొన్ని సంఘటనలకి రాముని లీలలు అతికించబడినట్లుగా అనిపిస్తుంది. ఈ రెండూ 1900 ముందే వచ్చాయి. 1900 తరువాత వచ్చిన అనేక రచనల్లో పలు విశేషాలూ చొప్పించబడ్డాయి. వాటికి ఆధారాలేమిటన్నది ఎవరికీ తెలియదు.

సంగీతానికి ఇంతగా సేవలు అందించిన తెలుగువాడైన త్యాగరాజు గురించి రాసిన తెలుగు వాళ్ళూ చాలా తక్కువమందే! ఎన్ సి పార్థ సారధి రాసిన రచనలూ, బాలాంత్రపు రజనీకాంత రావు గారి “వాగ్గేయ కారుల జీవిత చరిత్ర” తప్ప, త్యాగరాజు జీవితానికి సంబంధించిన రచనలు అతి తక్కువగా వచ్చాయనే చెప్పచ్చు. ఆయన సంగీతమ్మీదా, కృతుల మీదా విశ్లేషణలు వచ్చాయి. జీవితం గురించి రాసిన పుస్తకాలు తక్కువే. టి.ఎస్.సుందరేశ్వర శర్మ గారి “త్యాగరాజ చరిత్ర” సంస్కృత రచనా, ఇదే పేరుతో తెలుగులో రాసిన వింజమూరి వరాహ నరసింహాచార్యుల రచనా చెప్పుకోదగ్గవి. వీటికీ హరికథా భాగవతార్ల కథే మూలం. కాకపోతే ఎవరికి తగ్గ భక్తి భావం చొప్పించి వారిదైన శైలిలో చూపించారు. మంచాళ జగన్నాధరావు గారి స్వర సంకలనంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు “త్యాగరాజ కీర్తనలు” పేరుతో ఏడు భాగాలుగా ప్రచురించారు. ఇందులో త్యాగరాజ జీవిత చరిత్ర కూడా ఉంది. ప్రత్యేకమైన విశేషాలు లేనప్పటికీ, ఇందులో రాసిందానికీ పైన చెప్పిన హరికథ భాగవ తారల కథే ప్రమాణంగా కనిపిస్తుంది.

త్యాగయ్య సినిమా గురించి అందరికీ తెలుసున్నదే! దానికీ పైన పేర్కొన్న వారి హరికధ పురాణమే ఆధారం. రామ భక్తునిగా త్యాగరాజుని ఆవిష్కరించారే తప్ప, సంగీత పరంగా వాగ్గేయకారునిగా ఆయన జీవితాన్ని చూపలేదు. రామదాసూ, మీరాబాయి, పోతన లాంటి భక్తుల పక్కనే ఈయన్నీ కూర్చో బెట్టారు. తమిళంలోనూ, ఇంగ్లీషులోనే చాలానే పుస్తకాలు వచ్చాయి. రెండో మూడో రచనలు తప్ప మిగతావన్నీ కూడా భక్తి వాహకంగా రాసినవే!

భమిడిపాటి కామేశ్వర రావు గారు “త్యాగరాజ ఆత్మ విచారము” అనే పుస్తకం రాసారు. ఇది మాత్రం పైన చెప్పిన రచనలకి భిన్నంగా ఉంటుంది. త్యాగరాజుని వాగ్గేయ కారుడిగా చూపడానికే ప్రయత్నించారు. పుక్కిట పురాణ కథలు కనిపించవు. తత్వ, అధ్యాత్మిక విశ్లేషణ లతో త్యాగరాజ సంగీతమ్మీదొచ్చిన పుస్తకం ఇదొక్కటే. కాస్త చరిత్రకి దగ్గరగా తెలుగులో వచ్చిన రచన.

“వివాదాత్మక అంశాలపై శ్రద్ధతో కూడిన సమతుల్యత పాటిస్తూ - విజయాలకీ, ఉపద్రవాలకీ ఒక ఉనికిని చూపిస్తూ -విశ్వ చరిత్ర లో సమ సమాజ సారూప్యాన్నీ, భిన్నత్వంలో సంక్లిష్టతనీ చూపించడానికి ప్రయత్నించే వాడే చరిత్రకారుడు” [ William H McNiell – “Mythistory, or Truth, Myth, History and Historians ] అని విలియం మెక్ నీల్ అనే చరిత్రకారుడు చెప్పినట్లుగా, వీలైనన్ని చారిత్రిక ఆధారాలు చూపిస్తూ, ఒక వాగ్గేయకారునిగా త్యాగరాజునీ, ఆయన జీవితాన్నీ అందించాలన్నదే ఈ చిన్న ప్రయత్నం.

గురు దక్షిణ

దక్షిణాదిన ఆధునిక చరిత్ర ప్రారంభమైన తొలి రోజుల్లో, 1767 లో త్యాగరాజు జన్మించాడు. బ్రిటిషు వాళ్ళు మెల్ల మెల్లగా దక్షిణాదిన చొచ్చుకుపోతున్న కాలం అది. యుద్ధాలూ, ఆక్రమణలూ, దోపిడీలూ, భయాలూ, సామాజిక మార్పులూ, సాంస్కృతిక పరిణామాలూ, అన్నీ తలోదారినా ప్రజల మీదొచ్చి పడ్డాయి. 1847 లో త్యాగరాజు పరమపదించే సమయానికే టిప్పు సుల్తాన్ బ్రిటిషు వారి చేతుల్లో పరాజయం పొందాడు. అనిశ్చిత జీవితానికి ప్రజలు అలవాటు పడిపోయారు. తమ కళ్ళముందే ఈ చరిత్ర సాగిపోడం త్యాగరాజూ, ఆయన అనుంగు శిష్యులూ చూసారు.

త్యాగరాజు జీవితం గురించి పూర్తిగా తెలీకపోయినా ఆయన శిష్యుల ద్వారా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఇద్దరు తండ్రీ కొడుకులు ఆయన శిష్యులుగా ఉండేవారు. వాళ్ళిద్దరూ వెంకట రమణ భాగవతార్ (తండ్రి) మరియు కృష్ణ స్వామి భాగవతార్ (కొడుకు). వెంకట రమణ భాగవతార్ 1781 లో జన్మించాడు. త్యాగరాజు తో ఎక్కువ కాలం గడిపిన వాళ్ళల్లో ఆయనొకరు. చివర్లో ఆయన మద్రాసు వాలాజ పేటకి వెళిపోయాడు. ఆయన కొడుకు, కృష్ణ స్వామి, త్యాగరాజు అంత్య దశలో ఆయనతో రెండేళ్ళు పైనే గడిపాడు. వీళ్ళిద్దరూ త్యాగరాజ చరిత్రను రాసారు.

వెంకట రమణ భాగవతార్ రాసిన తాళపత్ర రచనా, కృష్ణ స్వామి భాగవతార్ రాసిన కాగిత ప్రతులూ ఇప్పటికీ మదురై “సౌరాష్ట్ర సభ” లో భద్రంగా ఉన్నాయి. వీళ్ళద్దరూ రాసిన జీవిత విశేషాలూ, మిగతా శిష్యగణం ద్వారా ఆనోటా, ఈనోటా విన్న సంఘటనలూ తప్ప, ప్రత్యేకమైన వివరాలు లభించలేదు. ఏమైతేనేం, ఆ శిష్యులిద్దరూ త్యాగరాజుకి వెలలేని గురుదక్షిణ ఇచ్చారు. ఉన్నంతలో, ఆయన జీవిత చరిత్రని సంగీత ప్రియులకి కానుకగా ఇచ్చారు.

స్వతహాగా వీళ్ళిద్దరూ హరికథ బాగవతార్లవ్వడం వల్ల, త్యాగరాజు జీవితాన్ని ఓ పురాణ గాథగా మలిచి రాసారు. ఆయనకి దైవత్వం ఆపాదించేసారు. ఆయన సంగీత సృజనకీ, రామ భక్తికీ మహత్యాలు అతికించారు. ఓ రామ భక్తుడిగా త్యాగరాజు జీవితాన్ని హరికధలుగా మలిచి చాలా ఊళ్ళల్లో ప్రచారం చేసారు. వాటికి త్యాగరాజందించిన సంగీతం తోడై, ఆ హరికథలు జనరంజకమయ్యాయి. ప్రజల మనసులకత్తుకోడం కోసం ఆయన జీవితంలోకి రాముడి లీలలూ, రక్షణలూ చొప్పించి ఆసక్తి కరంగా మలిచారు. రామ భక్తుడిగా పట్టాభిషేకం చేసేసి, చివరకి ఆయన్ని రాముడిలో లీనం చేసేసారు. ఆయన జీవితాన్ని పౌరాణిక గాధగా తీర్చి దిద్దారు.

త్యాగరాజు జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన సంఘటనలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, వ్యక్తిగా త్యాగరాజు ఎలా జీవించాడూ? అప్పట్లో ఉన్న యుద్ధాలూ, కల్లోలాలపై ఎలా స్పందించాడూ? ఆయన భార్యా, పిల్లలతో ఎలా గడిపాడూ?, శిష్యులకి ఎలా సంగీత బోధన చేసేవాడూ? ఇలా ఎన్నో వివరాలు ముందు తరాలకి అందకుండా పోయాయి. ఇది మాత్రం మన అందరి దురదృష్టం. యాదృచ్చికమో, కాకతాళీయమో తెలీదు. వీళ్ళందించిన కథలే అందరికీ అందాయి. ఇవీ, త్యాగరాజు అందించిన కృతులే - మనకి లభించిన ఆస్తి.

తంజావూరు చరిత్ర

త్యాగరాజు అచ్చమైన తెలుగువాడు. ఆయన సంగీత కృతి రచనలన్నీ తెలుగులోనే ఉన్నాయి. సంస్కృతం చదివినా, ఆయన మాతృ భాష మాత్రం తెలుగే. ఎక్కడో తెలుగు రాజ్యాలకి దూరంగా ఉన్న తంజావూరు రాజ్యంలో, కావేరీ నదీతీరానున్న తిరువైయ్యార్ లాంటి చిన్న ఊళ్ళో తెలుగు సౌరభాలు ఎలా పూసాయి? చుట్టూ తమిళ రాజ్యాలూ, ముస్లిం రాజ్యాలూ, ఫ్రెంచి, డచ్చి, ఆంగ్లేయుల రాజకీయ ప్రాబల్యాలూ అధికంగా ఉన్న తంజావూరులో ఓ తెలుగు వ్యక్తి ప్రభావం అంత గొప్పగా ఎలా ఉందీ? కారణాలు ఏవిటీ? ఈ వివరాలు తెలియాలంటే ముందుగా తంజావూరు రాజ్య చరిత్ర తెలుసుకోవాలి.

ఆంధ్ర రాజ్యమైన విజయనగర సామ్రాజ్యం 1565 లో ముక్కలయ్యింది. అంతకుముందు దక్షిణాన్నున్న చాలా రాజ్యాలు ముస్లిం రాజుల చేతులనుండి తప్పి విజయనగర రాజుల పాలన కిందకొచ్చాయి. దానికి ముందు ముస్లింలు చోళ రాజ్యలపై దండెత్తి వాటిని ఆక్రమించుకున్నారు. అవి తిరిగి హిందూ రాజుల ఆధీనమయ్యాయి. వాటిలో తంజావూరు, మదురై రాజ్యాలకి తెలుగు వారైన నాయక రాజులు సైన్యాధిపతులుగా ఉండేవారు. ఎప్పుడైతే విజయనగరం విరిగిపోయిందో అప్పుడే వీళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి కల రాజులుగా ప్రకటించుకున్నారు. ఆ విధంగా మధురై, తంజావూరు నాయక రాజుల పాలన కిందకొచ్చాయి.

తమిళం ప్రాథమిక జన జీవన భాషగా ఉన్నా, వీళ్ళు మాత్రం తెలుగు సంస్కృతి నే పోషించారు. తెలుగు భాషకి పట్టం కట్టారు. దాంతో ఈ రాజ్యాలకి తెలుగు నాట ఉన్న కవుల, కళాకారుల వలస మొదలయ్యింది.

తంజావూరిని అచ్యుతప్ప నాయకుడు 1565 నుండి 1614 వరకూ పాలించాడు. అతని తరువాత అతని కొడుకు, రఘునాధ నాయకుడుకి రాజ్యాధికారం వచ్చింది. ఇతను సాహితీ పిపాసీ, సంగీత ప్రియుడూ! ఇతని కాలంలో సంగీత సాహిత్యాలు ఓ వెలుగు వెలిగాయి. ముస్లిములతోనూ, ఫ్రెంచి వాళ్ళతోనూ, పొరుగున్న మధురై నాయక రాజులతోనూ తరచు యుద్ధాలు చేసినా, సంస్కృతీ, కళల్ని మాత్రం విడిచిపెట్టలేదు. నాటకాలూ, యక్షగానాలూ ఒకటేమిటి అని కళలూ విలసిల్లాయి. మామూలుగానే మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే మధుర నాయకులకీ, తంజావూరు నాయకులకీ 1673 లో అతి పెద్ద యుద్ధం జరిగింది. తంజావూరు తెలుగు నాయకులు ఓడిపోయారు. రాజ వంశీకులందరూ మరణించారు.

మధుర నాయకుల సమీప బంధువైన అళిగిరి తంజావూరు రాజయ్యాడు.

రాఘవ నాయకుడి వంశం మొత్తం పోయినా, అతని మనవడు చెంగమలదాసనే నాలుగేళ్ళ పిల్లాడు బ్రతికి బట్టకట్టాడు. వాణ్ణి ఓ దాసి రక్షించి రహస్యంగా నాగపట్ట ణం చేర్చింది. ఈ పిల్లాణ్ణి ఎలగైనా రాజ సింహాసనం ఎక్కించాలని, రాయసం వెంకన్న అనే ఉద్యోగి శత విధాలా ప్రయత్నించాడు. బీజాపూరు రాజైన ఆదిల్షాని శరణు వేడి, ఎలాగైనా ఈ తెలుగు బిడ్డని తంజావూరు గద్దెక్కించమని కోరాడు. ఆదిల్షా ఈ పనిని శాహాజీ అనే ఓ వజీరు కప్పగించాడు. ఈ శాహాజీ ఎవరో కాదు, ఛత్రపతి శివాజీ తండ్రే! శివాజీకీ ఏకోజీ అనే సవతి తమ్ముడున్నాడు. శాహాజీ ఈ పనిని ఏకోజీకి పురమాయించాడు. ఏకోజీ అళిగిరిని ఓడించి, చెంగమలదాసుని రాజు చేసాడు. అనూహ్య రాజకీయ పరిణామాలనంతరం, మరాఠీ వాడైన ఏకోజీ తంజావూరు గద్దెక్కి, తమిళనాట తెలుగు రాజ్యానికి రాజయ్యాడు.

ఈ విధంగా తంజావూరు మరాఠీ రాజుల పాలన కిందకొచ్చింది. పేరుకి మరాఠీ వాడయినా, ఏకోజీ సాంస్కృతిక జీవనాన్ని మార్చడానికి ప్రయత్నించలేదు. పూర్వపు రాజుల్లా తెలుగు సాహిత్యాన్నీ, సంగీతాన్ని ఎక్కువగానే పోషించాడు. ఏకోజీ తరువాత అతని పెద్ద కొడుకు రెండవ శాహాజీ గద్దెక్కాడు. తండ్రిలాగే ఇతనూ కళల్నీ, సాహిత్యాన్నీ పోషించాడు. చనిపోయే వరకూ శాహాజీ సాంస్కృతిక రక్షణ, సాహిత్య పోషణ వదల్లేదు. ఇతని కాలంలో లెక్కలేనంత తెలుగు సాహిత్యం వచ్చింది. రెండవ శాహాజీ తరువాత తుక్కోజీ, అతని తరువాత అతని కొడుకు ప్రతాప్ సింగ్ పాలించారు. ఇతని తరువాత తుల్జాజీ II తంజావూరిని దాదాపు రెండు దశాబ్దాలు పాలించాడు. తుల్జాజీ అప్రయోజకత్వం వల్ల, మైసూరు రాజు హైదరాలీ చేతిలో పావయ్యాడు. 1749 నాటికే వ్యాపారం పేరుతో వచ్చిన బ్రిటీషు వాళ్ళు, ఎలా తంజావూరుని కబళించాలా అని శత విధాలా ప్రయత్నించారు. అంతకు ముందొక సారి ప్రతాప్ సింగ్ పై పొరుగునున్న పుదుకొట్టయి రాజు దేవకొట్టయిని యుద్ధానికి ఉసిగొల్పినా, ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ తరువాత మొగల్ నవాబులతోటీ, ఆర్కాట్ రాజులతోటీ చేతులు కలిపి మెల్ల మెల్లగా తంజావూరు పై పట్టు సాధించారు. 1780 నుండి 1800 కాలంలో తంజావూరిపై బ్రిటీషు వారి ఆధిపత్యం పెరిగింది. తుల్జాజీ-II కొడుకు శరభోజి-II, బ్రిటీషు వారి చెప్పు చేతల్లో నడుస్తూ తంజావూరికి నామ మాత్రపు రాజులా మిగిలాడు. ఆ తరువాత హైదరాలీ కొడుకు, టిప్పు సుల్తాన్, బ్రిటీష్ వాళ్ళ చేతిలో ఓడి పోడంతో తంజావూరు చుట్టుపక్కల రాజ్యాలన్నీ పోయి, ఇంగ్లీషు దొరల పాలన మొదలయ్యింది.

ఈ శరభోజి-II కాలంలోనే త్యాగరాజు తిరువైయ్యార్లో ఉన్నాడు. బ్రిటీషు వాళ్ళ ఆక్రమణ ముందూ, వెనుకా ప్రతీ సంఘటనకీ చారిత్రిక ఆధారాలున్నాయి. ప్రతీదీ లిఖిత పూర్వకంగా నమోదు చేయ బడింది. కాకపోతే, అందులో త్యాగరాజు పేరు మాత్రం “దక్షిణాదినున్న సంగీత వాగ్గేయకార సాధువుగా” ఒక్కసారి ప్రస్తావించ బడిందంతే!

త్యాగరాజు జననం - ఆయన పూర్వీకులు

త్యాగరాజు సర్వజిత్ నామ సంవత్సరంలో పుష్యమీ నక్షత్రాన, చైత్ర శుక్ల సప్తమి నాడు (మే 4, 1767) తిరువారూర్ లో జన్మించాడు (ఈ పుట్టిన తేదీ,సంవత్సరమూ తప్పనీ, త్యాగరాజు 1759 లో పుట్టాడనీ ఒక వర్గీయుల వాదన ఉంది. దీనికి తగినంత ఆధారం లేదు). ఇతని తండ్రి కాకర్ల (భరద్వాజ గోత్రం) రామబ్రహ్మం, తల్లి సీతమ్మ. వీళ్ళు స్మార్త వైదీక బ్రాహ్మణులు. (స్మార్తులంటే ఎవరో కాదు. శంకరాచార్య ప్రబోధించిన అద్వైతాన్ననుసరించే వాళ్ళు. వీరు శైవులూ కాదు, వైష్ణవులూ కాదు. స్మార్తులు ఇటు శివుణ్ణీ కొలుస్తారు, అటు విష్ణువునీ పూజిస్తారు). తంజావూరు రాజులు శైవ మతస్థులయినా అటు శైవాన్నీ, ఇటు వైష్ణవాన్నీ సమానంగా ఆదరించారు. వారికి రామాయణ, భారతాలు అత్యంత ప్రీతి. వైష్ణవ మతం ఉన్నా, మదురై, తంజావూరు చుట్టు పక్కల శైవ మతమే ఎక్కువగా ఉండేది. 1600 కాలంలో త్యాగరాజు పూర్వీకులు రాయల సీమలోని కర్నూలు నుండి తంజావూరు వలస వచ్చినట్లు చెప్పబడింది.

రామబ్రహ్మానికి ముగ్గురు కొడుకులు. పంచనద బ్రహ్మం, పంచాపకేశ బ్రహ్మం మొదటిద్దరూ. త్యాగరాజు మూడోవాడు.

రామబ్రహ్మం రామాయణ,భారత, భాగవతాలు బాగా అధ్యయనం చేసాడు. సంస్కృతాన్ని అభ్యసించాడు. అప్పట్లో తంజావూరు రాజైన తుల్జాజీ కొలువులో రామాయణం పఠనమూ, వ్యాఖ్యానమూ చేసేవాడు. ఇదే అతని జీవన భృతి. త్యాగరాజు తిరువారూర్ లో జన్మించాడు. కొంతకాలం తరువాత రామబ్రహ్మం తిరువైయ్యారు కి మారాడు. ఈ మార్పుకీ కారణాలు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా రాసారు.

“త్యాగరాజు అన్నలిద్దరూ (పంచనద బ్రహ్మం, పంచాపకేశ బ్రహ్మం) అల్లరి చిల్లరి పనులతో రామ బ్రహ్మానికి తిరువారూర్ లో తలవంపు తెచ్చేవారు. ఇద్దరికీ సరైన ప్రవర్తన లేదు. ఓ సారి రామబ్రహ్మం తన ముగ్గురు కొడుకులతోనూ కాశీ యాత్రకి బయల్దేరాడు. మధ్యలో అతనికొక కల వచ్చింది. అందులో తిరువారూర్ దైవం త్యాగరాజ స్వామి (నటరాజ రూపంలో నున్న శివుడు) కనిపించి, కాశీ ప్రయాణం రద్దు చేసుకోమనీ, తిరువైయ్యారు వెళ్ళి శైవ దర్శనం చేసుకోమనీ, ఆ తరువాత అక్కడే శేష జీవితం గడపమనీ చెప్పాడు. ఈ కలని మహారాజు తుల్జాజీకి చెప్పడంతో, ఆయన రామబ్రహ్మం ఉండడానికో ఇల్లూ, ఆరెకరాల పొలం ఇచ్చినట్లుగా” వెంకట రమణ భాగవతార్ రాసారు.

ఎం.ఎస్.రామస్వామి అయ్యర్ అనే విద్వాంసుడు ఇదే ఇంకో విధంగా జరిగి ఉండవచ్చని అభిప్రాయ పడ్డారు.

“కావేరీ నదీ తీరాన ఉన్న తిరువైయ్యార్ సంస్కృత విద్యా పీఠ క్షేత్రం. తంజావూరు రాజుల పోషణలో అక్కడి సంస్కృత విద్యాలయాలు ప్రసిద్ధి చెందాయి. ఎక్కడెక్కడినుండో వచ్చి అక్కడ విద్యా భ్యాసం చేసేవారు. చిన్న తనం నుండీ సంస్కృతం నేర్చుకోవడంలో త్యాగరాజు కనబర్చిన ఆసక్తి చూసి, మంచి చదువుకోసం రామబ్రహ్మం తిరువైయ్యార్ మకాం మార్చి ఉండ వచ్చుననీ” అభిప్రాయ పడ్డారు. ఇదే విషయాన్ని “త్యాగరాజు” అనే పుస్తకంలో రాసారు.

తుల్జాజీ రామబ్రహ్మానికి బహుమానంగా ఇచ్చిన ఇంట్లోనే త్యాగరాజు నివసించాడు. అక్కడే ఆయన జీవితం పూర్తిగా గడిచింది. తిరువైయ్యార్ లో తిరుమంజన వీధిలో ఇదే ఇల్లు ఇప్పటికీ ఉంది.

త్యాగరాజుకి తల్లితండ్రులు పెట్టిన పేరు త్యాగబ్రహ్మం. అది ఎలా త్యాగరాజు గా మారిందో తెలీదు. తిరువైయ్యారు దైవం త్యాగరాజ లింగేశ్వరుడు కావడంతో అలా పిలిచేవారో, లేక తాత గిరిరాజు పేరులో చివరి పదాన్ని త్యాగ బ్రహ్మం మధ్యలో తగిలించారో తెలీదు.

త్యాగరాజు తల్లి పేరు సీతమ్మ. ఈవిడ పేరు సీతమ్మ కాదనీ, శాంతమ్మనీ ఒక వివాదం ఉంది. త్యాగరాజు జీవిత చరిత్ర రాసిన వాళ్ళలో “నరసింహ టి భాగవతార్” అనే ఆయన “త్యాగరాజు తల్లి శాంతమ్మ” అని రాసారు. మిగతా వాళ్ళంతా సీతమ్మ అనే రాసారు. చాలా మంది సీతమ్మే సరైనదని నిర్థారించేసారు. దానికొక బలమైన కారణాన్ని కూడా చూపించారు. కారణం అనే కంటే కృతి అనడం మంచిది. “సీతమ్మ మాయమ్మ, శ్రీ రాముడు మాకు తండ్రి” అనే కృతిలో అన్యాపదేశంగా తల్లి తండ్రులనే త్యాగరాజు స్మరించాడు అంటూ వ్యాఖ్యానించారు.

సీతమ్మకి సంగీతంలో ప్రావీణ్యం ఉంది. మంచి గాయని కూడా. త్యాగరాజు చిన్నప్పటినుండే తల్లి వద్ద రామదాసు కీర్తనలూ, పురందరదాసు కీర్తనలూ అభ్యసించాడు. సీతమ్మ రామ భక్తురాలు అవడంతో “రామ భక్తి” బీజాన్ని చిన్నప్పుడే త్యాగరాజులో నాటింది.

తిరువైయ్యార్ సంస్కృత పాఠశాలలోనే త్యాగరాజు మొట్ట మొదట “రామాయణాన్ని” అభ్యసించాడని “వింజమూరి వరాహ నరసింహాచార్యులు” “త్యాగరాజ స్వామి చరిత్ర” లో ప్రస్తావించారు. త్యాగరాజు బాల్య విశేషాలు తెలుసుకునే ముందు ఆయన పూర్వీకులు గురించి చూద్దాం.

గిరిరాజ బ్రహ్మం (తండ్రి వైపు తాత)

రామబ్రహ్మం తండ్రి పేరు గిరిరాజ బ్రహ్మం. ఈయన కవీ, సంగీత విద్వాంసుడూ, సంస్కృత పండితుడూ. ఈయన దగ్గరే మొదట త్యాగరాజు సంగీతం నేర్చుకున్నట్లుగా ఉంది.

త్యాగరాజు తాతగారైన ఈ గిరిరాజ బ్రహ్మం గారి కుటుంబ వరసల మీద కూడా విభిన్న అభిప్రాయాలూ, వివాదాలూ వచ్చాయి. ఈ గిరిరాజ బ్రహ్మం త్యాగరాజు తల్లి సీతమ్మ గారి తండ్రి అనీ అందరూ అనుకున్నారు. అనుకోవడమే కాదు 1900 తరువాత త్యాగరాజు పై వచ్చిన ప్రతీ పుస్తకంలోనూ ఇలాగే ప్రస్తావించారు. దీనికి ఓ చక్కటి ఆధారం కూడా చూపారు. “గిరి రాజ సుత తనయ” అని ఒక ప్రసిద్ధమైన త్యాగరాజ కృతి ఉంది. ఇది తన తాత గారి గురించే త్యాగరాజు రాసారని కొందరి అభిప్రాయం. “గిరి రాజు” అంటే తాతగారి పేరు, సుత అంటే కుమార్తె (సీతమ్మ ఇక్కడ), తనయ అంటే ఆ సీతమ్మ కొడుకు. ఆ కొడుకెవరో కాదు త్యాగరాజేనని భాష్యం చెప్పారు. దీన్ని ఆధారం చేసుకొనే చాలా మంది రచనలు రాసారు. కానీ వాస్తవానికి గిరిరాజ సుత తనయ అంటే “గిరి రాజ సుత” అంటే గిరిరాజు కుమార్తె పార్వతనీ, తనయ అంటే పార్వతి కొడుకనీ (విఘ్నేశ్వరుడు) చెప్పుకోవాలి. అంటే గిరి రాజ సుత తనయ” కృతి వినాయకుడి మీద అని అర్థం చేసుకోవాలి కానీ, తాతగారి మీద త్యాగరాజు రాసిన కృతిగా భావించకూడదు. ఎందుకంటే సీతమ్మ గిరిరాజు కోడలు. కూతురు కాదు. ఇది గిరిరాజ కవి మీదొచ్చిన మొదటి వివాదం.

ఇది కాక ఇంకో అతి పెద్ద వివాదం ఉంది. దానిపై విజ్ఞులూ, పండితులూ అందరూ తప్పుగా అభిప్రాయ పడి చరిత్రని తప్పుగా నిర్ధారించేసారు.

1683 నుండి 1712 వరకూ తంజావూరిని పాలించిన శాహాజీ కొలువులో అనేక మంది తెలుగు కవులుండేవారు. శాహాజీ హయాంలో అనేక తెలుగు గ్రంధాలూ, కావ్యాలూ, నాటకాలూ, యక్షగాన రచనలూ వచ్చాయి. శాహాజీ చుట్టూ చాలా మంది తెలుగు కవులుండే వారు. వందలకు పైగా గ్రంధాలు రాసారు. ఆ కవుల్లో దర్భా సోదరుల్లో ఒకరైన గిరిరాజ కవనే ఒకాయన ఉండేవాడు. ఈయన అనేక ప్రసిద్ధమైన నాటకాలు రాసాడు.. పద్య కావ్యాలు రాయనప్పటికీ, లీలావతీ కళ్యాణం అనే నాటకంలో అనేక పద్య వృత్తాలూ, జాతులూ, ఉప జాతులూ వాడాడు. శ్రావ్యమైన పదాలు వాడాడు. ఈయన రచించిన పదాలలోని సంగీత శైలీ, కూర్పూ త్యాగరాజ కృతుల్లో ఉన్న శైలికీ, కూర్పుకీ సారూప్యం ఉందని విజ్ఞులు భావిం చారు. ఈ గిరిరాజ కవే త్యాగరాజు తాత గారని సంగీత పరిశోధకులు పొరబడ్డారు.

ఈ విషయాన్ని “ఆంధ్ర వాగ్గేయ కార చరిత్ర” అనే పుస్తకంలో బాలాంత్రపు రజనీకాంత రావు గారు ధృవీకరిస్తూ రాసారు. ఆయనే కాదు, ఇంకా కొంతమంది తమిళ రచయితలూ ఇలాగే అభిప్రాయ పడ్డారు. “ది స్పిరిట్యువల్ హెరిటేజ్ ఆఫ్ త్యాగరాజ ” అనే పుస్తకంలోనూ ఇదే విధంగా పొరబడి, గ్రంధస్తం చేసేసారు కూడా.

ఈ పుస్తకాలన్నీ 1950 కాలంలో వచ్చాయి. ఆ తరువాత కాలంలో వచ్చిన “సమగ్రాంధ్ర చరిత్ర” లో ఆరుద్ర ఈ విషయాన్ని ఖండిస్తూ ఈ అభిప్రాయం తప్పనీ, రజనీకాంత రావు గారు పొరబడ్డారనీ రాసారు. సమగ్రాంధ్ర చరిత్రలో ఆరుద్ర గారు ఈ విషయాన్ని ఇలా ప్రస్తావించారు.

” ఆంధ్ర వాగ్గేయ కారులలోనే కాక కర్ణాటక సంగీత మూర్తిత్రయంలోనూ త్యాగరాజ స్వామి సుప్రసిద్ధుడు. వారి తాత గారి పేరు గిరిరాజ బ్రహ్మం. ఆయన కూడా తంజావూరులో ఉండేవాడు. ఈ సామ్యాల వల్ల శాహాజీ ఆస్థానంలో ఉండే గిరి రాజే సాక్షాత్తూ త్యాగరాజస్వామి తాతగారని సంగీత పరిశోధకులు పొరబడ్డారు. ఈ అభిప్రాయాలను విశ్వసించి బాలాంత్రపు రజనీ కాంత రావు గారు గ్రంధస్థం చేసారు. యండమూరి సత్యనారాయణ రావు గారు ఈ పొరపాటును కూడా స్వీకరించారు.

వాస్తవానికి శాహాజీ కొలువులోని గిరి రాజూ, త్యాగరాజు తాతగారైన గిరి రాజూ విభిన్నులు. ఇంటిపేరూ, గోత్రాలూ వేరు వేరు. గిరిరాజ కవి ఇంటి పేరు దర్భావారు; త్యాగరాజ స్వామి ఇంటి పేరు కాకర్ల వారు. దర్భావారు లోహిత గోత్రీకులు, కాకర్ల వారు భారద్వాజస గోత్రీకులు. “

ఈ విధంగా చెబుతూ శాహాజీ కొలువులోని గిరిరాజుకూ, త్యాగరాజు తాతగారికీ సంబంధం లేదని నిరూపించవచ్చని రాసారు. గోత్రాధారాలే ఇచ్చారు తప్ప, రూఢిగా నిరూపించలేదు. ఇంతకుమించి అధారాలు చూపలేదు. పై కారణాలు చూపిస్తూ, గిరిరాజు రచించిన పదాలలోని సంగీత శైలీ, కూర్పూ త్యాగరాజ స్వామి కీర్తనలలో కూడా కనిపించడానికి తాత మనుమళ్ళ వరసే కారణం అని మిత్రులు రజనీ కాంతరావు గారు భావించారంటూ ఆరుద్ర రాసారు. కేవలం రచనల్లో పోలికలుండడం యాదృచ్చికం అంటూ ముగించారు. ఇంతకు మించి ముందుకు వెళ్ళలేదు.

రజనీ కాంత రావు గారిలాగే అనేకమంది సంగీత కారులు భావించారు. వి. రాఘవన్ మరియు పి. సాంబ మూర్తి గార్లు త్యాగరాజ చరిత్ర మీద రాసిన పుస్తకాల్లో (The Great Composers Vol I & II) ఇలాగే రాసారు.

కానీ, డా. ఎస్. సీత (Tanjore as a Seat of Music during the 17th, 18th, and 19th Centuries - S. Seetha - Oxford Music Journal) అనే మరో సంగీత పరిశోధకురాలు మాత్రం ఖచ్చితమైన ఆధారాలు చూపిస్తూ, సాంబమూర్తి, రాఘవన్ల అభిప్రాయాలు తప్పని నిరూపించారు. ఆరుద్ర లాగ ఇంటి పేరూ, గోత్రాలని పట్టించుకోకుండా, వారి వారి వంశ చరిత్రల ఆధారాన్ని చూపారు. గిరిరాజ కవి రాసిన రచనల్లోంచి అతని వంశ చరిత్ర అధారం చూపించడమే కాకుండా, వాళ్ళు శైవ మతస్థులనీ రూఢిగా నిరూపించారు. శాహాజీ కొలువులో ఉన్న గిరిరాజ కవి తండ్రి పేరు ఓబులన్న (వీళ్ళు పలనాడు వైపునుండి వలస వచ్చిన శైవ కుటుంబీకులు) అనీ రుజువు చేసి, త్యాగరాజు తాత గారైన గిరిరాజ బ్రహ్మం తండ్రి పేరు పంచనద బ్రహ్మం అనీ, తగినన్ని అధారాలు చూపించారు. గిరిరాజ బ్రహ్మం కొడుకు రామబ్రహ్మం అనీ, ఆయన కొడుకే త్యాగరాజనీ ధృవీకరించారు.

త్యాగరాజు తాతగారైన గిరిరాజ బ్రహ్మం సంస్కృత పండితుడూ, సంగీత శాస్త్రకారుడూనూ. గిరిరాజ బ్రహ్మం తండ్రి పేరు పంచనద బ్రహ్మం. ఆయనకి అయిదుగురు కొడుకులు. వాళ్ళు సదాశివ బ్రహ్మం, సదానంద బ్రహ్మం, సచ్చిదానంద బ్రహ్మం, బాల బ్రహ్మం మరియు గిరిరాజ బ్రహ్మం. అందరిలోకీ చిన్నవాడు గిరిరాజ బ్రహ్మం. గిరిరాజ బ్రహ్మం గురించి తప్ప మిగతా వారి వంశ చరిత్ర ఎవరికీ తెలీదు.

త్యాగరాజు వంశవృక్షం"&~~SPECIAL_REMOVE!#~~gt;

వీణ కాళహస్తయ్య (తల్లి వైపు తాత)

త్యాగరాజు తల్లి వైపు తాత గారి పేరు వీణ కాళహస్తయ్య. ఈయన వైణికుడు. త్యాగరాజు చిన్నతనంలో ఈయన వద్దే వీణ అభ్యసించారని కె కె రామస్వామి భాగవతార్ “ఇంట్రడక్షన్ టు శ్రీ త్యాగబ్రహ్మోపనిషత్” అనే పుస్తకంలో రాసారు. ఈ కె కె రామస్వామి ఎవరో కాదు, త్యాగరాజు అంత్యదశలో ఆయనతో రెండేళ్ళు గడిపిన కృష్ణ స్వామి భాగవతార్ సుపుత్రుడు (వెంకట రమణ భాగవతార్ మనవడు కూడా).

తంజావూరు రాజ్య ఆస్థాన వైణుకులుగా వీణ కాళహస్తయ్య ఉండే వారని మంచాళ జగన్నాధ రావు గారు (త్యాగరాజ కీర్తనలు పుస్తకం లో) రాసారు. కానీ ఈ విషయాన్ని వెంకట రమణ భాగవతార్ కానీ, ఆయన కొడుకు కృష్ణ భాగవతార్ కానీ, మనవడు కె కె రామస్వామి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. వీరేకాదు, తరువాత త్యాగరాజు జీవిత చరిత్ర రాసిన పి. సాంబమూర్తి గారు కూడా ఎక్కడా ఈ సంగతే రాయలేదు(The Great Composers Vol. I & II). కాబట్టి మంచాల జగన్నాధ రావు రాసిన దానికి ఆధారం ఏమిటో స్పష్టంగా తెలీదు. అది ఊహో లేక వాస్తవమో చెప్పలేం.

“నారదీయం” అనే తాళ పత్ర గ్రంధం త్యాగరాజుకి ఈ వీణ కాళహస్తయ్య చనిపోయినతరువాత ఆయన ఇంటిలో లభించిందని వెంకట రమణ భాగవతార్ రాసారు. ఇదే విషయాన్ని ఆయన కొడుకు కృష్ణస్వామి భాగవతార్ రాసినా, ఆయన ప్రస్తావించిన వేరే విషయానికీ దీనికీ పొంతన కుదరదు.

అది -

“త్యాగరాజు తల్లి తాతగారి పేరు గిరిరాజకవి. ఆయన “సంగీత రత్నాకరము” అనే గ్రంధమూ, మతృభుతేస్వర అనే సంగీత విద్వాంసుడి వద్ద తాతగారికి లభించిన “నారదీయం” అనే సంగీత శాస్త్ర గ్రంధమూ, గిరిరాజకవి మరణాంతరం ఇల్లు వెతుకుతుండగా త్యాగరాజుకి దొరికింది”. [14]

పై రెండూ చూస్తే ఏది సరైనదో చెప్పలేం. వీణ కాళ హస్తయ్య తండ్రి పేరూ గిరిరాజకవనీ చెప్పడానికెక్కడా ఆథారం లేదు. పైన రాసింది తప్ప.

గిరిరాజ బ్రహ్మం కొడుకు రామ బ్రహ్మం. ఆయన కొడుకే త్యాగరాజు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఒకే పేరు ఇద్దరు వ్యక్తులకి ఉండే ఆస్కారం ఉంది. కానీ ఇంత కాకతాళీయంగా ఉండడం నమ్మశక్యం కాదు. కాబట్టి కృష్ణస్వామి భాగవతార్ రాసిన దాంట్లో ఎంత కల్పితమో, ఎంత వాస్తవమో తెలీదు.

కానీ భాగవతార్ తండ్రీ కొడుకులిద్దరూ త్యాగరాజుతో కొంత కాలం గడిపారు. వెంకట రమణ భాగవతార్ చాలా కాలం త్యాగరాజు వద్ద సంగీతం నేర్చుకోడంవల్ల, తండ్రే ఎక్కువ కాలం గడిపాడనడానికి సందేహం లేదు. ఆయన చెప్పిన విషయాలే వాస్తవానికి దగ్గరగా ఉండే ఆస్కారం ఉంది.

ఇలా అక్కడక్కడ లభించిన సమాచారామే తప్ప, సరైన, స్పష్టమైన వివరాలు అంద లేదు. ఎవరికి తోచిందీ, విన్నదీ రాసేసారు.

పైన పేర్కొన్న విషయాలు పొందు పరిచిన పుస్తక ప్రతులు అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల కూడా కొన్ని కథలు పుక్కిట పురాణాల్లా పుట్టుకొచ్చాయి. ఈ ప్రతులు మదురై గ్రంధాలయంలో ఇప్పటికీ ఉన్నాయి. 1990 తరువాత మరలా కొన్ని పుస్తకాలు ప్రచురించారు.

“నారదీయం” అనే తాళ పత్ర గ్రంధ ప్రస్తావనలో తప్ప వీణ కాళహస్తయ్య పేరు ఎక్కడా ఎవరూ రాయలేదు. త్యాగరాజ కృతుల్లో కూడా ఈయన పేరు కనిపించదు.

త్యాగరాజు బాల్యం

చిన్నప్పట్నుండీ త్యాగరాజుకి సంగీతం అంటే ఇష్టం. వీణ కాళ హస్తయ్య దగ్గర వీణా, తల్లి దగ్గరా గాత్రమూ అభ్యసించాడు. అతి పిన్న వయసులోనే సంగీతంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు. తల్లి పాలు తాగేటప్పుడే సంగీతం వినిపిస్తే చాలు, తాగడం ఆపేసి, ఎంతో శ్రద్ధగా చెవులిక్కించి వినేవాడన్న ఈ విషయాన్ని, త్యాగరాజు జీవిత చరిత్ర రాసినందరూ (దాదాపు) మరింత అతిశయోక్తిగా చెప్పారు. సంగీత శబ్ద జ్ఞానానికి నెలలు పిల్లాడిగా ఉన్నప్పుడే అతివేగంగా స్పందించేవాడని చెప్పారు. ఇలాంటి విషయాలు తల్లి తండ్రులూ, బంధువుల ద్వారానే ఇతరులకి తెలిసే అవకాశం ఎక్కువ. త్యాగరాజు అసమాన్య ప్రతిభ చూసి అందరూ పొగుడుతుంటే తల్లితండ్రులే చెప్పుండచ్చు. ఇలాంటి విషయాలికెవరూ ఆధారం చూపలేరు. కాబట్టి అవుననుకొని ఒప్పుకోడానికి ఎవరికీ అభ్యంతరముండదు. ఈ విషయాన్ని కృష్ణ స్వామి భాగవతార్ రాసారు కానీ, ఆయన తండ్రి వెంకటరమణ భాగవతార్ ఎక్కడా ప్రస్తావించలేదు. తండ్రీకొడుకులిద్దరూ త్యాగరాజుతో గడిపారు కనుక ఇద్దరు రాసిందీ వాస్తవానికి దగ్గరగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇలాంటిదే ఇంకో విశేషం కూడా ఉంది. త్యాగరాజు చిన్నతనంలో ఒకసారి విపరీతమైన అనారోగ్యానికి గురయ్యాడట. ఓ సాధు పుంగవుడొచ్చి ఆశీర్వదించాక ఆరోగ్యం కుదట పడిందని రాసారు. ఆ తరువాత తన ముగ్గురు పిల్లల్నీ తీసుకొని రామబ్రహ్మం కాశీయాత్రకి బయల్దేరినప్పుడు, తిరువారూరు త్యాగరాజ స్వామి కలలో కనిపించి, కావేరీ నదీతీరానున్న పంచనదీ స్థలవిశేషమైన తిరువైయ్యార్లో శేష జీవితం గడపమని చెప్పాడట. ఈ సంఘటన తరువాతే రామబ్రహం తుల్జాజీ మహారాజుకి తన కలగురించి వివరిస్తే, ఆయన దయతో ఆరెకరాల పొలమూ, ఓ ఇల్లూ ఇచ్చాడని ఉంది. ఈ సంఘటన తిరువారూర్లో ఉండగా జరిగింది. కాబట్టి త్యాగరాజు తిరువైయ్యార్ వచ్చాక అంతా సవ్యంగానే సాగిందని చెప్పుకోవాలి. ఇది వెంకట రమణ భాగవతార్ రాసిన తాళ పత్ర గ్రంధంలో ఉంది. కృష్ణ స్వామి భాగవతార్ కూడా ఇలాగే రాసారు.

ఇంతకు ముందు చెప్పినట్లుగా రామబ్రహ్మం తిరువైయ్యార్ మకాం మార్చాక త్యాగరాజు అక్కడున్న సంస్కృత పాఠశాలో విద్యాభ్యాసం చేసాడు. మామూలుగా తోటి పిల్లలతో ఆట పాటల్లో అంతగా గడిపేవాడు కాదు. పేరుకు తగ్గట్లుగా తన దగ్గరున్నవన్నీ స్నేహితులకిచ్చేసేవాడు. త్యాగరాజు చిన్నతనంలోనే అంటే ఎనిమిదో ఏటే ఉపనయనం చేసాడు రామబ్రహ్మం. అప్పుడే రామ తారక మంత్రాన్ని జపించమని త్యాగరాజుకి మంత్రోపదేశం చేశాడని వెంకటరమణ భాగవతార్ రాసాడు. ఆ సమయంలోనే రామబ్రహ్మానికి రామనవమి ఆరాధనోత్సవాల్లో సహకరించడానికొచ్చిన శ్రీ రామకృష్ణానంద స్వామి “నమో నమో రాఘవాయ” అనే మంత్రాన్ని త్యాగరాజుకి ఉపదేశించారనీ రాసారు. దాదాపు ఇలాగే రాసినా, కృష్ణ స్వామి భాగవతారు రాసినదాంట్లో, శ్రీ రామకృష్ణానంద స్వామి ప్రస్తావనెక్కడా లేదు. సరిగ్గా అప్పుడే రామబ్రహ్మం తమ కుటుంబారాధ్య దైవమైన శ్రీరాముణ్ణి నిత్యమూ పూజించే బాధ్యత త్యాగరాజుకి అప్పగించాడు.

తిరువైయ్యారులో కానీ, తిరువారూరులో కానీ, ఆ చుట్టు పక్కల ఎక్కడా ఒక్క రామాలయం లేదు. ఉన్నవన్నీ శివాలయాలే. పేరుకి తగ్గట్టు రామబ్రహ్మం రామ భక్తుడు. అదే రామభక్తిని త్యాగరాజుకీ వారసత్వంగా అందించాడు. ప్రతీయేటా తప్పని సరిగా శ్రీరామ నవమి ఉత్సవాలు జరిపేవాడు రామబ్రహ్మం. ఈ రామనవమి ఉత్సవాలు అన్నది భద్రాచల రామనవమి ఉత్స్తవాల స్ఫూర్తి తోనే అప్పట్లో తెలుగునాట జరిపేవారు. ముఖ్యంగా తంజావూరు చుట్టుపక్కల ఈ రామనవమి ఉత్సవాలు అప్పట్లో జరిగేవి కావు. త్యాగరాజూ ఈ ఉత్సవాల్లో పాల్గొనేవాడు. ఉత్సవ సంప్రదాయ కీర్తనలు రాయడానికి ఇవే కారణం కావచ్చు.

తండ్రప్పగించిన రామ పూజని త్యాగరాజు నిత్యమూ ఎంతో శ్రద్ధతో చేసేవాడు. తను కాలం చేసే వరకూ త్యాగరాజు ఈ రామ విగ్రహానికి నిత్యారాధన జరిపేడు. (ఈ విగ్రహం మధ్యలో ఒకసారి పోయి దొరికింది. ఆ విషయం ముందు ముందు వస్తుంది.)

&~~SPECIAL_REMOVE!#~~lt;span title=


సీతారాముల విగ్రహం

ఈ విగ్రహం కూడా తంజావూరు మ్యూజియంలో ఉంది. ఈ విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, దీనికీ భధ్రాచల రామ విగ్రహానికీ చాలా దగ్గర పోలికలు కనిపిస్తాయి.

భధ్రాచల రామ విగ్రహానికొక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే - సీతమ్మ వారు రాముడి తొడపైన కూర్చొనుంటుంది. ఇదొక్క భద్రాచల విగ్రహంలోనే కనిపిస్తుంది. మిగతా దేవాలయాల్లో రాముడి పక్కనే సీతమ్మ వారు ఉంటుంది. రామబ్రహ్మం పూర్వీకుల ఆరాధ్య దైవం భద్రాచల రాముడే అయ్యుండచ్చని నా విశ్వాసం. రామ బ్రహ్మం పూర్వీకులు కర్నూలుండి తంజావూరు వలస వెళ్ళారని తెలుసు. భద్రాచల రామదాసు జీవిత కాలం 1620 - 1680 మధ్యన. ఆ తరువాతే విజయ నగర సామ్రాజ్య పతనమూ, కొంతకాలానికి తంజావూరు గద్దెపై మరాఠీ రాజుల పాలనా మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలోనే తెలుగుసీమ నుండి తంజావూరికి వలసలు మొదలయ్యాయి. అంతేకాకుండా త్యాగరాజు తల్లి దగ్గర రామ దాసు కీర్తనలన్నీ చిన్నతనంలో నేర్చుకున్నాడు. ఇవన్నీ చూస్తే త్యాగరాజు కుటుంబ దైవం భద్రాచల రాముడే అయ్యుండచ్చని నా నమ్మకం.

సంగీతంలో త్యాగరాజు అపార ప్రావీణ్యం చూసి రామబ్రహ్మం సంగీతంలో సులువులూ, మెలకువులూ తెలుసుకోమని శొంఠి వెంకట రమణయ్య అనే గురువు దగ్గరకి శిష్యుడిగా పంపించాడు. ఈ శొంఠి వెంకటరమణయ్య తుల్జాజీ మహారాజు కొలువులో ప్రధాన ఆస్థాన సంగీత విద్వాంసుడు. రామ బ్రహ్మమూ తుల్జాజీ కొలువులోనే ఉండడం వల్ల వెంకటరమణయ్య త్యాగరాజుని శిష్యుడిగా స్వీకరించడం సులువయ్యింది. కొంతకాలం ఆయన వద్ద సంగీతం నేర్చుకున్నాడు త్యాగరాజు. వి.రాఘవన్ అనే సంగీత శాస్త్ర కారుడి వద్ద 1800 కాలంలో సంగీతం సంబంధించి సంస్కృతంలో రాసిన కొన్ని ప్రతులుండేవి. అందులో ఈ శొంఠి సుబ్బయ్య కొడుకు వెంకటరమణయ్య అనే ఆయన వివిధ రకాల తాళ ప్రక్రియల్లో ప్రసిద్ధుడని ఉందనీ రాసారు. త్యాగరాజు గురువైన ఈ శొంఠి వెంకటరమణయ్య 1803 నుండి 1817 వరకూ మద్రాసు (చెన్నై) లో ఉండి ఉండవచ్చనీ రాఘవన్ అభిప్రాయపడ్డారు. త్యాగరాజు ఈయన వద్ద ఎంతో కాలం సంగీతం నేర్చుకోలేదు. “ప్రావీణ్యం సంపాదించడానికందరికీ కొన్ని సంవత్సరాలు పట్టే సంగీతాన్ని, త్యాగరాజు ఒక్క ఏడాదిలోపునే గ్రహించేసాడని ఆయన చరిత్ర రాసిన అనేకమంది చెప్పారు.

కొన్ని నెలల తరువాత త్యాగరాజు తల్లి వైపు తాత, వీణ కాళహస్తయ్య, చని పోయారు. అప్పుడు ఆయన దగ్గర “నారదీయం” అనే పేరుతో అనేక తాళ పత్ర గ్రంధాలు త్యాగరాజుకి లభించాయి. అవన్నీ క్షుణ్ణంగా చదివాడు. కానీ చాలా విషయాలు అవగతం కాలేదు. సరిగ్గా అప్పుడే అనుకోకుండా రామకృష్ణానంద స్వామిని కలవడం జరిగింది. త్యాగరాజు “నారదీయం” గ్రంధం గురించి చెప్పాడు. చాలా విషయాలు బోధ పడలేదనీ చెప్పాడు. అప్పుడా రామకృష్ణానంద స్వామి నారదోపాసన మంత్రం ఉపదేశించి, త్యాగరాజుని నారద మంత్ర జపం చేయమన్నాడు. త్యాగరాజు కొన్ని 96 కోట్ల సార్లు జపం చేసాడని వెంకట రమణ భాగవతారు రాసారు.

సరిగ్గా ఇక్కడే హరికథా భాగవతార్ల భక్తితో కూడిన ఊహజనిత మైన అల్లిక కనిపిస్తుంది. కొన్ని కోట్ల జపానంతరం నారదుడు త్యాగరాజుకి ప్రత్యక్ష మయ్యాడనీ, నారదుడు ప్రసన్నుడై “స్వరార్ణవం” అనే మరో సంగీత శాస్త్ర గ్రంధం కానుకగా ఇచ్చాడనీ రాసారు.

నారద సాక్షాత్కారం అయ్యాక, నారదుడి పై గురు భావంతో త్యాగరాజు “వరనారద” మరియు “శ్రీ నారద” అనే రెండు కృతులు స్వర పరిచాడనీ రాసారు.

ఇదే విషయం కృష్ణ బాగవతార్ వేరే రకంగా రాసారు. ఆయన నారదుడూ, ప్రత్యక్ష మవ్వడం ఇవేం రాయలేదు. కానీ త్యాగరాజు తల్లి తాతగారు గిరిరాజకవి చనిపోయినప్పుడు ఇంట్లో ఆయన వస్తువులన్నీ సర్దుతుండగా “సంగీత రత్నాకరం” అనే గ్రంధమూ, ఇంకా సంగీతానికి సంబంధించినవనేకం దొరికాయనీ రాసారు. ఈ సంగీత రత్నాకరం” మాతృభూతేశ్వర అనే ఆయన తల్లి తాతగారు గిరిరాజ కవికిచ్చినట్లుగా రాసారు. బహుశా ఈ మాతృభూతేశ్వరుడు 18వ శతాబ్దంలో తిరుచిరాపల్లి లో ఉన్న ఓ ప్రముఖ సంగీత విద్వాంసుడు కావచ్చని పి.సాంబమూర్తి గారు రాసారు. అదలా ఉంచితే, ఈ గిరిరాజ కవి త్యాగరాజు తల్లి తాతగారు. అంటే త్యాగరాజుకి ముత్తాత. ఈ కొత్త బంధుత్వం ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాదు. తండ్రివైపు తాత గిరిరాజ కవి అని తెలుసు. మరి ఈ ముత్తాత గారి పేరు కూడా గిరిరాజ కవేనా అన్నది రూఢిగా చెప్పడానికెక్కడా ఆధారాలు లేవు. ఈ రెండు విషయాలూ చదువర్లని అయోమయంలో పడేస్తాయనడానికి మాత్రం సందేహించనవసరం లేదు.

ఈ సంగీత రత్నాకరంలో 72 మేళ కర్త రాగాల గురించీ, వివిధరకాలైన తాళాల గురించీ, 22 శ్రుతులూ, వాటిననుసరించే అను శ్రుతుల ప్రాధాన్యత గురించీ, 10 రకాలైన గమకాల వివరాలూ, ఔడవ రాగాల ప్రశస్తీ, ఇలా ఎన్నో విషయాలున్న గ్రంధమది. వి.రాఘవన్ అనే ఆయన “స్వరార్ణవం” అనే గ్రంధాన్ని మిగతా సంగీత గ్రంధాలతో (The Music Academy Journal) కలిపి పొందుపరచనట్లుగా ఉంది.

నారద మంత్రమే కాకుండా రామ తారక మంత్రాన్నీ కూడా కొన్ని కోట్ల సార్లు జపించాడాని రాసారు. ఎన్ని సార్లు జపించినా రాముడు ప్రత్యక్షం కాలేదు. ఎన్నో సార్లు కనిపించీ కనిపించనట్లుగా త్యాగరాజుకి భ్రమ కలిగేది. అప్పుడే “ఏల నీ దయా రాదూ” అనే కృతిని రచించాడనీ చెబుతారు.

త్యాగరాజు రచించిన కృతులని ఏ సందర్భంలో పాడాడూ, ఎప్పుడు రాసాడూ అన్న దానికి సరైన ఆధారాలు లేవు. ఏ ప్రతిలోనూ తేదీ కానీ, సంవత్సరం కానీ లేవు. అందువల్ల ప్రజలకు లభ్యమైన కృతుల సాహిత్యం బట్టీ, త్యాగరాజు జీవితంలో జరిగినట్లనిపించిన సంఘటనలకి ముడివేయడం ప్రారంభించారు. ఏ కృతి చూసినా ఫలానా సందర్భంలో చెప్పి ఉండచ్చు అనే ఊహాగానంతోనే చెప్పారనుకోవాలి తప్ప, సరైన ఆధారాలు లేవు. కొన్ని కృతులకి మాత్రం ఎక్కడ పాడారో చెప్పారు. తేదీలు లేకపోయినా ప్రదేశాన్ని బట్టీ, సందర్భాన్ని బట్టీ, ఏ దైవాన్నుద్దేశించి రాసిన దాన్నిబట్టీ చెప్పడం జరిగింది. కోవూరు కీర్తనలూ, తిరుపతి వెంకటేశ్వర స్వామి పై రాసినవీ ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

పంచనదయ్య త్యాగరాజు పెద్దన్నయ్య. అతను పెళ్ళి చేసుకొని మామూలు సంసారిక జీవితాన్ని గడిపేవాడు. ఈయన్నే “జప్యేశ” అని కొంత మంది సంబోధించారు. త్యాగరాజు చిన్నన్నయ్య పేరు పంచాపకేశ బ్రహ్మం. అతను త్యాగరాజుకి వివాహం కాకమునుపే అనారోగ్యంతో పోయాడు. అతను అనారోగ్యంతో మంచానున్నప్పుడు “అన్యాయము సేయకురా” అనే కృతిని త్యాగరాజు పాడినట్లుగా వెంకటరమణ, కృష్ణస్వామి భాగవతార్లిద్దరూ రాసారు.

త్యాగరాజు రాసిన మొదటి కృతి ఏదీ? ఎన్నో ఏట రాసాడూ? అన్న వివరాలు ఇదమిత్థంగా తెలీవు. కొంతమంది “గిరిరాజ సుత తనయ” అనే కృతే మొట్టమొదటి రచన అని నమ్ముతారు. అది కాదు “నమో నమో రాఘవాయ” (దేశి తోడి రాగం) మొట్ట మొదటి కృతి అని వాదిస్తారు. మొదటిది తెలుగులో రాసింది. నమో నమో రాఘవాయ మాత్రం సంస్కృత రచన.

ఇదే మొదటి కృతి అని చెప్పడానికి రెండు ఆధారాలు కూడా చూపించారు. త్యాగరాజు సంస్కృత విద్యా నిమిత్తమై తిరువైయ్యరు వచ్చాడు. ఎవరికైనా విద్యా ప్రభావం చిన్న తనంలో ఉంటుంది. గురువులైన సంస్కృతం పండితుల ప్రభావం ఉండే అవకాశాలు ఎక్కువ. బహుశా అదే ప్రభావంతో త్యాగరాజు సంస్కృతంలో రాసుండచ్చని వాదించారు. ఈ రచన త్యాగరాజు 13 నుంది 15 ఏళ్ళ వయసులో జరిగుండవచ్చనీ చెప్పారు. ఈ కృతి పూర్తిగా సంస్కృతంలోనే ఉంటుంది. త్యాగరాజు సంస్కృతంలో రాసిన కృతుల్లో ఇదే మొదటి కృతిగా చెప్పుకోవాలి. ఆ తరువాత రాసినవాటిలో ఎక్కువ భాగం అచ్చ తెలుగులోనే ఉన్నాయి. ఇదే విషయం విలియం జాక్సన్ (త్యాగరాజ: లైఫ్ అండ్ లిరిక్స్) లో ప్రస్తావించాడు. అతనే దీనికంటే మరో బలమైన కారణం చూపింఛాడు.

త్యాగరాజు చిన్నతనంలో అంటే, 1780 నుండి 1783 మధ్యన తంజావూరికి విపరీతమైన కరువొచ్చింది. మైసూరు రాజైన హైదరాలీ సైన్యం తంజావూరు చుట్టు పక్కల గ్రామాలనన్నీ మట్టుపెట్టాయి. పల్లెల్లో వున్న పంటకాల్వల్నీ, వ్యవసాయ భూముల్నీ చింద్రం చేసేసారు. భయంతో ప్రజలు దగ్గరున్న పట్టణాలికి పరిగెత్తారు. ప్రతీ గ్రామంలోనూ నీటికీ, తిండికీ ఎద్దడొచ్చింది. గోరుచుట్టుపై రోకలి పోటులా ఓ రెండేళ్ళ పాటు రుతుపవనాలు రాలేదు. వర్షాల్లేవు. పొలాలన్నీ బీడు భూముల్లా తయారయ్యాయి. ఇది జరిగినప్పుడు త్యాగరాజుకి సుమారు 13 నుండి 15 ఏళ్ళ వయసుండుంటుంది. ఇది చూసి చలించి, ఓ జానపద గీతంలా రాముణ్ణి వేడుకుంటూ త్యాగరాజు రాసాడనీ అన్నారు. ఆ కృతిలో - రాముడే రక్షిస్తాడనీ, సకల లోక రక్షకుడనీ, దుష్ట శిక్షకుడనీ కీర్తిస్తూ, పేదవారి కష్టాలని దాటించే దయాశీలనీ చెప్తాడు. తనని నమ్ముకున్న భక్తులకి రాముడెన్నడూ అన్యాయం చేయడనీ అంటాడు. తన చుట్టూ ఉన్న దయార్ద్ర స్థితిని చూసి దైవ భక్తి ద్వారా ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడానికి త్యాగరాజు ప్రయత్నించాడని జాక్సన్ అభిప్రాయపడ్డాడు. ఇదే త్యాగరాజు మొదటి రచన అయ్యుండచ్చనీ చెప్పాడు. ఇందులో ఎక్కడా హైదరాలీ సైన్యం అకృత్యాలు కానీ, నిస్సహాయ రాజుల గురించి కానీ ఎక్కడా ప్రస్తావించ లేదు.

త్యాగరాజు జీవిత చరిత్ర రాసిన ఇద్దరూ (వెంకట రమణ భాగవతార్, ఆయన కొడుకు కృష్ణస్వామి బాగవతార్ కానీ) 1781 సంవత్సరంలో తంజావూరు రాజ్యంలో వచ్చిన కరువు గురించి కానీ, హైదరాలీ అకృత్యాల గురించి కానీ రాయలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ అప్పటికి పుట్ట లేదు. ఒకవేళ పుట్టినా ఈ విషయాలు రాసుండేవారు కారనీ విలియం జాక్సన్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే వీళ్ళు త్యాగరాజుని దేవుని అవతారంగా భావించి రాసారు. పురాణ పురుషుడిగా భావించారు. త్యాగరాజు కూడా తన రచనల్లో ఎక్కడా ఈ కరువు ప్రస్తావన తీసుకు రాలేదు. అదీకాక హిందువులకి పురాణా కథలమీదున్న భక్తీ, ఆసక్తీ, చరిత్ర మీద లేదని పండితుల అభిప్రాయంగా విలియం జాక్సన్ రాసాడు.

“గిరిరాజ సుత తనయే” మొదటి కృతని సుబ్బరామ దీక్షితార్ (1839 - 1906) అనే ఆయన రాసారు. ఈ సుబ్బరామ దీక్షితార్ చిన్నతనంలో త్యాగరాజుని కలిసారు. ఈయన ముత్తుస్వామి దీక్షితార్ వంశీకుడు. ఈయన సంగీతానికి సంబంధించిన చాలా గ్రంధాలు సేకరించాడు. సంగీత సంప్రదాయ ప్రదర్శిని (Exposition of the Tradition of Music) అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఇందులో దక్షిణ భారత దేశంలోని వాగ్గేయ కారుల జీవిత చరిత్రలు రాశాడు. త్యాగరాజు గురించీ కొద్దిగా రాసాడు. తిరువారూర్ త్యాగరాజ స్వామి అవతారమే ఈ త్యాగరాజనీ కీర్తించాడు. త్యాగరాజు జీవితం గురించి వివరాలెక్కువ దొరకలేదనీ విచారించాడు.

ఇలా ఎవరికి ఏ విషయం తెలిస్తే దాన్ని వాళ్ళు రాసారు. ఇందులో స్తవమెంత, వాస్తవమెంత అన్నది తెలీదు. శాస్త్రీయంగా ఆధారాలు చూపించినప్పుడే ఇదీ సరైన చరిత్ర అని చెప్పగలం.

త్యాగరాజుకి 18వ ఏట (1785 లో) పార్వతనే అమ్మాయినిచ్చి వివాహం చేసారు. త్యాగరాజు 20 వ ఏట తండ్రి రామబ్రహ్మం కాలం చేసాడు. (త్యాగరాజుకి 15 ఏళ్ళ వయసులోనే మాతా పిత్రు వియోగం కలిగిందనీ సుబ్బరామ దీక్షితార్ రాసారు. దీనికి ఆధారాలెక్కడివో తెలీవు. )

సరిగ్గా తండ్రి పోయిన మూడేళ్ళకి త్యాగరాజు భార్య పార్వతి మరణించింది. ఆ తరువాత రెండేళ్ళకి పార్వతి చెల్లెలు కమలాంబని త్యాగరాజు రెండో పెళ్ళి చేసుకున్నాడు.

ఇక్కడి వరకే వెంకటరమణ భాగవతార్ రాసిన తాళ పత్ర గ్రంధం ఉంది. మిగతా జీవిత విశేషాలు ఎందుకు పొందుపరచలేదో తెలీదు. అలా అర్థాంతరంగా ముగించడానిగ్గల వివరాలెవ్వరికీ తెలీదు. అందువల్ల తరువాతాయన కొడుకు కృష్ణస్వామి రాసిన త్యాగరాజు జీవిత చరిత్రే అందరికీ ఆధారమయ్యింది. అందులోంచే మిగతా విశేషాలు తెలిసాయి.

Thursday, November 17, 2011

మనకు తెలియని మన త్యాగరాజు - !!

త్యాగరాజుకి సంగీతంపై ఉన్న శ్రద్ధా, ప్రజ్ఞా ఆయన చిన్నవయసులోనే తండ్రి
రామబ్రహ్మం గ్రహించాడు. సంగీత విద్వాంసుల కుటుంబం కావడంవల్ల అతి పిన్న
వయసులో త్యాగరాజు చూపించిన ప్రతిభ సులభంగానే తెలిసింది. పదిహేనేళ్ళ
వయసులో త్యాగరాజు మొట్టమొదట రాసిన “నమో నమో రాఘవాయ” కృతిని ఇంటి గోడలపై సున్నపు కణికలతో రాస్తే, అది చూసి రామ బ్రహ్మం స్నేహితులు అతన్ని తంజావూరులో ఉన్న ప్రసిద్ధ సంగీత విద్వాంసుల వద్దకు పంపమని చెప్పారు. రామబ్రహ్మం తంజావూరు ఆస్థానంలో రామాయణ వ్యాఖ్యానం చేసేవాడు. త్యాగరాజు కూడా చిన్నతనంలో తండ్రితో వెళ్ళేవాడు. తంజావూరు రాజ్యాధిపతి తుల్జాజీ ఆస్థానంలో శొంఠి వేంకటరమణయ్య అనే సంగీత విద్వాసుడుండేవాడు.
రామబ్రహ్మం త్యాగరాజుని శొంఠి వేంకటరమణయ్య దగ్గర శిష్యుడిగా చేర్పించాడు. త్యాగరాజు కొంతకాలం గురువు వద్దుండి, తంజావూరులోనే సంగీత విద్య నభ్యసించాడు. ఇది 1782లో, పదిహేనేళ్ళ వయసులో ఉండగా జరిగింది. అప్పటికింకా త్యాగరాజుకి వివాహం కాలేదు. గురువు వద్ద సంగీత శాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. అతి తక్కువ కాలంలోనే అందులో ప్రావీణ్యం సంపాదించాడు. శొంఠి వేంకటరమణయ్య త్యాగరాజు ప్రతిభని మెచ్చుకొని తన వద్దనున్న “తాన” పుస్తకం బహుకరించాడు. ఇందులో వివిధ రకాల తాళాల గురించీ, వాటి ఉప జాతుల గురించీ వివరంగా వుంది. దీన్ని వాలాజపేట శిష్యులు భద్రపరిచారు. అది ఇప్పటికీ మదురై సంగీత సౌరాష్ట్ర సభలో ఉంది. ఇది వారి చేతికెలా వచ్చిందో తెలీదు.
తిరువయ్యూర్ తంజావూరుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరువయ్యూర్ చేరాలంటే పడవల్లో కావేరీ నది దాటి వెళ్ళాల్సిందే! త్యాగరాజు గురువు వద్ద ఎక్కువకాలం సంగీతం నేర్చుకున్నట్లాధారాలు లేవు. మాతామహుల మరణమూ, ఆ తరువాత కొంతకాలానికి త్యాగరాజు వివాహమూ ఒక దాని తరువాత ఒకటి జరగడంతో త్యాగరాజు వేంకట రమణయ్య వద్దకు తిరిగి వెళ్ళలేదు. కానీ గురువు గారంటే అమితమైన భక్తీ, గౌరవమూ ఉన్నాయి. త్యాగరాజుకు వివాహం అయిన తరువాత తండ్రి రామబ్రహ్మానికి సుస్తీ చేసింది. అనారోగ్యంతో ఉన్న తండ్రిని వదిలి వెళ్ళ లేకపోయాడు. తాతగారి ఇంట్లో దొరికిన తాళ పత్ర గ్రంధాల్లో ఉన్న సంగీత రత్నాకరంలో విషయాలు కొన్ని బోధపడలేదు. గురువు గార్ని కలుద్దామని ఎంత ప్రయత్నించినా కుటుంబ బాధ్యతల వల్ల కుదర్లేదు. ఈ లోగా రామ బ్రహ్మం మరణించాడు.
రామబ్రహ్మం అనారోగ్యం వల్ల మంచం పట్టినప్పుడు, అతని భార్య సీతమ్మ తనూ భర్తతో సహగమనం చేస్తానని చెప్పినట్లుగా ప్రొఫెసర్ సాంబమూర్తి “ది గ్రేట్ కంపోజర్స్” పుస్తకంలో రాసారు. సహగమనం వద్దనీ, త్యాగరాజుని దగ్గరుండి చూసుకోమనీ, అతని సంగీత వైభవాన్ని కళ్ళారా చూడమనీ రామబ్రహ్మం ఆమెను వారింఛాడు. ఆయన కోరికను మన్నించి సీతమ్మ తన నిర్ణయం మార్చుకుందనీ రాసారు. దీని ఆధారాలు తెలీవు. ఈ కథనం మాత్రం సాంబమూర్తి గారి రచనలోనే కనిపించింది. దక్షిణాది బ్రాహ్మణ కుటుంబాల్లో సహగమనం ఆచారం అంతగా కనబడదు. మిగతా ఎవరూ దీని ప్రస్తావనే తీసుకు రాలేదు.
రామబ్రహ్మం 1787 లో చనిపోయాడు. అప్పటికి త్యాగరాజుకి సరిగ్గా ఇరవై ఏళ్ళు. ఈ విషయం వెంకటరమణ భాగవతార్ రాసిన చరిత్రలో ఉంది ( పేజీ 60 – Tyagaraja and the Renewal of Tradition, William. J. Jackson). ఇది జరిగిన కొంత కాలానికి, ఉపనయన సమయంలో నారదోపాసక మంత్రోపదేశం చేసిన రామకృష్ణానంద స్వామి ఆశీర్వాద ప్రభావం వల్ల, త్యాగరాజుకి స్వరార్ణవంలో అంశాలు అతి సులభంగా బోధపడ్డాయన్నట్లుగా ప్రొఫెసర్ సాంబమూర్తి రాసారు. సాక్షాత్తూ నారదుడే వచ్చి “నారదీయం” అనే గ్రంధాన్ని బహుకరించాడన్న ఇంకో కథ ఉంది. నారదుడే రామకృష్ణానంద స్వామి రూపంలో వచ్చారని హరికథ భాగవతులు అనుకొనుండచ్చు. త్యాగరాజు చూపించిన సంగీత ప్రతిభా, సృజనా మానవ మాత్రులకి సాధ్య పడదనుకొని, కేవలం దైవకృప వల్లే ఇది సంక్రమించిందని భావించే అవకాశముంది.









గురువు శొంఠి వేంకటరమణయ్య, త్యాగరాజు
త్యాగరాజు సంగీత ప్రాభవం రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. ఆనోటా, ఈనోటా త్యాగరాజు కృతులు ప్రచారం కావడంతో ఈ విషయం గురువుగారైన శొంఠి వేంకటరమణయ్య వరకూ ప్రాకింది. ప్రతీ ఏడూ ఉగాది పర్వదినాన తంజావూరు దర్బారు హాలులో సంగీత కచేరీలు జరిగేవి. వీలుని బట్టి రాజులు కూడా విచ్చేసేవారు. కేవలం ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసులకే అందులో పాడే అవకాశం లభించేది. ఒక ఉగాది సంగీత కచేరీకి గురువుగారి నుండి త్యాగరాజుకి ఆహ్వానమొచ్చింది. త్యాగరాజుకి గురువంటే ఉన్న భక్తి వలన కచేరీ చెయ్యడానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో రాగ విస్తారణకీ, ఆలాపనకీ ఎంతో ప్రాముఖ్యతిచ్చేవారు. ఆ సభలో త్యాగరాజు చూపించిన సంగీత విన్యాసం చూసి ఆశ్చర్యపోయారందరూ. ఈ సంగీత సభలో రాగాలాపన, నెరవులు లాంటి మనోధర్మ ప్రక్రియలను ప్రకటిస్తూ, “జానకీ రమణా”, “దొరకునా ఇటువంటి సేవ” (బిలహరి రాగం) కృతుల్నీ పాడాడు. త్యాగరాజు ప్రతిభ చూసి అమితానందభరితుడైన శొంఠి వేంకటరమణయ్య, పండితులందరి ముందూ అతన్ని సత్కరించినట్టు వెంకట రమణ భాగవతార్ రాసిన చరిత్రలో ఉంది.

శొంఠి వేంకటరమణయ్య వద్ద త్యాగరాజు సంగీత విద్యని ప్రదర్శించిన సంఘటన 1792లో త్యాగరాజు 25వ ఏట జరిగింది. దీనికాధారం కృష్ణ భాగవతార్ రాసిన జీవిత చరిత్ర. “గురువు శొంఠి వేంకట రమణయ్య గారి పైనున్న భక్తీ, గౌరవంతో త్యాగరాజు తన 25వ ఏట స్వీయ కృతులని విద్వాంసులందరి ముందూ పాడాడు. తమ రాజవిధుల్ని విస్మరించి మరీ ఆ సంగీతంలో లీనమైపోయారందరూ. పండితులందరి ముందూ గురువుగారు త్యాగరాజుని సత్కరించాడు. తనకి రాజు బహూకరించిన కంఠాభరణాన్నీ, రాజ పతకాన్నీ ఇచ్చి గౌరవించాడు. “త్యాగరాజు సంగీత జ్ఞానం ఒక వనమైతే అందులో తన సంగీతం ఒక చిన్న మొలకనీ అభివర్ణించాడు…” అంటూ (Tyagaraja and Renewal of Tradition, William J. Jackson) రాసారు. ఈ సంఘటన గురించి వెంకటరమణ భాగవతార్ రాసిన జీవిత చరిత్రలో, “జానకీ రమణా”, “దొరకునా ఇటువంటి సేవా ” వంటి కీర్తనలు పాడారని చెబుతూ విపులంగా ఉంది. ఇంత విపులంగా కృష్ణ భాగవతార్ రాసిన జీవిత చరిత్రలో లేదు.
ఈ సందర్భంగా గురువుగారు తనకు బహుకరించిన బహుమానాల్ని త్యాగరాజు గురువుగారికే తిరిగి ఇచ్చేశాడు. గురువుగారి కూతురి పెళ్ళి సందర్భంలో త్యాగరాజు ఆభరణాలు తిరిగిచ్చేసాడని వెంకటరమణ భాగవతార్ రాస్తే, తన పెళ్ళికే విచ్చేసిన గురువుకి కానుకగా ఇచ్చాడంటూ కృష్ణభాగవతార్ రాసాడు. గురువు వద్ద మొదటి కచేరీ చేసిన సంఘటన, 1792 లో త్యాగరాజుకి ఇరవై అయిదు సంవత్సరాలప్పుడు జరిగింది. కానీ త్యాగరాజు మొదటి వివాహం పద్దెనిమిదో ఏటే జరిగింది. కాబట్టి ఇక్కడ 25 వ ఏట జరిగిన వివాహం బహుశా త్యాగరాజుకి కమలాంబతో జరిగిన రెండో వివాహ సందర్భమయి ఉండాలి.

ఈ సభలోనే “ఎందరో మహానుభావులు” అనే ఘన రాగ పంచరత్న కృతి పాడినట్లుగా ఇంకో ప్రచారం ఉంది. ఎవరూ అంతగా ఉపయోగించని జన్య రాగమైన శ్రీ రాగంలో స్వరపరిచాడా కృతిని. ఆ కృతిలో ఎంతో మందిని స్మరించినందువల్లా, ఆ సందర్భానికది కుదిరినందువల్లా ఎందరో మహానుభావులు కృతే పాడుండచ్చనీ చాలా మంది ఊహాగానం చేసారు (త్యాగరాజు సినిమాలో, కొన్ని పుస్తకాల్లో కూడా). కాకపోతే ఇది మాత్రం సరి కాదని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే త్యాగరాజు ఘన రాగ పంచరత్న కీర్తనలు నలభై ఏళ్ళు దాటిన తరువాతే రచించాడు. త్యాగరాజుకి తంజావూరు రామారావు అనే ఓ బాల్య మిత్రుడూ, శిష్యుడూ ఉండేవాడు. ఈయన ప్రోద్బలం తోనే త్యాగరాజు పంచరత్న కీర్తనలు రాసాడని ఉంది. వెంకటరమణ భాగవతార్ తో కలిసి త్యాగరాజు జీవిత చరిత్ర రాయడానికి మొట్ట మొదటసారి సంకల్పించింది ఈ తంజావూరు రామారావే!
రాజాహ్వానం

త్యాగరాజుకి రెండుసార్లు రాజాస్థానం నుండి పిలుపొచ్చింది. శొంఠి వేంకటరమణయ్య ఆహ్వానంపై మొదట సారి తంజావూరు దర్బారు హాల్లో కచేరీ చేసిన జరిగిన వెంటనే రాజుగారు పిలిచారు. అప్పుడు త్యాగరాజుకి పాతికేళ్ళు. రెండో సారి 30 ఏళ్ళు దాటాక వచ్చింది. త్యాగరాజు జీవిత చరిత్ర రాసిన చాలామంది ఈ రెండు ఆహ్వానాలు ఒకటేనని భావించారు. అప్పటి కాలాన్ని బట్టీ, ఆ సమయంలో తంజావూరు రాజెవరన్న దాన్ననుసరించీ, ఇవి వేర్వేరు సంఘటనలన్న విషయం నిర్థారణ చేయచ్చు. మొదటి సారి పిలిచినపుడు రాజు పేరు తుల్జాజీ. రెండోసారి పిలుపొచ్చినప్పుడు రాజు పేరు శరభోజి. ఆ రెండు సంఘటనలూ ఏమిటో చూద్దాం.

శొంఠి వెంకట రమణయ్య ద్వారా త్యాగరాజు సంగీత ప్రతిభ తెలుసుకున్న తుల్జాజీ రాజు, తన వద్దకొచ్చి రాజదర్బారులో కచేరీ ఇవ్వవలసిందిగా కోరుతూ ఆస్థాన విద్వాంసుడిగా నియమిస్తాననీ కబురు పంపాడు. తుల్జాజీ ఆస్థాన విద్వాంసుల్లో ఒకడిగా ఉండడం త్యాగరాజు ఇష్టపడలేదు. రాజాస్థానం అతనికి కొత్తకాదు. తండ్రితో వెళ్ళేవాడు. అక్కడ ఎదురయ్యే పరిస్థితులూ, ఇబ్బందులూ, మొహమాటాలూ తెలుసు. అక్కడికెళితే తన సంగీతాన్ని పంజరంలో బంధించినట్లేనని భావించాడు. సంగీతాన్నీ, సాహిత్యాన్ని వెల కట్టకూడదన్న ఒక అభిప్రాయం దృఢంగా వచ్చేసింది. రాజుగారు పంపిన రెండు మూడాహ్వానాలనీ, ఏదో ఒక కుంటిసాకు చూపించి తిరస్కరించాడు. తుల్జాజీ ఈ విషయంపై స్పందించే లోపల తంజావూరు పై ముస్లిం నవాబులు యుద్ధానికొచ్చారు. ఆ గొడవలో ఇది కాస్తా వెనక్కి వెళ్ళింది. ఇది జరిగేనాటికి త్యాగరాజుకి పాతికేళ్ళు.

కృష్ణస్వామి భాగవతార్ రాసిన జీవిత చరిత్రలో ఈ సంఘటన గురించి ఇలా ఉంది. “త్యాగరాజు సంగీత ప్రతిభ విని, ఆయన్ని సత్కరించాలని తంజావూరు రాజు చాలా సార్లు ప్రయత్నించాడు. కానీ త్యాగరాజు రాజాస్థానానికి వెళ్ళడానికి అంగీకరించ లేదు. ఆ తరువాత రామ బ్రహ్మం అనారోగ్యం వల్ల మరణించాడు…” (పేజీ 64. Tyagaraja and the Renewal of Tradition, William J Jackson) అని రాసారు. అంటే ఈ సంఘటన రామబ్రహ్మం బ్రతికుండగానే జరిగుండాలి. కానీ రామబ్రహ్మం త్యాగరాజు ఇరవయ్యో ఏట పోయాడు. ఇది అందరూ ఒకే విధంగా రాసారు. కాబట్టి రాజు గారు ఆహ్వానం పంపించిన కాలం సుమారుగా త్యాగరాజు ఇరవయ్యో ఏట కానీ, ముందు కానీ అయ్యుండాలి.

త్యాగరాజు 25వ ఏటనే గురువు వద్ద కచేరీ చేసాడని విశ్వసిస్తే, కృష్ణ భాగవతారు పేర్కొన్నట్లుగా రాజాహ్వాన సంఘటన దాని తరువాత జరిగిందేనా అయ్యుండాలి. లేదా త్యాగరాజు ఇరవయ్యో ఏటికి ముందే రాజుగారి ఆహ్వనం అందుండాలి. ఎందుకంటే ఆ సంఘటనలో రాజు పేరు శరభోజీ అని అందరూ రాసారు. అందువల్ల ఆ రాజు శరభోజీ రాజేని విశ్వసిస్తే, కృష్ణ భాగవతార్ పైన రాసిన సంఘటనలో రాజు మాత్రం ఖచ్చితంగా శరభోజి కాదు. ఆప్పటి రాజు తుల్జాజీ. ఎందుకంటే శరభోజి తంజావూరు గద్దెనెక్కింది 1798 లో. అప్పటికి త్యాగరాజుకి సుమారుగా 31 యేళ్ళు. తుల్జాజీ హయాంలో చాలామంది సంగీత విద్వాంసులూ, కవులూ, కళాకారులూ బాగా పోషింపబడ్డారు. అదీకాక “రాజు” అనే సంబోధనే ఉండడం వల్ల శరభోజీనే అయ్యుండచ్చని గ్రహించుంటారు. దీన్నిబట్టి చూస్తే త్యాగరాజుకి రెండు సార్లు రాజుల వద్దనుండి పిలుపొచ్చింది. మొదటి సారి తుల్జాజీ నుండి. రెండోసారి శరభోజి నుండి. ఏది సరైంది? ఏది కాదు? తెలియాలంటే అప్పటి తంజావూరు రాజకీయ పరిస్థితి ఎలావుందో తెలియాలి.
తంజావూరు రాజకీయ పరిస్థితి

తూర్పు భారత దేశంలో వ్యాపార నిమిత్తమై ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో అడుగుపెట్టిన బ్రిటీషు వాళ్ళు దక్షిణాన మద్రాసు వరకూ వచ్చేసారు. అప్పటికే ఫ్రెంచి వాళ్ళూ, డచ్చి వాళ్ళూ దక్షిణాదిన మకాం వేసారు. తుల్జాజీ బ్రిటీషు వాళ్ళతో 1767 నుండీ దాదాపు రెండేళ్ళ పైగా యుద్ధం చేసాడు. అప్పుడే కరువొచ్చి పడింది. ఈ కరువు బ్రిటీషు వారి పాలిట వరమయ్యింది. చిన్న చిన్న రాజుల్ని తమ వైపుకి తిప్పుకొని వారికి సాయం చేస్తున్నట్లుగా భ్రమ కల్పిస్తూ, మెల్ల మెల్లగా ఆ రాజ్యాలు ఆక్రమించుకున్నారు ముస్లిం నవాబులతో చేతులు కలిపి 1773 నుండి 1776 వరకూ తంజావూరుని ఉమ్మడిగా పాలించారు. తంజావూరు పై నవాబులది పై చేయి కాకుండా ఉమ్మడి రాజ్యంగా మార్చి, బ్రిటీషు వాళ్ళు తిరిగి తుల్జాజీని గద్దెక్కించారు. హిందూ రాజయితే తమ కాలి క్రింద చెప్పులా ఉంటాడనీ, అంతే కాకుండా ప్రజలనుండి ఎటువంటి నిరసనా ఉండదన్నది బ్రిటీషు వాళ్ళ ఎత్తుగడ. ఆ రకంగా తంజావూరు రాజుని తమ చేతుల్లో కీలుబొమ్మగా మార్చుకున్నారు. బ్రిటీషు వాళ్ళు తప్ప వేరెవరైనా తంజావూరు గద్దెనెక్కడం నవాబులకీ అభ్యంతరం లేదు. పేరుకు తుల్జాజీ రాజే కానీ మొత్తం వ్యవహారమంతా అమర సింహుడనే ఓ సైన్యాధికారి చేతుల్లోనే ఉండేది.
తుల్జాజీ మరలా గద్దెనెక్కే ఉదంతమంతా ఎంతో తెలివిగా చక్రం తిప్పి చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధుల్లో ఒకడైన ఫ్రెడరిక్ ష్వార్ట్జ్ అనే క్రైస్తవ మత ప్రచారకుడు. సౌమ్యుడూ, శాంత స్వభావుడు అవడంవల్ల అటు బ్రిటీషు వాళ్ళ మెప్పూ, ఇటు హిందువుల మన్ననలూ అతి సులభంగా పొందాడు. ముస్లిం నవాబుల చేతా మెచ్చుకోబడ్డాడు. ష్వార్ట్జ్ అప్పటి సంఘటనలన్నీ లిఖిత పూర్వకంగా పొందుపరిచి చరిత్రకెక్కించాడు. కాకపోతే అతను రాసిన చరిత్ర తంజావూరు కోట దాటి బయటకు వెళ్ళలేదు. కరువును ఆయుధంగా మార్చుకొని ష్వార్ట్జ్ అనేకమంది మత మార్పిడికి కారకుడయ్యాడు. కరువు ప్రభావం వల్ల మానసిక స్థైర్యాన్ని కోల్పోయిన వాళ్ళని చర్చి వైపు మళ్ళించగలిగాడు.

ఇతనే తుల్జాజీ కొడుకు శరభోజికి ఇంగ్లీషు బోధకుడిగా ఉండేవాడు. తుల్జాజీ 1787 లో ఆనారోగ్యంతో మరణించాడు. వెంటనే అమరసింహుడు తంజావూరు గద్దెనెక్కాడు. ష్వార్ట్జ్ కి అమరసింహుడు రాజవ్వడం సుతరామూ ఇష్టం లేదు. ఎలాగైనా శరభోజిని రాజుని చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఎంత తెలివిగా రాజకీయం నడిపినా కుదర్లేదు. అది ఫలించడానికి సుమారు పదేళ్ళు పట్టింది. శరభోజిని 1798లో రాజుగా దగ్గరుండి గద్దెనెక్కించాడు. కాకపోతే అతని అదృష్టం అంతగా కలిసి రాలేదు. రెండేళ్ళు తిరక్కుండానే ష్వార్ట్జ్ అస్వస్థతతో పోయాడు.
అంతవరకూ ప్రతీ చిన్న విషయానికీ ష్వార్ట్జ్ మీద ఆథారపడ్డ శరభోజి తంజావూరు రాజ్యాన్ని ఈస్ట్ ఇండియా వాళ్ళకి ధారాదత్తం చేసి, తన శేష జీవితం వెళ్ళబుచ్చడానికి పెద్ద మొత్తంలో ధనాన్ని తీసుకున్నాడు. ఇతనికి సాహిత్యమన్నా, సంగీతమన్నా అభిరుచెక్కువ. ప్రప్రంచంలో ఉన్న ప్రతీ చోట నుండీ వందలకొద్దీ పుస్తకాలు సంపాదించాడు. ప్రస్తుతమున్న తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయం ఇతని భిక్షే! కవుల్నీ, కళాకారుల్నీ పోషించాడు. శరభోజీ మహారాజుకే శర్ఫోజీ అనే పేరు కూడా ఉంది. ఈయన పాలరాతి విగ్రహం తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయం లో ఇప్పటికీ చూడచ్చు. ఈ చరిత్ర ప్రకారం చూస్తే త్యాగరాజు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కాలం తెలుస్తుంది. కాకపోతే ఆయన జీవిత చరిత్ర రాసినిద్దరూ సంవత్సరాల చరిత్ర జోలికి పోలేదు. సమయానికి సంబంధించి ప్రస్తావించిన రెండు మూడు విషయాలూ సందేహాస్పదంగానే చెప్పారు.

నిధి చాలా సుఖమా?

[శరభోజి మహారాజు]
శరభోజి మహారాజు

బ్రిటీషు వారి పుణ్యమాని శరభోజి మహారాజుకి పాలనా బాధ్యతలు లేకపోవడంతో ఎప్పుడూ సంగీత సాహిత్యాలతోనే కాలం గడిపేవాడు. ఇతని కాలంలో ఎన్నో నాటకాలూ, యక్షగానాలూ వచ్చాయి. ఆ రోజుల్లో తమని కీర్తిస్తూ రాసే సాహిత్యానికి పెద్ద పీట వేసే వ్యసనమొకటి రాజులకుండేది. శరభోజి మహారాజు ఇందుకేమీ భిన్నం కాదు. శరభోజి గౌరవార్థం “శరభేంద్ర భూపాల కురవంజి” అనే నృత్య రూపకాన్ని శివకొలందు దేశికార్ అనే ఆయన రాసాడు. పల్లవి గోపాలయ్యర్ అనే సంగీత విద్వాంసుడు శరభోజి మహారాజు పై తోడి రాగంలో “కనకాంగి” అనే ఒక వర్ణం రాసి అర్పించాడు.

త్యాగరాజు ప్రతిభ విని, అతని చేత కూడా తనపై కొన్ని కీర్తనలూ, కృతులూ కట్టించుకొనే ఉద్దేశ్యంతో రాజాస్థానానికి ఆహ్వానిస్తూ కబురు పంపాడు. ఇది 1802 సంవత్సరంలో జరిగింది. ఈ సంఘటన జరిగే కాలానికి త్యాగరాజుకి సుమారుగా ముప్పై అయిదేళ్ళు. అప్పటికే త్యాగరాజు అనేక మంది ఆహ్వానం మీద ధనాన్నికానీ, కానుకలు కానీ ఆశించకుండా కచేరీలు ఇచ్చాడు. కానీ, తనపై ఒక కృతి రాసి పాడమని రాజు ఆదేశించడం త్యాగరాజుకి నచ్చలేదు. ఆ సందర్భంలోనే “నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా? నిజముగ పల్కు మనసా” అనే కృతి రాసుండచ్చనీ సాంబమూర్తి రాసారు. మొదట త్యాగరాజు చరిత్ర రాసిన వెంకటరమణ భాగవతార్ కానీ, ఆయన కొడుకు కృష్ణ భాగవతార్ కానీ ఈ కృతి ప్రస్తావనే చేయలేదు. కాకపోతే కృష్ణ భాగవతార్ శరభోజి మహారాజు పేరు ఎత్తకుండా రాజుగా సంబోధిస్తూ ఇదే సంఘటన్ని రాసాడు.

“దమ శమమను గంగా స్నానము సుఖమా?
కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా?
మమత బంధన యుత నర స్తుతి సుఖమా?
సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా?”

మూడో వాక్యంలో నర స్తుతి సుఖమా అని రాయడంతో బహుశా ఈ కృతే చెప్పి ఉండచ్చనీ అనుకోవచ్చు. కాకపోతే ప్రతీ కృతికీ కాలాన్నీ, సందర్భాన్నీ సూచించే లిఖిత పూర్వకమైన చరిత్రయితే ఎక్కడా లేదు.

ఇది జరగడానికి ముందు వేరొక సంఘటన శరభోజికి త్యాగరాజు గొప్పతనం తెలియడానికి దోహదపడింది. ఈ సంఘటన కూడా సాంబమూర్తి గారి రచన ద్వారానే తెలిసింది. ఇది త్యాగరాజు ఇతర శిష్యుల ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చుండచ్చనీ అనుకోవాలి. ఒకసారి శొంఠి వెంకటరమణయ్య ఆహ్వానం మేరకు ఓ సాయంత్రం తంజావూరు దర్బారు హాలులో పాడడానికి వెళ్ళాడు త్యాగరాజు. అదే రోజు రాత్రి శరభోజి రాజు సమక్షంలో కవుల, విద్వాంసుల గోష్ఠుంది. కేవలం తంజావూరు సంస్థాన విద్వాంసులే దానికాహ్వానితులు. ఇక్కడ త్యాగరాజు సంగీత కచేరీ మొదలయ్యాక ఎవరికీ కాలమే తెలీలేదు. కాంభోజి రాగంతో కచేరీ ప్రారంభమయ్యింది. ఇందులో “మరి మరి నిన్నే” అనే కీర్తనలో త్యాగరాజు చేసిన స్వరకల్పన చూసి, అందరూ మంత్ర ముగ్ధులయ్యారు. రెండు గంటల పాటు జరగాల్సిన కచేరీ దాదాపు ఎనిమిది గంటల వరకూ జరిగింది.

త్యాగరాజు సంగీతంలో మునిగి పోయి శరభోజి మహారాజు గోష్ఠి గురించి అందరూ మర్చిపోయారు. ఆ మర్నాడు శరభోజి ఆగ్రహానికి గురి కావల్సొస్తుందని అందరూ భయపడుతూ వెళ్ళారు. అనుకున్నట్టే రాజు క్రితం రాత్రి గోష్ఠి కెవరూ ఎందుకు రాలేదని నిలదీసాడు. అప్పుడే శొంఠి వెంకటరమణయ్య కల్పించుకొని తనే స్వయంగా తన శిష్యుడు త్యాగరాజు కచేరీ ఏర్పాటు చేసాననీ చెప్పాడు. త్యాగరాజు సంగీత కచేరీ విని తీరాల్సిందేనని శరభోజి ముందు వేనోళ్ళా పొగిడాడు. ఈ విధంగా శరభోజి మహారాజుకి త్యాగరాజు గురించి తెలిసింది. ఈ సంఘటన గురించి కేవలం సాంబమూర్తి మాత్రమే రాసారు. దీని తరువాత వచ్చిన త్యాగరాజు జీవిత చరిత్రలన్నీ ఈ సంఘటనని యథేఛ్ఛగా ఉటంకించారు. సాంబమూర్తి ప్రస్తావించిన ఈ సంఘటన జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే శరభోజి మహారాజు త్యాగరాజుకి ఆహ్వానం పంపడం మాత్రం అందరూ రాసారు. సంఘటన వరకూ నమ్మశక్యంగా ఉంది కానీ, సాంబమూర్తి రాసినట్లుగా “మరి మరి నిన్నే” కీర్తనే అక్కడ పాడారన్న ఆధారాలు లేవు.
చీలికలు తెచ్చిన తిరస్కారం

తండ్రి పోయిన తరువాత త్యాగరాజు కుటుంబమూ, తల్లీ, అన్నగారు పంచనదయ్య కుటుంబమూ అందరూ ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంలా ఉండేవారు. పైన చెప్పిన సంఘటన జరిగిన తరువాతే శరభోజి కానుకలిచ్చి సేవకుల్ని త్యాగరాజింటికి పంపాడు. అవి వద్దని అన్నగారి ఎదుటనే తిరస్కరించడంతో అన్నదమ్ములిద్దరి మధ్యా విబేధాలు తారాస్థాయి నందుకున్నాయి. ఇంటికొచ్చిన లక్ష్మిని చేతులారా వెనక్కినెట్టడం సహించలేకపోయాడు పంచనదయ్య. అన్నగారి కోపతాపాలకి చలించలేదు. తల్లికూడా త్యాగరాజునే సమర్థించడంతో, పంచనదయ్య భరించలేకపోయాడు. తను ఈ ఉమ్మడి కుటుంబభారం మోయలేననీ, ఆస్తిని భాగాలు చేయాలనీ మొండికేసాడు. పంచనదయ్య రాత్రికి రాత్రి త్యాగరాజునీ, భార్యనీ, కూతుర్నీ ఇంటినుండి వెళ్ళగొట్టాడు. రాత్రంతా వీధి అరుగు మీద జాగారం చేసాడు త్యాగరాజు. ఆ రాత్రి రాముడూ, సీతా, ఆంజనేయుడు త్యాగరాజు దగ్గరికి వచ్చి, ఆహారం ఇచ్చారనే ఒక కథుంది. అప్పుడే “భవనుత” కృతిని చెప్పినట్లుగా రాసారు. ఇది పురాణికులు అల్లిన కథ. అసలు జరిగింది వేరే ఉంది.

త్యాగరాజు రాత్రంతా వీధరుగు మీద గడిపాడని అతని స్నేహితుడు తంజావూరు రామారావుకి తెలిసింది. తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. తండ్రి ఇచ్చిన రామ పంచాయతనానికి రోజూ పూజ చేస్తానని మాటిచ్చాననీ, అది ఉల్లంఘించడం తనవల్ల కాదనీ త్యాగరాజు రామారావుతో అన్నాడు. రామారావు ఊరి పెద్దల్ని సంప్రదించాడు. పంచనదయ్యకి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. తండ్రి ఆస్తిలో త్యాగరాజుకి హక్కు ఉందని వాదిస్తూ, బయటకు నెట్టే హక్కు పంచనదయ్యకు లేదని పెద్దలచేత పంచాయితీ పెట్టించాడు. అప్పటి వరకూ ఉమ్మడిగా ఉంటున్న ఇల్లుని వాటాలు వేయాలని తీర్మానించాడు. త్యాగరాజు ఈ విషయంలో మౌనంగానే ఉన్నాడు. ఇదంతా రామారావే చూసుకున్నాడు. ఆ రకంగా రామబ్రహ్మానికి తుల్జాజీ కానుకగా ఇచ్చినిల్లు రెండు వాటాలుగా చీలిపోయింది. ఈ తంజావూరు రామారావే కల్పించుకోకపోతే త్యాగరాజు ఉండడానికా ఇల్లు కూడా దక్కేది కాదు. ఈ వాటాలు వేయడం తంజావూరు మేజిస్ట్రేట్ సమక్షంలో జరిగింది. (తిరువయ్యారు తహశీల్దారు రాసిన పత్రాలు తంజావూరు సరస్వతి మహల్ గ్రంథాలయంలో ఉన్నాయని విన్నాను. ప్రత్యక్షంగా చూడలేదు).

ఈ ఉమ్మడి కుటుంబం చీలిపోయిన సందర్భంలోనే “నాదుపై పలికేరు నరులు” అనే కీర్తన రాసినట్లుగా చెబుతారు. త్యాగరాజు కాలంలో తంజావూరు రాజ్య పరిస్థితి ఎంతో దుర్భరంగా ఉండేది. ఒక వైపు ప్రకృతి వైపరీత్యాలూ, మరో వైపు యుద్ధాలూ, ఆక్రమణలూ, ఆకలి చావులూ, దాడులూ, దోపిడీలతో భయంకరంగా ఉండేది. రామభక్తి తత్వంలో ఇవేమీ తనకు పట్టనట్లుగానే త్యాగరాజు కృతులు కూర్చాడు. కానీ ఈ కీర్తనలో మాత్రం తన గోడు వెళ్ళబుచ్చుకున్నాడు. తన జీవితానికి సంబంధించిన విషయాలని కొన్నిటిని స్పష్టంగా చెప్పాడు. ఆ కీర్తన చరణాలు చూస్తే తెలుస్తందది.

నాదుపై పలికేరు నరులు
వేద సన్నుత, భవము వేరు జేసితిననుచు (నా)

పంచ శర జనక, ప్రపంచమున గల సుఖము
మంచు వలె ననుచు మదినెంచితి గాని
పంచుకొని ధనము లార్జించు కొని సరియెవ్వ
రంచు మరి గతియు లేదంచు పల్కితినా (నా)

దినము నిత్యోత్సవమున కాస జెందితి
నా మనసున ఇల్లు ఒకటియనియుంటి గాని
అనుదినము నొరుల మేలును జూచి తాళ
లేకను రెండు సేయవలె ననుచు పల్కితినా (నా)

ప్రాణమే పాటియని మానమే మేలంటి
గాని శ్రీరామ పరమానంద జలధి
శ్రీనాథ కులములో లేని దారిని పట్టి
జానెడుదరము నింప నొరుల పొగడితినా ( నా)

ఆజానుబాహు యుగ, శ్రీజానకీ పతి,
పయోజాక్ష, శ్రీత్యాగరాజ నుత చరణ,
ఈ జగతిలో నిన్ను పూజించు వారి
నవ్యాజమున బ్రోచు సురాజ, నీవాడైన (నా)

ఇదొక్క కీర్తనే త్యాగరాజు తన లౌకిక జీవితానికి సంబంధించిన సంఘటనపై రాసిందని రూఢిగా చెప్పచ్చు. మిగతా కొన్ని కీర్తనల్లో సూచన ప్రాయంగా ఉంటుంది. ఇందులో మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ ఇల్లు వాటాల విషయం త్యాగరాజు జీవిత చరిత్ర రాసినందరూ ప్రస్తావించారు. ఇది జరిగిన కాలం విషయంలోనే తేడాలు కనిపించాయి. శరభోజి కానుకలు తిరస్కరించిన ఘట్టం 1802 ప్రాంతంలో జరిగిందని సాంబమూర్తి చెప్పారు. చరిత్ర తేదీలని బట్టి చూస్తే ఇది సరి అయినదే అని చెప్పచ్చు. ఈ ఇల్లు వాటా వేసిన సమయం మాత్రం సరిగ్గా చెప్పలేదు. తల్లి సీతమ్మ మరణానంతరమే జరిగిందని రాసారు. కానీ సీతమ్మ 1804 లో పోయింది. అంటే రెండేళ్ళ వరకూ త్యాగరాజూ, పంచనదయ్య కలిసే ఉన్నారా? అయితే తంజావూరు మేజిస్ట్రేట్ ముందు జరిగిన పంచాయితీ 1802 లోనే జరిగిందని రాసారు కదా? కాబట్టి 1802లోనే ఇల్లు వాటాలు జరిగుండాలి.

[త్యాగరాజు నివసించిన ఇల్లు]
త్యాగరాజు నివసించిన ఇల్లు

కాకపోతే మరి కొంతమంది ఈ సంఘటన రామబ్రహ్మం పోయిన వెంటనే జరిగిందని రాసారు. అందరికంటే విరుద్ధంగా విలియం జాక్సన్ రాసిన పుస్తకంలో కనిపించింది. “త్యాగరాజు ఇరవయ్యో ఏట తండ్రి రామబ్రహ్మం మరణించినప్పుడు వారుండే ఇల్లుని రెండుగా వాటాలు వేసారు. తనకి కేటాయించిన వాటాలోనే రామ భక్తి పారవశ్యంతో త్యాగరాజు జీవితాన్ని గడిపాడు” అంటూ రాసారు (Tyagaraja: Life & Lyrics, page 4). పైన చూపించిన సంవత్సరాల వివరాలు చూస్తే ఇది ఖచ్చితంగా సరైనది కాదని చెప్పగలం. జాక్సన్ ఇలా రాయడానికి ఆధారాలేమిటో తెలీదు. ఇప్పటికీ తిరువయ్యార్ లో తిరుమంజన వీధిలో త్యాగరాజు నివసించిన ఇల్లుంది. ప్రస్తుతం దాన్ని ఒక చారిత్రాత్మక నివాసంగా మార్చడానికి కొంతమంది సంగీత ప్రియులు ప్రయత్నిస్తున్నారు.
ఉంఛవృత్తి

పంచనదయ్య తిరువయ్యార్ మేజిస్ట్రేట్ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసేవాడు. త్యాగరాజు ఎక్కడా ఉద్యోగం చేసినట్లుగా లేదు. అతనికీ త్యాగరాజుకీ వయసు బేధం ఎక్కువే. మధ్యలో చిన్నతనంలోనే పోయిన ఒక అన్న పంచాపకేశ బ్రహ్మం ఉన్నాడు. పంచాపకేశ బ్రహ్మానికీ త్యాగరాజుకీ వయసు అంతరం తక్కువ కావడంతో త్యాగరాజుకి ఈ అన్నతో చాలా చనువెక్కువ. త్యాగరాజు తన మనవడికి అదే పేరు పెట్టాడు. తండ్రిపోయిన మూడేళ్ళకి త్యాగరాజు మొదటి భార్య పార్వతి అనారోగ్యంతో హఠాత్తుగా మరణించింది. ఇంతకుమించి ఈమె గురించి వివరాలు ఎవరూ చెప్పలేదు. మొదటి భార్యతో త్యాగరాజుకి పిల్లలు లేరు. ఆ తరువాత కమలాంబతో త్యాగరాజుకి రెండో వివాహం జరిగింది.

త్యాగరాజుతో పెళ్ళైన ఏడాదికి అంటే త్యాగరాజు 27వ ఏట (1894 లో) కమలాంబకి ఒక కూతురు జన్మించింది. ఆ అమ్మాయికి సీతాలక్ష్మి అని పేరు పెట్టారు. వేరుపడ్డాక త్యాగరాజు రోజు వారీ జీవితం గడపడానికి కష్టమయ్యింది. ఆ సమయంలో అతని స్నేహితుడు తంజావూరు రామారావే అతన్ని ఆదుకున్నాడు. ధన సహాయమంటూ ప్రత్యేకించి చేయకపోయినా త్యాగరాజు కుటుంబం గడవడానికొక ఆధారం చూపించాడు. తెలుసున్న వాళ్ళింట్లో త్యాగరాజు కచేరీ ఏర్పాటు చేసేవాడు. అదైన తరువాత వారికి తోచిన ఆహార సంబంధిత వస్తువులు తీసుకునే వారు. అదీ వారానికి సరిపడా మాత్రమే ఇమ్మనమని చెప్పేవారు. ధనరూపేణా కానీ, వస్తురూపేణా కానీ త్యాగరాజు ఎప్పుడూ ఎవరి వద్దా తీసుకోలేదు. పూర్వం హరిదాసుల ఇళ్ళల్లో “ఉంఛవృత్తి” అనే ఒక సంప్రదాయం ఉండేది. అది ఏమిటంటే - ప్రతీ రోజూ అపరాహ్నవేళ హరిదాసులు హరినామ సంకీర్తనతో వీధుల గుండా వస్తారు. ఎవర్నీ బిచ్చం అడగరు. ఎవరకు తోచిన ఆహార వస్తువులు వారు హరిదాసుల వద్దకు పోయి ఇవ్వాలి. ఆ రోజుకి సరిపడా మాత్రమే హరిదాసులు స్వీకరించాలి. మొదట్లో త్యాగరాజు ఎవరి వద్దా ధన సహాయం, ముఖ్యంగా తన సంగీతం ద్వారా సంపాదించడం ఇష్టం లేకపోతే, ఈ ఉంఛవృత్తి సారాన్ని చెప్పి త్యాగరాజుని రామారావే సమాధానపరిచాడు. ఈ వృత్తిని స్వీకరించడానికి త్యాగరాజుకి కొంతకాలం పట్టింది. “ఎన్నాళ్ళు తిరిగేది యెన్నాళ్ళు” కీర్తన ఈ ఉంఛవృత్తి పై రాసిందే!
తంజావూరు రామారావు

తిరువయ్యారు చేరిన కొత్తల్లో దాదాపు మూడేళ్ళు పైగా త్యాగరాజు అక్కడి సంస్కృత పాఠశాలలో విద్య నభ్యసించాడు. ఆ సంస్కృత విద్యాలయంలో త్యాగరాజుకొక మిత్రుడు దొరికాడు. వారిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. అతనే తంజావూరు రామారావు. అసలు పేరు తంగిరాల ఎస్. రామారావు. తెలుగువాడు. అందరూ తంజావూరు ఎస్. రామారావు అని పిలిచేవారు. ఇతను త్యాగరాజు కంటే వయసులో రెండేళ్ళు చిన్న. ఈ రామారావు మృదంగం నేర్చుకున్నాడు. ఇద్దరికీ సంగీతమే స్నేహాన్ని కలిపింది. అలా కలిసిన ఈ ఇద్దరి స్నేహమూ, త్యాగరాజు సమాధి చెందే వరకూ ఉంది. సొంత కుటుంబీకుల తరువాత త్యాగరాజుకి అత్యంత సన్నిహితుడు ఈ రామారావే!

త్యాగరాజు వద్ద ఈ రామారావు సంగీతం నేర్చుకునేవాడు. ఇతనే త్యాగరాజుకి ప్రథమ శిష్యుడని చెప్పచ్చు. ఇతను త్యాగరాజుకు అనుంగు శిష్యుడే కాడు, మిత్రుడు కూడా. ఇతనే త్యాగరాజుకి ప్రతీ చోటా కచేరీ ఏర్పాట్లు చూసేవాడు. రామనామ సంకీర్తన పేరుతో కొంతమంది ఇళ్ళల్లో సంగీత కచేరీలు పెట్టించాడు. ఆ కచేరీల్లో కూడా ఏయే కీర్తనలు పాడాలో ఇతనే ముందుగా చెప్పేవాడని అందరూ రాసారు. ఇతని ప్రోద్బలం వల్లే ఘనరాగ పంచరత్న కీర్తనలు త్యాగరాజు రచించాడని సాంబమూర్తి ది గ్రేట్ కంపోజర్స్ పుస్తకంలో రాసారు.
శిష్య పరంపర

త్యాగరాజు తన వద్ద వచ్చిన వారికి కాదనకుండా సంగీతం నేర్పాడు. గురుకుల వ్యవస్థలా తన వద్దే ఉండి నేర్చుకోవాలని నియమం పెట్టాడు. అంటే త్యాగరాజు ఇంట్లోనే వాళ్ళు కొంత కాలం, ఒకటో, రెండో ఏళ్ళుంటేనే సంగీతం నేర్పడానికి ఒప్పుకునేవాడు. శిష్యులందరికీ ఉచిత భోజనం వసతీ ఇచ్చాడు. దీనికి సిద్ధపడి ఒప్పుకున్న వారందరికీ వారి వారి స్థాయిని బట్టి సంగీతం నేర్పాడు.

సంగీతానికీ సాహిత్యానికీ ఎంతో అవినాభావ సంబంధం ఉందని త్యాగరాజు విశ్వసించేవాడు. భావావేశంతో పాడితేనే ఏ కృతైనా రక్తి కడుతుంది. అది కలగాలంటే భాష క్షుణ్ణంగా రావాలి. సాహిత్యం అర్థం కాకపోతే ఆత్మానందం కలగదు. ఆత్మానందం కలగకపోతే తాదాత్మ్యం రాదు. అది లేకపోతే సంగీతం రాణించదు. కాబట్టి సాహిత్యం అర్థంకాని సంగీతానికి విలువ లేదు. ఇదీ త్యాగరాజు నమ్మిన సిద్ధాంతం కాబట్టి త్యాగరాజు స్వరపరిచిన కృతులు నేర్చుకోవాలంటే ముందుగా తెలుగు భాష రావాలి. కానీ త్యాగరాజు వద్దకొచ్చిన చాలామంది శిష్యులకి తెలుగు రాదు. తెలుగు రాని శిష్యులకి ప్రతీ రోజూ రామారావు తెలుగు నేర్పేవాడని అంటారు. ఇదే విషయాన్ని వీణ కుప్పయ్యర్ అనే శిష్యుడు రాసినట్లుగా చెబుతారు (ఈ ప్రతి ఎంత కష్టపడినా లభించలేదు).

త్యాగరాజు శిష్యుల్లో ఒక ప్రముఖుడు వీణ కుప్పయ్యర్. సంగీతం విషయంలో ఇతనికి విశేష ప్రతిభుందనీ అందరూ అనుకునేవారు. త్యాగరాజు కూడా ఇతనికి ప్రత్యేకమైన శ్రద్ధతో, సంగీతంలో ఎన్నో లోతైన విషయాలు చెప్పాడని అతను రాసుకున్నాడు. ఈ వీణ కుప్పయ్యర్ తమిళ బ్రాహ్మణుడు. సంస్కృతమూ, తమిళమూ తప్ప తెలుగు రాదు. త్యాగరాజు వద్ద శిష్యరికం మొదలు పెట్టిన తరువాత ఈయన తెలుగు కూడా నేర్చుకున్నాడు. ఈ వీణ కుప్పయ్యర్ ఎన్నో కృతులూ, వర్ణాలూ తెలుగులోనే రచించాడు. ఇతను త్యాగరాజు వద్ద సుమారు అయిదేళ్ళు పైగా సంగీతం నేర్చుకున్నాడని సాంబమూర్తి రాసారు (ది గ్రేట్ కంపోజర్స్ 193 - 197 పేజీలు)

సంగీత శిక్షణలో సాధారణంగా గీతమైనా, వర్ణమైనా, కృతైనా స్వరాలతో నేర్పుతారు. స్వర స్థానాలు చక్కగా వచ్చిన తరువాతే సాహిత్యంతో నేర్పేవారు. త్యాగరాజు ఈ పద్ధతికి భిన్నంగా ఏ కృతైనా సాహిత్యంతో నేర్పి, అది భావయుక్తంగా పాడుతున్నారనిపిస్తేనే స్వరాలతో చెప్పేవాడు. అందుకే కొన్ని త్యాగరాజ కీర్తనలకి స్వరాలు దొరకలేదని అంటారు. దాదాపు 800 పైగా కీర్తనలు ఇప్పుడు మనకి ఉన్నాయి. వేలకొద్దీ రచించాడనీ, స్వరాలు తెలియక పోవడవల్ల కొన్ని అందుబాటులోకి రాలేదని కొందరు సంగీతజ్ఞుల అభిప్రాయం. కాబట్టి త్యాగరాజు అవలంబించిన పద్ధతి చూస్తే ఖచ్చితంగా సాహిత్యమర్థమవ్వాలి. అందుకే తెలుగు రాని వారికి తెలుగు నేర్పి మరీ సంగీతం నేర్పాడు. ఈ విషయాన్ని ది గ్రేట్ కంపోజర్స్ లో సాంబమూర్తీ, వాగ్గేయకారుల చరిత్రలో టి. పార్థసారథి ప్రస్తావించారు.

త్యాగరాజు వద్దకి ఎంతో మంది కేవలం సంగీతం నేర్చుకోవడానికే కాదు, కొంతమంది జ్యోతిశ్శాస్త్రం నేర్చుకోడానికీ, మరి కొంతమంది తెలుగు భాష నేర్చుకోడానికీ వచ్చే వారని ది గ్రేట్ కంపోజర్స్ లో రాసారు. ఈ తంజావూరు రామారావే తెలుగు చెప్పినట్లుగా వెంకటరమణ భాగవతార్ (త్యాగరాజు జీవిత చరిత్ర ఈయన, తంజావూరు రామారావు కలిసి రాసారు) గారి మనవడు రాసిన జీవిత చరిత్ర పుస్తకంలో ఈ విషయం ఉంది. ఇవన్నీ క్రోడీకరించి పై విధంగా జరిగుండచ్చనీ భావించి, ఈ నిర్థారణకు రావడం జరిగింది. ఏదైతేనే త్యాగరాజు ధర్మమాని తమిళ నాటా, నోటా తెలుగు పదం సుందరంగా నిలిచింది. త్యాగరాజు వద్ద సంగీత శిష్యరికం చేసిన వాళ్ళల్లో ఇద్దరు మాత్రమే తెలుగు వాళ్ళు. వారిద్దరిలో ఒకరు ఈ తంజావూరు రామారావు. మరొకరు మనంబుచవాది వెంకట సుబ్బయ్యర్. మిగతా అందరూ తమిళులే!

[సరస్వతీ మహల్ గ్రంథాలయం]
సరస్వతీ మహల్ గ్రంథాలయం

మరొక శిష్యుడైన వెంకటరమణ భాగవతారు దాదాపు ముఫ్ఫై ఏళ్ళు త్యాగరాజుతో గడిపాడు. ఇతనూ, రామారావూ త్యాగరాజు రాసిన కృతులన్నీ పొందుపరిచారు. కలసి జీవిత చరిత్ర రాయడానికి పూనుకున్నారు. వీరిద్దరి కృషివల్లే ఈ త్యాగరాజ కృతులు ముందుతరాలకి లభ్యమయ్యాయి. చాలా కాలం త్యాగరాజుతో గడపడం వల్ల వీరిద్దరికీ చాలా కృతులు తెలిసే అవకాశం ఉంది. చివర్లో ఈ వెంకటరమణ భాగవతార్ కూడా మద్రాసు వెళ్ళిపోయాడు. ఇతను త్యాగరాజు పేరు ప్రఖ్యాతులు విని సంగీతం మీద అభిలాషతో తిరువయ్యార్ వచ్చాడు. అలాగే వీణా కుప్పయ్యర్ కూడా త్యాగరాజ కృతులెన్నో తాళపత్రాలకెక్కించాడు. ఇవన్నీ మదురై సౌరాష్ట్రసభలో ఉన్నాయి. కొన్ని తంజావూరు సరస్వతీ మహల్ గ్రంధాలయంలో ఉన్నాయి.
యక్షగానాలు

త్యాగరాజు తన సంగీతాన్ని కేవలం కృతిరచనకే పరిమితం చెయ్యలేదు. త్యాగరాజుకి అత్యంత ప్రీతిపాత్రమైన నృత్యనాటికలు కూడా రాసాడు. ఈ నృత్యనాటికలకి మూలం, అప్పట్లో బహుళ ప్రచారంలో ఉన్న యక్షగానాలు. ఎన్నో యక్షగాన బృందాలు ఊరూరా తిరుగుతూ తరచు ప్రదర్శనలిచ్చేవారు. బహుశా త్యాగరాజు ఈ యక్షగానాలు చూసి ఆకర్షితుడయ్యుండచ్చు. అందుకే కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని యక్షగాన ప్రక్రియలో మిళితం చేసి మూడు నృత్య నాటికలు రాసాడు. అవి నౌకా చరిత్రం, ప్రహ్లాద భక్తి విజయం, సీతారామ విజయం. మొదటి రెండిటి ప్రతులూ ఇప్పుడు లభ్యమవుతున్నాయి. మూడోది దొరకలేదు. కానీ సీతారామ విజయం ఖచ్చితంగా రాసాడని సంగీత శాస్త్రజ్ఞలు విశ్వసిస్తారు. కాంభోజి రాగంలో “మా జానకీ చెట్టబట్టగా” అనే ప్రసిద్ధమైన కృతి ఈ సీతారామ విజయం లోనిదే అంటారు. అలాగే కేదార గౌళ రాగంలోని “వనజ నయనుడని వలచితివో” అనే కృతి కూడ ఇందులోదే అంటారు. ఈ కీర్తనలున్నాయి కానీ, ఈ నృత్య నాటిక ప్రతి మాత్రం లేదు. లోకనారాయణ శాస్త్రుల్లు అనే వ్యక్తి 1868 లో ఈ సీతారామ విజయాన్ని మొదటి సారి ప్రచురించారు. దురదృష్టవశాత్తూ ఒక్క ప్రతి కూడా ఇప్పుడు లేదు. ఈ సీతారామ విజయమే త్యాగరాజు రాసిన మొట్ట మొదటి నృత్య నాటికని అంటారు. కాదు, నౌకాచరిత్రమే మొదటి నృత్య నాటికని మరికొందరంటారు. ఏ కాలంలో ఏది రాసిందీ తెలీదు.

[నౌకాచరిత్రం]
నౌకాచరిత్రం

నౌకాచరిత్రమే ముందు రాసిఉండే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇది త్యాగరాజు రెండో వివాహం అయిన కొత్తల్లో రాసాడు. దాదాపు కృతులన్నీ భక్తి తత్వం మీదుగానే ఉన్నా కొన్ని చోట్ల శృంగారరసం మిళితమై కొన్ని కీర్తనలున్నాయి. ఏ కవీ తన వయసునీ, కాలాన్నీ దాటి పోలేడు. ఈ నిర్ధారణలు ఊహాజనితాలే - వీటికి ఆధారాల్లేవు. ఈ నౌకాచరిత్రం తాళపత్ర గ్రంధం తంజావూరు సరస్వతీ మహల్ గ్రంధాలయంలో ఉంది. ఈ ప్రతి తమిళలిపిలో ఉంటుంది. ఈ నౌకా చరిత్రాన్ని 1939 లో సాంబమూర్తి ప్రచురించారు. ఆయనకి దీని ప్రతి కృష్ణస్వామి భాగవతార్ (త్యాగరాజు శిష్యుడు) కొడుకు కె.కె. రామస్వామి భాగవతార్ ద్వారా లభించింది. వీళ్ళందర్నీ వాలాజపేట శిష్యులంటారు. ప్రతీఏటా వైకుంఠ ఏకాదశి నాడూ ఈ వాలాజపేట శిష్యులు నౌకా చరిత్రం పాడేవారని సాంబమూర్తి రాసారు.

దీనిలో కథ పూర్తిగా త్యాగరాజు కల్పన. శ్రీకృస్ణుడు గోపికల మధ్యన నౌకావిహారం అనే కొత్త సన్నివేశాన్ని కల్పించాడు. గోపికలతో కలసి యమునా నదిలో నౌకా విహారయాత్ర కెళితే గాలివానలో చిక్కుకున్న గోపికల్ని రక్షించే దైవంగా కృష్ణుణ్ణి చిత్రీకరిస్తూ - శృంగారాన్నీ, భక్తినీ, తత్వాన్నీ చూపించాడు. గోపికలు యమునా నదిలో నౌకా విహారానికి వెళదామని సిద్ధమవుతారు. వారితో బాలకృష్ణుని వెంట తీసుకెళ్ళాలా, వద్దా అని సంశయిస్తారు. బాలుణ్ణని శంకించ వద్దని చెబుతూ, కాళింది మడుగులో కాళీయుని మదమడచి గోపబాలుర్ని రక్షించలేదా అంటూ, కృష్ణుడు వాళ్ళని సమాధానపరిచి వారితో బయలదేరుతాడు. ఆనందంగా సాగే నౌకాక్రీడ మధ్యలో గాలివాన వస్తుంది. ఇంతలోనే ఓడకు చిన్న కంత ఏర్పడి నీరు వచ్చే ప్రమాదముందని కృష్ణుడు హెచ్చరిస్తాడు. గోపికలు వినరు. ఆ కంత కాస్తా పెద్దదయ్యి నౌక మునిగిపోయే పరిస్థితి వస్తుంది. చివరకి అందరూ చిన్నవాడైనా కృష్ణుణ్ణి ఆశ్రయిస్తారు. వారి భక్తికి మెచ్చి కృష్ణుడు నౌకను ఒడ్డుకు చేరుస్తాడు. నౌకా విహారం శుభప్రదంగా ముగుస్తుంది. స్థూలంగా ఇదీ కథ.

ఈ నృత్య నాటిక త్యాగరాజు అపారమైన ప్రతిభని చూపిస్తుంది. ఇందులో సుమారు 27 రాగాలు వాడారు. మొత్తం అయిదు అంకాలుగా ఈ నృత్య నాటిక నడుస్తుంది. ప్రసిద్ధి చెందిన “ఓడను జరిపే ముచ్చట కనరే”, “ఎవరు మనకు సమానమిలలో”, “ఏ నోము నోచితిమో”, “గంధము పూయరుగా” వంటి కీర్తనలు ఈ నౌకా చరిత్రం లోవే! ఇందులో వాడిన రాగాలూ, కీర్తనలూ అతి రమ్యంగా ఉంటాయి. ఈ నౌకా చరిత్రా రచనలో ఓ విశేషం ఉంది. ఇందులో కీర్తనలు నృత్య నాటికలో భాగంగా మాత్రమే కాదు విడిగా పాడినా కూడా ఏ కృతికాకృతి అర్థాన్నిస్తాయి. ఒక్కొక్కటీ వాటి సాహిత్యమ్మీదా, రాగమ్మీదా నిలబడతాయి. ఉదాహరణకి “గంధము పూయరుగా” కీర్తన విడిగా పాడుకోడానిక్కూడా చక్కగా ఉంటుంది. ఈ నాటికలో ఇంకో విశేషం కూడా ఉంది. మొదటి కీర్తన సురటి రాగంలో ఉంటుంది, చివర మంగళం కూడా ఇదే రాగంలో ఉంటుంది.

ప్రహ్లాద భక్తి విజయం నృత్య నాటిక కూడా గొప్ప సృజనతో రాసిందే! అందులో త్యాగరాజు కొన్ని ప్రయోగాలు చేసాడు. అందులో ఒకటి, అప్పట్లో నాటకాల్లోనైనా, నృత్య నాటికల్లోనైనా మంగళం ఖచ్చితంగా ఘంట, సురటి లేదా పంతువరాళి రాగాల్లోనే ఉండేది. ఇందులో మంగళం సౌరాష్ట్ర రాగంలో ఉంటుంది. ఇందులో వాడిన భాష శిష్టవ్యవహారికం. ఇందులో వాడే ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలో దరువులూ, కందపద్యాలూ, సీసపద్యాలూ, ఇతర ఛందో పద్యాలూ, త్యాగరాజు తెలుగు సాహిత్య జ్ఞానానికి అద్దం పడతాయి. ఉదాహరణకి ప్రహ్లాద భక్తి విజయంలో ఈ కంద పద్యమూ, సీస పద్యమూ చూస్తే, త్యాగరాజుకి తెలుగు చందస్సుపై పట్టు తెలుస్తుంది.

కం: శ్రీ జానకీ మనోహర
రాజీవ భవాది సంధ్య రఘుకుల తిలకా
రాజీవ నయన మునిజన
పూజిత పద రామచంద్ర పుణ్యము చరితా

సీస పద్యం:
స్థితి లయోధృవముల శ్రీహరి వేడ్కగా
గావించి చూచితా గాసి దీర
నీ యందు బవళించి నిర్మలాత్ముడు యోగ
నిద్ర సల్పెను కదా నిత్యముగను

నృత్యనాటికలు ప్రదర్శించారో లేదో ఎక్కడా వివరాలు దొరకలేదు. ప్రదర్శించి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆనందభైరవి రాగం గురించి ప్రచారంలో ఉన్న ఒక కథలో ఆయన నృత్యనాటికలు ప్రదర్శించిన ప్రస్తావన ఉంది. ఎందుకంటే ఆనందభైరవి రాగంలో త్యాగరాజు కేవలం మూడంటే మూడు కీర్తనలు రాసాడు. నృత్యనాటికలకీ, యక్షగానాలకీ ఆనందభైరవి రాగం ప్రాణం. అలాంటిది కేవలం మూడు కీర్తనలతో సరిపెట్టుకున్నాడా త్యాగరాజనిపిస్తుంది. ఉన్న కృతుల సంఖ్య 800 పైగా ఉంది. ప్రతీ రాగంలో కనీసం అయిదారు కృతులైనా ఉన్నాయి. ఒక్క ఆనందభైరవి రాగం తప్ప. దీనికి సంబంధించిన ఓ చిన్న కథ కూడా ఉంది.
త్యాగానంద భైరవి

దక్షిణాదిన కుంభకోణం దగ్గర్లో తిరిభువనం అనే వూళ్ళో స్వామినాధ అయ్యర్ అనే అర్చకుడొకాయనుండే వాడు. ఆయన సంగీత విద్వాసుండు. మంచి నటుడు కూడా. ఆనంద భైరవి రాగంలో మంచి పట్టుందాయనకి. ఓసారి తిరిభువనం స్వామినాధ అయ్యర్ బృందం ఓ యక్షగాన ప్రదర్శన నిమిత్తమై తిరువయ్యార్ వచ్చారు. ప్రతీ రాత్రీ వీళ్ళు యక్షగానం చేసేవారు. జనాలు తండోపతండాలుగా విచ్చేసారు. ఆనోటా ఈనోటా ఈ యక్షగానం సంగతి త్యాగరాజు శిష్యులకి తెలిసింది. ఓ రాత్రి ప్రదర్శన కెళ్ళారు. అందులో ఆనందభైరవి రాగంలో స్వరపరిచిన ఓ పాట (“మధురానగరిలో చల్లలమ్మబోదు” పాట అని అంటారు. ఎంతరకూ ఇది నిజమో ధృవీకరించడం కష్టం) వారినత్తుకుంది. శిష్యుల ద్వారా తిరిభువనం స్వామినాధ అయ్యర్ గురించి త్యాగరాజుకి తెలిసింది. స్వతహాగా నృత్యనాటికలంటే ప్రియం కనుక ఆ యక్షగానం చూడాలనీ, ఆ అనందభైరవి రాగంలో పాట వినాలనీ కుతూహలం కలిగింది త్యాగరాజుకి. ఆ రోజు రాత్రి ప్రదర్శనకి శిష్యులతో బయల్దేరాడు. యక్షగానం జరుగుతోంది. నిజంగా ఆనంద భైరవి రాగంలో పాట విని మంత్రముగ్ధుడయ్యాడు. నాటకం ముగిసాక సంతోషం పట్ట లేక వేదిక వైపుగా వెళ్ళాడు. తోటి సంగీత విద్వాంసుణ్ణి మెచ్చుకొని ఆనందభైరవి రాగం ఇంత గొప్పగా పాడిన స్వామినాధ అయ్యర్ ని సభాముఖంగా అభినందించాడు. త్యాగరాజు మెచ్చుకోవడం అంటే సామాన్యమైన విషయంకాదు. ఆ స్వామినాధ అయ్యర్ ఆనందం పట్టలేకపోయాడు.

త్యాగరాజు వంటి విద్వాంసుడు తనలాంటి వీధి నాటకాలు వేసుకొనే కళాకారుణ్ణి ప్రశంసించడం తన అదృష్టమని చెబుతూ త్యాగరాజుని ఒక వరమడిగాడు. “అయ్యా, మీరు సంగీతంలో మహా విద్వాంసులు. మీ నృత్యనాటిక చూసేకే ఈ అనందభైరవి రాగాన్ని ఈ యక్షగానంలో ఉపయోగించాను. మీవంటి వారు నన్ను ప్రశంసించడం నా అదృష్టం. మీరు నా ప్రదర్శన చూసారనీ, మీరు ఆనందభైరవి రాగం పాటని మెచ్చుకున్నారనీ తరతరాలుగా తెలియాలి. అలా జరగాలంటే మీరు ఆనందభైరవి రాగాన్ని నాకు దానమిచ్చేయండి. కేవలం ఈ ఆనందభైరవి రాగంలో మీరు ఒక్క కీర్తనా కట్టకపోతే సంగీత ప్రియులు అడుగుతారు. అప్పుడు నా యక్షగానం సంగతి తెలుస్తుంది. ఆ రకంగా నేనూ చరిత్రలో మిగిలిపోతాను. దయచేసి ఈ ఒక్క ఆనందభైరవి రాగాన్నీ నాకొదిలేయండని” అడిగాడు. త్యాగరాజు సరే అన్నాడు. అప్పటికే మూడు కృతులు ఆనందభైరవి రాగంలో కట్టాడు. ఆ తరువాత త్యాగరాజు అనందభైరవి జోలికి పోలేదు. “రామ రామ నీ వారము” అనే దివ్యనామ కీర్తనా, “క్షీర సాగర విహార” అనే ఉత్సవ సంప్రదాయ కీర్తనా, “నీకే తెలియక” అనే కృతీ తప్ప ఆనందభైరవిలో త్యాగరాజు రాసిన వేరే కృతుల్లేవు. ఇవి కూడా శిష్యుల ద్వారానే అందరికీ అందుబాటులోకొచ్చాయి. బహుళ ప్రాచుర్యం పొందిన ఈ కథ సాంబమూర్తి ది గ్రేట్ కంపోజర్స్ ( page 164 -166 ) లో ఉంది.
బహు భాషా కోవిదుడు

త్యాగరాజు బహుభాషావేత్త. కేవలం తెలుగు లోనే కాదు. సంస్కృతం, తమిళ, కన్నడ, హిందీ మరియు మరాఠీ భాషల్లో ప్రావీణ్యముందని చెప్పే చాలా సంఘటనలున్నాయి. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆయన శిష్యులు చాలామంది తమిళులే! గోపాలకృష్ణ భారతి, మహారాజ స్వాతి తిరునాళ్ దూత, వడివేలు వచ్చినప్పుడూ తమిళం మాట్లాడినట్లుగా వారి వారి జీవిత చరిత్రల్లో రాసారు. కాశీ నుండి గోపీనాధ భట్టాచార్య అనే ఆయన త్యాగరాజుని అంత్య దశలో సందర్శించినప్పుడు, ఆయనతో హిందీలో మాట్లాడినట్లుగా ఆధారాలున్నాయి. అలాగే శరభోజి రాజు అల్లుడు మోతీరావుతో మరాఠీ సాహిత్య చర్చల్లో పాల్గొన్నట్లుగా రాసారు. ఇవన్నీ చూస్తే, త్యాగరాజుకి మిగతా భాషల్లోవున్న ప్రావీణ్యం తెలుస్తుంది. ఎన్ని భాషలొచ్చినా మాతృ భాష తెలుగుని మాత్రం ఆయన వదల్లేదు. అందులోనే సంగీతాన్ని నింపాడు. అందులోనే జీవించాడు. అందుకే త్యాగరాజు తెలుగువాడుగా పుట్టినందుకు తెలుగువారందరూ గర్వపడాలి.