తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం!

తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనే సదుద్దేశంతో ఈ “తెలుగు వెలుగు "ను మొదలుపెట్టడం జరిగింది. ఆంగ్ల భాష నేర్చుకొనడం లో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా? మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం..! " తెలుగు " ను కొత్త " వెలుగు " లో ప్రపంచానికి చూపిద్దాం!

Monday, December 12, 2011

మనకు తెలియని మన త్యాగరాజు - IV

రాగరత్న మాలిక

ఆ కాలంలో అప్పటి వరకూ పరిచయం లేనీ, ఎవరికీ తెలియని కొన్ని కొత్త రాగాల్లో త్యాగరాజు కృతులు స్వరపరిచాడు. ఆయా రాగాల విస్తృతిని కృతుల్లో చూపించాడు. ఈ రాగాలు అంతకు పూర్వం వున్నట్లుగా సంగీత పరంగా లిఖిత పూర్వకమైన ఆధారాలు లేవు. బహుశా స్వరార్ణవంలో ఉన్న రాగాలననుసరించి ఈ కొత్త రాగాలు ఊహించుండవచ్చుననీ సంగీతకారుల అభిప్రాయం. ఎందుకంటే ఈ రాగాల వివరాలు స్వరార్ణవంలో లేవు. 82 కృతులకు పైగా ఉన్న ఈ రాగాలనే వింత రాగాలు లేదా విచిత్ర రాగాలని అంటారు. ప్రస్తుతమున్న ఈ రాగాలన్నీ శిష్యులు భధ్రపరిస్తేనే లభించాయి. రోజుకో కొత్త రాగంతో కృతులు స్వరపరిస్తే, శిష్యులు నేర్చుకొని పాడేవారు. కొత్తవి స్వరపరిస్తే పాతవి మరింత పాతబడిపోయేవి. అందరు శిష్యులూ ఒకేసారి త్యాగరాజు వద్ద లేరు. అందువల్ల కొన్ని కొంతమందికి తెలిసేవి. మరికొన్ని వేరేవారికి తెలిసాయి. ఇలా ఎందరో శిష్యులు తాళపత్రాలపై పొందుపరచినవే ఇప్పుడున్న కృతులు. ఇప్పుడున్న వాటికంటే ఖచ్చితంగా ఎక్కువ రాగాలనే ఉపయోగించుంటాడని సంగీతజ్ఞుల వాదన.

భార్య కమలాంబ మరణానంతరం త్యాగరాజు నలభై ఏళ్ళు పైగా కేవలం సంగీత సాధనలోనే గడిపాడు. ఆ నలభై ఏళ్ళ జీవితంలోనే ఎన్నో ఒడుదుడుకులు అనుభవించినా, మరిన్ని కృతులు స్వరపరిచుంటాడని, శిష్యుల అశ్రద్ధ వల్ల కూడా కొన్ని కృతులు కనుమరుగయ్యాయని సంగీతకారుల ప్రగాఢ విశ్వాసం. కొన్ని వింత రాగాల పేర్లే చాలామందికి తెలీదు, మరి కొన్ని పేర్లకి సరైన అర్థమే తెలీదు. ఉదాహరణకి ‘జుజాహుళి’ ‘జింగాళ’ లాంటి రాగాల పేర్లు. మిగతా రాగాలు కొన్నింట్లో పేరుని బట్టి రాగం తెలుస్తుంది. అలాగే ఆందోళి, ఆందోళిక అనే రెండు వింత రాగాలున్నాయి. ఆందోళి అంటే స్త్రీ, హంస అనే అర్థం తెలుసు. ఆందోళిక అంటే స్త్రీ లేదా అందలం అనే అర్థముంది. ఇలా ఒక్క అక్షరం తేడాతో రెండు వేర్వేరు రాగాల పేర్లు పెట్టడంలో త్యాగరాజు వుద్దేశ్యం ఏమిటో ఎవరికీ తెలీదు. ఇలా ఎన్నో కొత్త కొత్త రాగాలకి త్యాగరాజు ద్వారా నామకరణం జరిగింది. అలాగే ఓ రాగానికి “కొలాహలం” అనే పేరుంది. ఇలాంటి విభిన్నమైన పేర్లు రాగాలకి వాడడం త్యాగరాజుతోనే మొదలయ్యింది.

ఖరహర ప్రియ రాగంలో ‘మిత్రి భాగ్యమే, సౌమిత్రి భాగ్యమే’ అనే కృతి చరణంలో ‘బాగుగ వింత రాగముల నాలాపము సేయగ మేను పులకరించగ’ అంటూ ఈ వింతరాగాల ప్రస్తావనుంది. ఈ వింతరాగాల్లో చాలావరకూ ఇతర వాగ్గేయకారుల రచనలు లేకపోవడం వల్లా, త్యాగరాజు కాలం ముందు తెలీకపోవడం వల్లా, ఇవన్నీ త్యాగరాజ సృష్టే నని సంగీతకారులు భావిస్తారు. ఉదాహరణకి, హరికాంభోజి జన్యమైన సుపోషిణి రాగమూ (రమించు వారెవరురా), జుజాహుళి రాగమూ (పరాకు జేసిన నీకేమి) వంటివి త్యాగరాజు కృతుల్లో తప్ప ఇంకే వాగ్గేయకారుల రచనల్లోనూ కనిపించవు. అలాగే కోకిల ధ్వనీ, గరుడ ధ్వనీ, విజయ వసంతం వంటి పెక్కు రాగాలు త్యాగరాజు సృజనేనని అందరూ విశ్వసిస్తారు.

ఈ వింత రాగాలన్నీ జన్య రాగాలే. సప్త స్వరాలయిన స, రి, గ, మ, ప, ద, ని రాగం యొక్క ఆరోహణా అవరోహణల్లో ఖచ్చితంగా వున్న రాగాలని మేళ కర్త రాగాలంటారు. వీటి సంఖ్య 72. ఈ మేళ కర్త రాగాలనుండి పుట్టిన రాగాలని జన్య రాగాలంటారు. అంటే ఆరోహణా, అవరోహణల్లో ఒకటీ లేదా రెండు స్వరాలు వర్జితం కావచ్చు, కొన్ని అదనంగా ఉండచ్చు. ఈ జన్య రాగాలకీ అనేక విభజనలున్నాయి. అదంతా సంగీత శాస్త్రంలో చెబుతారు. త్యాగరాజు కృతులు వెలుగు చూసీ, వాటిపై సంగీతకారుల పరిశోధన చేసే వరకూ ఈ వింత రాగాల గురించెవరికీ తెలీదు. త్యాగరాజు శిష్యులక్కూడా ఈ రాగాల జనక రాగాలు తెలిసుండకపోవచ్చని అందరూ భావిస్తారు. త్యాగరాజు తదనంతరం ప్రతీ కృతినీ తీసుకొని వాటి స్వరస్థానాలు బట్టీ, కటపయాది చక్రం (మేళ కర్త రాగాల చట్రం) అనుసరించి వాటి జనకరాగాలు ఇవీ అని నిర్ధారించారు. ఒక్కో సారి ఒకే కృతి రెండు కటకాల్లో వచ్చిన ప్రమాదం కనిపించింది. ఉదాహరణకి ‘రాగ సుధారస పానము’ అనే కృతి ఆందోళిక రాగంలోనూ, మయూరధ్వని రాగం క్రిందా ఉన్న ప్రతులు, 1900 కాలంలో లభించాయి. ఇలా వేర్వేరు రాగాల పేరుతో ఒకే కృతి ఉండడంతో ఏది సరైనదో చెప్పడం కష్టమయ్యింది. ఏది ప్రామాణికంగా తీసుకోవాలా అని సంగీత కారులు చర్చించారు. చివరకి వాలాజపేట వెంకట రమణ భాగవతార్ భద్రపరచినదే సరైనదని నిర్ధారించారు. ఎందుకంటే ఇతనే ఎక్కువ కృతులు భద్రపరిచాడు. అంతే కాకుండా సుమారు 40 ఏళ్ళు పైగా వెంకట రమణ భాగవతార్ త్యాగరాజుతో గడిపాడు. అలా ‘రాగ సుధారస పానము’ కృతి ఆందోళిక రాగం క్రిందే లెక్క కట్టారు.

సంగీతంలో ధాతు, మాతులనే ప్రయోగముంది. ధాతువు అంటే స్వరం. మాతువు అంటే సాహిత్యం. స్వరాలను బట్టీ అవి ఎలా పాడాలో లిఖిత పూర్వకంగా చెప్పే విధానాన్ని ధాతువంటారు. ఉదాహరణకి రాగంలో గమకాలున్న చోట ఒంపుల గీతతో ప్రత్యేకంగా చూపిస్తారు. ఈ పద్ధతినే ధాతు లిఖితాలంటారు. ఘనరాగ పంచరత్న కృతులే కాకుండా వేరే కృతుల్లో చరణాలు వేర్వేరు ధాతువులు కనిపిస్తాయి. శ్రీ రంజని రాగంలో ‘బ్రోచేవారెవరే’, కాంభోజి రాగంలో ‘శ్రీ రఘువర ప్రమేయ’, ఆరభిలో ‘నా మొరలను విని’, మరియు తోడి రాగంలో ‘నిను వినా సుఖము గన’ కృతులు కొన్ని ఉదాహరణలు. వీటిలో ప్రతీ చరణంలోనూ విశేష ధాతు ప్రయోగంతో రాగ విస్తారణ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

ఇంత వరకూ లభ్యమైన త్యాగరాజ కృతుల్ని స్థాయిని బట్టీ, సాహిత్యాన్ని బట్టీ మూడు వర్గాలుగా విభజించారు. అవి దివ్య నామ సంకీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, ఘనరాగ పనచరత్నాలూ. అందులో మొదటి రెండూ, అంటే దివ్యనామ సంకీర్తనలూ, ఉత్సవ సంప్రదాయ కీర్తనలూ త్యాగరాజు ముప్పై ఏళ్ళ లోపులోనే రాసుండచ్చనీ సంగీతకారుల భావన. దివ్యనామ సంకీర్తనల రచనా, సంగీతమూ సరళంగా ఉంటుంది. వాటిల్లో ఒకటీ లేదా రెండూ, మహా అయితే మూడు చరణాలు మించుండవు. తెలుగులోనూ, సంస్కృతంలోనూ ఈ రచనలు కనిపిస్తాయి. దివ్య నామ స్వరూపుడిగా రాముణ్ణి భావిస్తూ స్వర పరిచిన కీర్తనలివి. శంకరాభరణ రాగంలో ‘పాహి రామచంద్ర’, ఆనంద భైరవి లో ‘రామ రామనీ’, బలహంస లో ‘రామ సీతా రామా’ కొన్ని ఉదాహరణలు. సుమారుగా 85 దివ్యనామ కీర్తనలు మనకున్నాయి. అలాగే దాదాపు ఓ పాతిక పైగా ఉత్సవ సంప్రదాయ కీర్తనలున్నాయి. ఈ ఉత్సవ సంప్రదాయ కీర్తనల రచనకి హేతువు ఏటా శ్రీ రామ నవమి కళ్యాణం చేయడం. మధ్యమావతి రాగంలో ‘నగుమోమూ గలవానీ నా మనోహరునీ’, శంకరాభరణంలో ‘సీతా కళ్యాణ వైభోగమే’ వంటివి కొన్ని ఉత్సవ సంప్రదాయకీర్తనలుగా పరిగణిస్తారు.

ఘనరాగ పంచరత్న కీర్తనలు నలభై వయసు దాటిన తరువాతే త్యాగరాజు రచించాడని ఇంతకు ముందు తెలుసుకున్నాం. మధ్య వయస్సులో రాసిన వాటిలో ఎక్కువగా వింత రాగాలే ఉన్నాయి. వీటిల్లో సంగీత విస్తృతి ఎక్కువగా వుంది. సంగతుల ప్రయోగం, మంచి సాహిత్యం కూడా కనిపిస్తుంది. అంత్య దశలో అంటే వయసు అరవై పైబడిన తరువాత చేసిన రచనల్లో మేలైన సంగీతమూ, సున్నితమైన భావ ప్రకటనా కనిపిస్తాయి. బిలహరిలో ‘నా జీవనాధార’, కళ్యాణ వసంతంలో ‘నాద లోలుడై’, కాంభోజి లో ‘ఓ రంగ శాయీ’ వంటివి కొన్ని ఉదాహరణలు. ఈ వర్గీకరణలూ, విభజనలూ అన్నీ 1900 కాలం తరువాత సంగీత కారులు చేసినవి. ఏ కీర్తనెప్పుడు రచించాడన్నది చాలావరకూ ఇదమిథ్థంగా తెలీదు.
ప్రక్షిప్తాలు

ప్రతీ సంగీతకారుడికీ, సాహిత్యకారుడికీ పాడే విధానంలోనయినా, రాసే సరళిలోనైనా వారికి ప్రత్యేకతను తెచ్చే ఒక ఒరవడుంటుంది. అలా పేరొందిన వారి సరళిని అనుసరించి వారి ముద్రతోనే ఉన్న రచనలని ప్రక్షిప్తాలంటారు. రాసింది చదివినా, పాడింది విన్నా మనం తేడా కనిపెట్టలేనంతగా ఉంటాయవి. ఏది మూలమో, ఏది ప్రక్షిప్తమో చెప్పలేనంత దగ్గరగా ఒకే పోలికతో ఉంటాయి. మహాభాగవతం రాసిన పోతనకీ, పద సంకీర్తనలు చేసిన అన్నమయ్యకీ, ఇలా ఎంతో మంది కవులకీ, వాగ్గేయకారులకీ ఈ ప్రక్షిప్తాలు ఉన్నాయి. అన్నమయ్య అయితే ఇలా తన పదాలననుసరించి రాసే వాళ్ళని ‘ఛాయాపహారులంటూ’ ఓ కీర్తన రాసాడు. అలాగే, ఇప్పుడు వాడుకలో త్యాగరాజు పేరు మీదున్న కొన్ని కృతులు ఆయన స్వర పరిచినవీ, రాసినవీ కావు. కానీ త్యాగరాజు పేరుతోనే పదిమంది నోళ్ళలోనూ నానుతున్నాయి. కనకాంగి రాగంలో ‘శ్రీ గణనాథం భజామ్యహం’ అనే కృతొకటుంది. అది త్యాగరాజు ముద్రతోనే ఉంది.

పల్లవి. - శ్రీగణ నాథం భజామ్యహం
శ్రీకరం చింతితార్థ ఫలదం

అనుపల్లవి. - శ్రీగురు గుహాగ్రజం అగ్ర పూజ్యం
శ్రీకంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం (శ్రీ)

చరణం. - రంజిత నాటక రంగ తోషణం
శింజిత వర మణిమయ భూషణం
ఆంజనేయావతారం సు-భాషణం
కుంజర ముఖం త్యాగరాజ పోషణం (శ్రీ)

ఇందులో చరణంలో చివరి పాదంలో త్యాగరాజ ముద్రుంది. కానీ అనుపల్లవి జాగ్రత్తగా గమనిస్తే అందులో ‘గురుగుహ’ అన్న పదం కనిపిస్తుంది. ఈ గురుగుహ అన్నది ముత్తు స్వామి దీక్షితార్ ముద్ర. మిగతా త్యాగరాజు కృతులన్నీ పరికిస్తే ఈ పదం ఒక్క కృతిలోనూ కనబడదు. త్యాగరాజు పేరుతో ఈ కృతి 1940 కాలంలో వాడుకలోకి వచ్చింది. “గురుగుహాగ్రజం, ఆంజనేయావతారం” వంటి విశేషాలను త్యాగరాజు చెప్పినట్లుగా కనబడే ఈ కృతి వాలాజపేట వారు పొందుపరిచిన కృతుల్లో కానీ, వీణ కుప్పయ్యర్ రాసుకున్న ప్రతుల్లోకానీ, మిగతా శిష్యుల దాచుకున్న వాటిలో కానీ ఈ కృతి లేదు. త్యాగరాజు కృతుల్లో ద్వితీయాక్షర ప్రాస గానీ, అంత్య ప్రాస గానీ ఒకే సారి వాడినట్లుగా కనబడదు. ఈ కృతిలో రెండూ ఉన్నాయి. అలాగే మిగతా సంస్కృత రచనల్లో కనిపించనంత గాఢమైన పదజాలం ఈ కృతిలో ఉంది. త్యాగరాజు రాసిన సంస్కృత కృతులు సరళంగానే ఉంటాయి. తోషణం, శింజిత వంటి పదాల వాడుక త్యాగరాజు మిగతా రచనల్లో ఎక్కడా లేదు. కాబట్టి ఇది ప్రక్షిప్తమయి వుంటుంది.

ఈ కృతిలో వాడిన పదాలు ముత్తుస్వామి దీక్షితార్ కృతుల శైలికి దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా భజామ్యహం అన్న పద ప్రయోగం ఈయన రచనల్లోనే కనిపిస్తుంది. త్యాగరాజు కృతుల్లో ఎక్కడా ఇటువంటి పద ప్రయోగం కనిపించలేదు. “ఈ కృతి కర్తృత్వము సందేహాస్పదముగా నున్నది. త్యాగరాజ స్వామి వారు మేళకర్త రాగములన్నిటి యందును కీర్తనలు చెప్పినట్లు నిర్ధారణ జేయుట కొరకు వారి శిష్య పరంపరలో గల కొందరు కొన్ని కీర్తనలకు రాగములు మార్చి పాడుటయూ, కొన్ని రచనలు తాము స్వయముగా చేసి త్యాగరాజ ముద్రాంకితముగా వాడుకలోనికి తెచ్చుటయు జరిగినదని కర్ణా కర్ణిగా తెలియుజున్నది. అట్టి కీర్తనలో ఇది ఒకటి కావచ్చును” అంటూ మంచాల జగన్నాధ రావు ‘త్యాగరాజ కృతులు’ అనే పుస్తకంలో అభిప్రాయ పడ్డారు. వేరే కృతులు ప్రక్షిప్తాలనే అనుమానంగా ప్రొ.సాంబమూర్తి చెప్పినా ఈ కృతి ప్రస్తావన లేదు.

అలాగే హిందోళ రాగం లో ‘సామజ వరగమన’ కృతికూడా ప్రక్షిప్తమేనని కొందరు సంగీతకారుల అభిప్రాయం. కానీ ఆ కృతి ప్రక్షిప్తం కాదని అనడానికే ఎక్కువ ఆధారాలు కనిపిస్తాయి. ఈ కృతిలో వాడిన కొన్ని పదాల వాడుక (ఉదా: ‘వేదశిరో’, ‘సామజ’) మిగతా త్యాగరాజ కృతుల్లోనూ కనిపిస్తాయి. సంగీతానికి మూలమైన సామవేదంలో సప్తస్వరాలూ వున్నాయి. ఈ అర్థంవచ్చే ‘వేదశిరో’, ‘నిగమశిరో’ వంటి పద ప్రయోగం త్యాగరాజ కృతుల్లోనే కనిపిస్తుంది. ఇది త్యాగరాజు కృతి కాదని అన్నారు కానీ, ఎందుకు కాదో, వేరే ఇంకెవరి రచనో ఎవరూ చెప్పలేదు. ఒక మంచి వరసతో వేరెవరయినా ఒక కృతి స్వర పరిచి నిజానికి మేమే వీటి స్వరకర్తలమంటూ ముందుకొచ్చిన అనేకమంది సంగీత కారులున్నారు. కె.వి. శ్రీనివాస అయ్యంగార్ స్వరపరిచిన హరికాంభోజి రాగంలో ‘వినుత సుత వాహనుడై’, సింహేద్ర మధ్యమంలో ‘నీదు చరణములే’ మరియు ‘నతజన పరిపాల’ వంటివి త్యాగరాజు కృతులేనన్న భావన చాలామందిలో వుంది. నీదు చరణములే కృతిలో త్యాగరాజు తన కృతుల్లో వాడిన ప్రాస కనిపించదు.

పైన చెప్పినవే కాకుండా, సురటి రాగంలో ‘పరాముఖమేలరా’, వివర్ధినిలో ‘అభిమానమెన్నడు’ కృతులు ఎం. రాజగోపాల అయ్యర్ కృతులనీ సాంబమూర్తి గారు 1950 లో ‘ది హిందూ’ దినపత్రిక సంగీత వ్యాసాల్లో వివరించారు. అలాగే తోడి రాగంలో ఉన్న ‘వెడలెను కోదండపాణి’ త్యాగరాజ కృతిగా చాలా ప్రాచుర్యం పొందింది. నిజానికది తంజావూరు కృష్ణభాగవతార్ రచన. ఆయన రాసిన రామాయణంలో వాడిన కృతది. ఈ కృతి రాగమూ, వరుసా ఒకాయనకి నచ్చీ, సాహిత్యాన్ని అటూ ఇటుగా మార్చి, త్యాగరాజ ముద్ర తగిలించి పాడడం మొదలెట్టాడు. ఈ విషయం తెలిసిన కృష్ణ భాగవతార్ ఆ సంగీతకారుడిపై మండిపడి తప్పుని సరిదిద్దాడని సాంబమూర్తి గారు చెప్పారు. ఈ కృతి వరుస ‘బృందావన లోల గోవిందారవింద’ కి అతి దగ్గరగా ఉంటుంది.

‘త్యాగరాజ సంగీతము - వివాదములు’ అన్న వ్యాసంలో వింజమూరి వెంకట నరశింహాచార్యులు సావేరి రాగంలోని ‘రామ బాణ త్రాణ శౌర్య-(మే)మని దెలుపుదురా ఓ మనసా’ కృతి వివాదం గురించి ప్రస్తావించారు. సావేరి రాగం ప్రధానంగా కరుణ, శోకరసాలు పలికించడానికి వాడే రాగం. అలాంటిది సావేరి రాగంలో ‘రామ బాణ త్రాణ’ అంటూ వీరరసం చొప్పించడం ఎంతవరకూ సమంజసం అన్నదా వివాదం. ఒకటే స్వరంతో దాని గమకమూ, ఛాయ మారిస్తే వేర్వేరు బేధభావములు పుట్టించ వచ్చనీ వింజమూరి వారి వాదన.

అలాగే త్యాగరాజు కొన్ని మేళ కర్త రాగాలు పేర్లు మార్చినట్లుగా కూడా కాస్త వివాదముంది. వేంకటమఖి అనే ఆయన మేళ కర్త రాగాలు 72గా విభజించాడు. ఈ పద్ధతినే ప్రస్తుతం అందరూ వాడుతున్నారు. కానీ త్యాగరాజు వాడిన సంగీతంలో రాగ పద్ధతికీ, వేంకటమఖి రాగాల పద్ధతికీ కొన్ని రాగాల్లో తేడా వుంది. మేళకర్త రాగాలయిన ‘కనకాంగి’, ‘రత్నాంగీ’ రాగాలు వేంకట మఖి పద్ధతి ప్రకారం ‘కనకాంబరి’, ‘రత్నాంబరీ’. కానీ త్యాగరాజు వీటిని ‘కనకాంగీ’, రత్నాంగీ’ అనే వాడాడు. ఇది సరికాదని కొందరి సంగీతజ్ఞుల అభిప్రాయం.

మరో వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితార్ ‘కనకాంబరి’ రాగంలో ‘కనకాంబరి కారుణ్యామృత లహరి -కామాక్షి మామవ కామేశ్వరి’ అన్న కృతినీ స్వరపరిచాడు. ఈయన మాత్రం వేంకటమఖి పద్ధతినే అనుసరించాడనీ, త్యాగరాజు దీనికి భిన్నమైన పద్ధతవలంబించాడనీ కొంతమంది అభిప్రాయపడ్డారు. తన వ్యాసంలో వింజమూరి వెంకట నరశింహాచార్యులు పైన చెప్పిన దానికి కొంత వివరణ ఇచ్చారు. సంగ్రహ చూడామణీ అనే గ్రంధంలో ఈ కనకాంగి, రత్నాంగి రాగాలూ, వాటి జన్యాలూ ఉన్నాయని, అలాగే ‘భరత సంగ్రహము’ లో కూడా ఈ పేర్లే వున్నాయనీ అన్నారు. వేంకటమఖి పద్ధతి వీటి తరువాత వచ్చిందని అన్నారు. వాలాజపేట వెంకట రమణ భాగవతార్ పొందుపరిచిన వాటిల్లో మాత్రం కనకాంగీ, రత్నాంగీ పేర్లతోనే కృతులున్నాయి. ప్రస్తుతం ఇలాగే వాడుతున్నాము. పేర్లు వేరుగా కనిపించినా కనకాంబరీ, కనకాంగీ రెండూ ఒకటే. అలాగే రత్నాంబరీ, రత్నాంగీ కూడా.

తోడి రాగంలో ‘ఎందు దాగినాడో’ అన్న కృతుంది. అందులో రాముడి విగ్రహాలు పోయాయన్న విచారమూ, బాధా కనిపిస్తాయి. అలాగే ‘వెడలెను కోదండపాణి’ లో సంతోష భావం కనిపిస్తుంది. ఒకే రాగంలో రెండు విభిన్నమైన భావాలు పలికించడం శాస్త్రీయమేనా అన్న వివాదమొచ్చింది. శాస్త్రీయమే అని సంగీతజ్ఞులు నిర్ధారించినా, నిజానికి ‘వెడలెను కోదండపాణీ’ కృతి త్యాగరాజుది కాదు.

కొన్ని కృతులయితే ప్రస్తుతం పాడే రాగాల్లో త్యాగరాజు స్వరపరచలేదు. ఉదాహరణకి ‘మీవల్ల గుణదోష’ కృతి హిందూస్తానీ కాపీ రాగంలో కొంతమంది పాడుతారు. త్యాగరాజు కర్ణాటక కాపీ రాగంలో స్వరపరిచాడు. ప్రస్తుతం వాడుకలో పూర్వి కళ్యాణి రాగంలో పాడే ‘జ్ఞ్ఞాన మొసగరాదా’ కృతిని త్యాగరాజు ‘షడ్విధ మార్గిణి’ రాగంలో స్వరపరిచాడు. కానీ అనేక పుస్తకాల్లో, మంచాళ జగన్నాధ రావు ‘త్యాగరాజ కీర్తన’ల పుస్తకంతో సహా, పూర్వి కళ్యాణి రాగంలోనే అని ఉంది. ఈ రాగంలోనే చాలామంది పాడుతారు. ఈ కృతిలో ధాతువులు సరిగ్గా తెలీనందు వల్ల చాలామంది పూర్వికళ్యాణిగా పొరబడ్డారు. ఈ కారణాల వల్ల సాహిత్యం త్యాగరాజుదే అయినా, రాగ స్వరం మాత్రం ఆయనది కాదు. కళ్యాణి రాగంలో ఉన్న ‘సుందరి నీ దివ్య రూపమును’, ‘వాసుదేవయని’ మరియు ధన్యాసి రాగంలో వున్న ‘సంగీత జ్ఞానమూ’ కృతుల్లో కొన్ని చరణాలు త్యాగరాజ స్వర రచన కాదన్న అనుమానం కొంతమంది సంగీత కారులకుంది. సాహిత్యంలో ప్రక్షిప్తాలు రచన వరకే పరిమితం. కానీ సంగీత రచనలలా కాదు. సాహిత్యమూ, సంగీతమూ రెండూ, పూర్తిగా కానీ, కొంతభాగం కానీ ప్రక్షిప్తాలు అయ్యే అవకాశముంది.
వైణిక విద్వత్తు

త్యాగరాజు అమ్మ తరపు తాత వీణ కాళ హస్తయ్య పేరొందిన వైణికుడు. వీణ వాయిద్యమే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. అలాగే త్యాగరాజు తల్లి వైణికురాలు. అందువల్ల త్యాగరాజుకి సహజంగా వీణా వాదనం వచ్చింది. చిన్నపటినుండీ గాత్రమే కాకుండా, వీణా వాదన కూడా నేర్చుకున్నాడు. త్యాగరాజు అద్భుతంగా వీణ వాయించే వాడనీ కృష్ణ భాగవతార్ రాసిన జీవిత చరిత్రలో ఉంది. కాకపోతే త్యాగరాజు కంఠస్వరం మధురంగా ఉండడంవల్ల ఆయన గాత్రానికే పెద్ద పేరొచ్చింది. త్యాగరాజు ప్రతీ దినమూ రాముణ్ణి పూజించాక చివరగా వీణ వాయించి పూజ ముగించే వాడనీ ఆయన జీవిత చరిత్ర రాసిన కొంతమంది చెప్పారు. త్యాగరాజు వీణ కచేరీ ఇచ్చినట్లుగా సి.తిరుమలయ్య నాయుడు రాసారు కానీ, ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో ఇచ్చారో చెప్పలేదు.

త్యాగరాజు ముఖ్య శిష్యుల్లో ఒకడైన వీణ కుప్పయ్యర్ కూడా వైణిక విద్వాంసుడే! అసలు ఈ వీణకుప్పయ్యర్ త్యాగరాజు వద్దకి వీణా వాదనం నేర్చుకుందామన్న ఉద్దేశ్యంతో తిరువయ్యారు వచ్చాడు. త్యాగరాజు గాత్ర సంగీతం తప్ప వీణ నేర్పడని తెలిసినందువల్ల తనూ వైణికుడేనన్న విషయాన్ని దాచిపెట్టి అందరిలాగే గాత్రం నేర్చుకునేవాడు. ప్రతీ రోజూ శిష్యులకి పాఠం చెప్పేటప్పుడు త్యాగరాజు రాగంలో మెలకువలు వీణ మీద వాయించి చూపించేవాడు. త్యాగరాజు వీణా వాదనకి మంత్రముగ్ధుడయిన కుప్పయ్యర్ ఎలాగైనా గురువు గారి వీణనొకసారి వాయించాలనుకున్నాడు. ఓ సారి త్యాగరాజు పని మీద వేరే వూరెళ్ళిన సందర్భంలో ఎవరూ లేకుండా చూసి త్యాగరాజు వీణ తీసుకొని వాయించడం మొదలు పెట్టాడు. వీణా వాదన విని కమలాంబ త్యాగరాజేమో ననుకొని వాకిట్లోకొచ్చి అతని వాయిద్యానికి తన్మయత్వం చెంది అక్కడే కూర్చొని విన సాగింది. ఈలోగా త్యాగరాజు వస్తూనే వీణా వాదనం విని కుప్పయ్యర్‌ని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత త్యాగరాజు వద్ద వీణలో కూడా మెలకువలు నేర్చుకున్నాడనీ కుప్పయ్యరే స్వయంగా పై కథని రాసుకున్నాడనీ సాంబమూర్తొక్కరే చెప్పారు. ఈ వివరం సుందరేశ శర్మ ‘త్యాగరాజ చరిత్రం’ లో కానీ, ఎస్. రామ స్వామి అయ్యర్ ‘ద సైంట్ త్యాగరాజ’ లో కానీ ఎక్కడా లేదు.

అనేక త్యాగరాజ కృతుల్లో వీణ ప్రస్తావనుంది. సారమతి రాగంలో ‘మోక్షము గలదా’ కృతిలో శివుణ్ణి వీణా వాదన లోలుడిగా అభివర్ణించాడు. స్వతహాగా వైణికుడైనా, త్యాగరాజుకి అత్యంత ప్రీతి పాత్రమైన వాయిద్యం ‘మృదంగం’. తంజావూరు రామారావుకి మృదంగం వచ్చు. అతనే చాలా సార్లు త్యాగరాజుకి వాయిద్య సహకారం ఇచ్చేవాడు. ఈ వాయిద్య సహకారమెప్పుడూ సంగీతకారుడి వెనుకే ఉండాలి తప్ప అతని పాటపై ఆధిపత్యం చెలాయించేలా ఉండకూడదనీ త్యాగరాజు పలుమార్లు తన శిష్యుల్ని హెచ్చరించేవాడనీ రాసారు. శ్రీరంజని రాగంలో ‘సొగసుగా మృదంగ తాళము’ కృతి ఈ భావాన్నే తెలియజేస్తుందని భావించవచ్చు.

పల్లవి. - సొగసుగా మృదంగ తాళము జత గూర్చి నిను
సొక్క జేయు ధీరుడెవ్వడో

అనుపల్లవి. - నిగమ శిరోర్థము గల్గిన
నిజ వాక్కులతో స్వర శుద్ధముతో (సొ)

చరణం. - యతి విశ్రమ సద్భక్తి
విరతి ద్రాక్షా రస నవ-రస
యుత కృతిచే భజియించు
యుక్తి త్యాగరాజుని తరమా శ్రీరామ (సొ)

నౌకా చరిత్రంలో రాసిన కృతుల్లో వేణువు ప్రస్తావనుంది. ఇవి కాకుండా తంబూర వాదనానికీ త్యాగరాజు చాలా ప్రాముఖ్యతిచ్చాడు. తోడి రాగంలో ‘కద్దనవారికి’ కృతిలో తంబుర ప్రస్తావనుంది. తోడి రాగంలోనే చేసిన ‘కొలువమరె కదా’ మరో కృతి మొదటి చరణంలో తంబుర గురించుంది.

వేకువ జామున వెలయుచు తంబుర
చేకొని గుణముల చెలువొంద పాడుచు
శ్రీకరునికాశ్రిత చింతామణునికి
ఆకలి తీర పాలారగింపను జేసే

కేవలం గాత్ర సంగీతమే కాకుండా వాయిద్య సంగీతం ప్రాముఖ్యత కూడా త్యాగరాజుకి తెలుసు. షట్కల గోవింద మరార్ అనే విద్వాంసుడొచ్చినప్పుడు త్యాగరాజు ఆయన తంబూరాని వాయించాడు. గోవింద మరార్ త్యాగరాజు సంగీత జ్ఞానాన్ని మెచ్చుకొని, ఆయన వాయించే తంబూర కానుకగా ఇచ్చాడు. ఇది మదురై సౌరాష్ట్ర సభలో భద్రపరిచారు.
గురుకులం

సంగీతం నేర్పమని తన వద్దకొచ్చిన వారినెవరినీ త్యాగరాజు తిరిగి వెనక్కి పంపలేదు. వారి వారి స్థాయిని బట్టి, వారి స్వరజ్ఞానం పరీక్షించి వారికి తగిన కృతులు నేర్పేవాడు. ముందుగా దివ్యనామ సంకీర్తనలు, తరవాత ఈశామనోహరి రాగంలో ‘శ్రీ జానకీ మనోహరా’ కృతినే చెప్పేవాడు. ఈ సంప్రదాయాన్నే ఉమైయాల్పురం శిష్యగణం అనుసరిస్తూ వారి వారి శిష్యులకి సంగీత బోధన చేస్తారు.

ఆ రోజుల్లో తిరువారూరు, తంజావూరు, తిరువయ్యారు, తిల్లయిస్థానం వూళ్ళు సంగీత ప్రథాన కేంద్రాలుగా ఉండేవి. ఈ ఊళ్ళాన్నీ తంజావూరుకి ఇరవై కిలోమీటర్ల మించి దూరం లేవు. అయినా ఒక్కో ఊరులో ఒక్కో విధంగా సంగీతశిక్షణ వుండేది. ఒక్కొక్కళ్ళూ ఒక్కో పద్ధతి పాటించేవారు. త్యాగరాజుకి దాదాపు పాతికమంది పైగా శిష్యులున్నారు. అందులో ఎక్కువ కాలం నేర్చుకున్నది వీణ కుప్పయ్యర్, తంజావూరు రామారావు, మంచంబువాది వెంకట సుబ్బయ్యర్ మరియి వాలజపేట వెంకట రమణభాగవతార్లే నని ఇంతకుముందు తెలుసుకున్నాము. వీరు తరువాత పాటించిన సంగీత సంప్రదాయం వేరయినా త్యాగరాజు పద్ధతి ప్రకారమే నేర్చుకున్నారు. వారి వారి మూల సంగీత గురుకులాల్ని బట్టి త్యాగరాజు శిష్యగణాన్ని మూడు గుంపులుగా చెబుతారు. అవి వాలజపేట శిష్యులు, తిల్లయైస్థానం శిష్యులూ మరియు ఉమైయాల్పురం శిష్యులూ.

వాలాజ పేట శిష్యులు: వీరిలో ముఖ్యుడు వెంకట రమణ భాగవతార్. ఇతనిది అయ్యంపేట. త్యాగరాజు భజనలని తంజావూరులో విన్నాడు. త్యాగరాజు వద్దకెళ్ళి సంగీతం నేర్పమన్నాడు. కానీ ఇతని స్వరజ్ఞానం అంత సరిగా అనిపించక మరింత సాధన చేసి వెంకట రమణ భాగవతార్ని రమ్మన్నాడు. ఇతడు త్యాగరాజుకి ప్రతీ రోజూ ఉదయం పూజకి తులసీ దళాలు తెచ్చిచ్చేవాడు. రోజూ ఈ తులసి తెచ్చేది వెంకట రమణ భాగవతారన్న విషయం త్యాగరాజుకి తెలీదు. ఓ సారి సుస్తీ చేసి వెంకట రమణ భాగవతార్ రాలేదు. ఆరోజు పూజకి తులసీ దళాలు లేవేమిటని మిగతా శిష్యుల్నడిగితే వారు వెంకట రమణ భాగవతార్ గురించి చెప్పారు. అది విని, వెంకట రమణ భాగవతార్ శ్రద్ధా, భక్తీ చూసి త్యాగారాజు అతన్ని తన శిష్యుడిగా చేసుకున్నాడు. ఈ వెంకట రమణ భాగవతారే ఎన్నో కృతులు పొందుపరిచాడు. ప్రతీ రోజు ఉదయమూ దివ్యనామ సంకీర్తనలతో పూజ ప్రారంభించడం వాలాజ పేట శిష్యుల ఆనవాయితీ.

ఉమైయాల్పురం శిష్యులు: వీరిలో కృష్ణ భాగవతార్, సుందర భాగవతార్ ముఖ్యులు. ఇద్దరూ అన్నదమ్ములు. వీళ్ళు త్యాగరాజు చివరి దశలో శిష్యులుగా వచ్చారు. వీరు త్యాగరాజు శిష్యులుగా మారడానికి కారణం, వీరి అన్నగారు వేణూ భాగవతార్. ఈయన త్యాగరాజు వద్ద ఆరు నెలలపాటు రామాయణ గ్రంధ పఠనం చేసాడు. అది మెచ్చి త్యాగరాజు తాను తిరిగి ఏమైనా ఇవ్వగలడా అని అతన్ని అడిగితే తన తమ్ముళ్ళకి సంగీత నేర్పమని కోరాడు. ఆ విధంగా ఇద్దరూ త్యాగరాజు శిష్యులయ్యారు. అతి తక్కువకాలంలో ఎన్నో నేర్చుకున్నారు. త్యాగరాజు అంత్య దశలో వీరు దాదాపు పదేళ్ళు అక్కడే ఉండడం వల్ల వీరికి వాలాజ పేట వారికి దొరకని కొన్ని కొత్త కృతులు లభించాయి.

తిల్లయిస్థానం శిష్యులు: వీరిలో రామ అయ్యంగార్, తిల్లయిస్థానం పంజు భాగవతార్, నరసింహ భాగవతార్ మరియు శొజిరి సీతారామయ్య ముఖ్యులు. రామ అయ్యంగార్ త్యాగరాజ కృతుల్ని తంజావూరు పరిసరాల్లో బాగా ప్రచారం చేసాడు. ఇతను ట్రావెన్‌కోర్ స్వాతి తిరునాళ్ మహారాజు కొలువులో కచేరీ ఇచ్చాడు. ఈయన ద్వారానే త్యాగరాజు కృతి వైభవం స్వాతి తిరునాళ్‌కి తెలిసింది. అతని కొలువులోనే ఉన్న వడివేలు అన్న విద్వాంసుడికి ఈ రామ అయ్యనగార్ త్యాగరాజు కృతులు నేర్పాడు.’ఎందు దాగినాడో’ కృతిలో ప్రస్తుతం వాడుకలో వున్న ఒక చిట్ట స్వరం రాసింది ఈయనే. ఈ చిట్టస్వరం అనే ప్రక్రియని త్యాగరాజు అంతగా మెచ్చలేదు. త్యాగరాజు కృతుల్లో ఇప్పుడున్న చిట్టస్వరాలు ఆయన తదనంతరం వారి శిష్యులు తగిలించినవే.
వీరూ ఉన్నారు

పై మూడు శిష్య గణాలూ కాక, త్యాగరాజుకి మరికొంత మంది శిష్యులున్నారు. వారిలో అయ్య భాగవతార్, నంగవరం నీలకంఠ అయ్యర్, కుంభకోణం అరవముద అయ్యంగార్, సుబ్బరామ భాగవతార్, లాల్గుడి రామయ్యర్, గణేశయ్య, కంజీర రాధ కృష్ణ అయ్యర్ (చిత్తూరు), అమృతలింగం పిళ్ళై, సేవున వెంకటచలపతి భాగవతార్ మరియు వాలజపేట పొట్టి జోశయ్యర్ కూడా ఉన్నారు. వీరే కాక త్యాగరాజు మనవడు పంచపకేశయ్య కూడా త్యాగరాజు వద్ద శిష్యరికం జేసాడు. ఇతనికి గురువమ్మాళ్ అనే ఆమెనిచ్చి త్యాగరాజే దగ్గరుండి పెళ్ళి జేయించాడు. దురదృష్ట వశాత్తూ ఇతని 35వ ఏటే చనిపోయాడు. అదీ త్యాగరాజు మరణానికి మూడేళ్ళ ముందు. ఇతనితో త్యాగరాజు రక్త సంబంధీకులు అంతమయ్యారు. ఇతని భార్య మాత్రం చాలా కాలం, అంటే 1910 వరకూ బ్రతికింది. (ప్రస్తుతం తిరువయ్యారులో తిరుమంజన వీధిలో ఉన్న త్యాగరాజు ఇంటిని ఆమె 1907 సంవత్సరంలో అమ్మేసింది. ఆ తరువాత కొంతమంది త్యాగరాజు భక్తులు దీన్ని తిరిగి కొనుక్కున్నారు).

తూము నరసింహం: రాజా తూము నరసింహం 1790 ప్రాంతాలలో గుంటూరులో జన్మించాడు. ఇతని తల్లి తండ్రులు అచ్చయ మంత్రి, వెంకమ్మ. ఇతను రామ భక్తుడు. రాముడి మీద నరసింహదాసు, తూము నరసింహదాసు వంటి ముద్రలతో ఎన్నో కీర్తనలు రాసి, స్వర పరిచాడు. ఇవన్నీ భజన పాటలు కావడం వల్ల చాల మంది భజనల్లోనే పాడేవారు. ఇతడు తన ఆరాధ్య దైవం భద్రాచల రామదాసు పైనే రచనలు చేసాడు. రామదాసు కీర్తనగా ఎంతో ప్రచారం పొందిన వరాళి రాగంలో ‘అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి’ నిజానికి ఇతని రచనే!

ఇతనికి భద్రాచల రాముడు కలలో కనిపించి భద్రాచలం రమ్మనమని చెబితే ఆయన రాముణ్ణి సందర్శించుకున్నాడనీ స్వయంగా రాసుకున్నాడు. ఆ తరువాత రామేశ్వరం, శ్రీరంగం వంటి క్షేత్రాలు కూడా దర్శించాలని తలచి దక్షిణాది యాత్రలు ప్రారంభించాడు. అలా యాత్ర చేసుకుంటూ తంజావూరు దర్బారులో మోతీరావు సమక్షంలో రామ భజన పాటలు పాడాడు. అతని ద్వారా త్యాగరాజు గురించి విని తిరువయ్యారు వెళ్ళాడు. త్యాగరాజు భక్తినీ, సంగీత ప్రతిభనీ చూసి సుమారు మూడు నెలలు త్యాగరాజు ఇంట్లోనే ఉండిపోయాడు. త్యాగరాజుపై కొన్ని సీస పద్యాలు, తేటగీతులూ కట్టాడు.

కేవలానంద సంకీర్తనావళి వింటి
భావ సిద్ధియు శుద్ధ భక్తి గంటి
భక్తులు, శిష్యులు బలసి కొల్వగ గంటి
వాంగ్మాధురీ వైభవంబు గంటి
వినయసత్సంపద్వివేకమున్ కనుగొంటి
శ్రీ రామ పదభక్తి చెల్వుగంటి
యజునకందగరాని యనుభవంబును గంటి
ధన్మయత్వం బాత్మదనరగంటి

నరసి కనుగొంటి త్యాగరాయార్యునందు
నీల సద్గుణ పుంజమిం కెన్ని యైన
దివ్య మహిమాతిశయములు దేజరిలుట
గంటి హర్షాబ్ధి నోలాడుచుంటి మదిని

తే. రామ పదభక్తికీ త్యాగరాయపరుని
సమముగా నేర రెవ్వరేక్ష్మాతలమున
బ్రేమనాఘను డొకసారి పిలిచినేని
రాముడో హో యటంచు మార్పలుకునంట

ఈ సీస పద్యం మంచాల జగన్నాధ రావు రాసిన వ్యాసంలో ఉంది. ఈ తూము నరసింహదాసు త్యాగరాజుని సందర్శించిన కాలం సుమారుగా 1821 లోనని తంజావూరు చరిత్రలో లిఖిత పూర్వకంగా ఉంది. ఈతని ప్రస్తావన త్యాగరాజు జీవిత చరిత్ర రాసినందరి రచనల్లోనూ వుంది. కానీ ఎం. ఎస్. రామస్వమి అయ్యర్ రాసిన పుస్తకంలో రాసినవి కొన్ని అసంబద్ధంగా ఉన్నాయి. అందులో, నరసింహ దాసు కుటుంబం త్యాగరాజు ఇంట్లో బస చేసినప్పుడు త్యాగరాజు భార్య కమలాంబ వారికి ఎంతో ఆదరాభిమానాలతో ఆతిధ్య మిచ్చిందని రాసారు. ఇది సరి కాదు. అప్పటికే త్యాగరాజు భార్య చనిపోయి పదేళ్ళు దాటింది. బాలాంత్రపు రజనీ కాంతరావు గారి ‘ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర’ లో ఈ తూము నరసింహదాసు గురించీ, ఆయన త్యాగరాజుని కలిసిన సందర్భమూ రాసారు. ‘తూము నరసింహ దాసు కథ’ అన్న పేరుతో ఆంధ్ర దేశంలో హరికథొకటి ప్రాచుర్యంలో ఉండేది. ఆ కథలోనూ త్యాగరాజ వైభవం గురించుంది.

జావళీ కమలం: అప్పట్లో మువ్వనల్లూరు సభాపతి అయ్యర్ అనే ఆయనకి తంజావూరు పరిసర ప్రాంతాల్లో మంచి పేరుంది ఈ సభాపతి అయ్యర్ ‘రాజగోపాల’ అనే ముద్రతో పదాలు రాసాడు. ఈయన త్యాగరాజు రాసిన నౌకా చరిత్రం ప్రదర్శించాలని ప్రయత్నం చేసినా అది కుదరలేదు. ఈయన దగ్గర కమలం అనే నర్తకి నాట్యం నేర్చుకోడానికి చేరింది. ఈమె తంజావూరు రాజనర్తకిగా కావడానికెన్నో ప్రయత్నాలు చేసింది. ఎవరో త్యాగరాజు ఆశీస్సులు పొందమని సలహా ఇచ్చారు. ఈమె తిరువయ్యారు ప్రయాణం కట్టింది. త్యాగరాజుకి ఎదుట పడే ధైర్యం చాలక రామ అయ్యంగార్ అనే త్యాగరాజు శిష్యుణ్ణి సంప్రదించింది. ఓ రోజు త్యాగరాజు పాదాలపై బడి తాను సభాపతి శిష్యురాలనీ, త్యాగరాజు ఆశీస్సులకోసం వచ్చాననీ చెప్పింది. తరవాత త్యాగరాజు స్వర పరిచిన కృతి ‘ఎందు దాగినాడో’ కృతికి రాముని విగ్రహాలు వెతికేటప్పుడు పడ్డ బాధని ఎంతో హృద్యంగా అభినయించి త్యాగరాజు మెప్పు పొందింది. ఆ తరువాత ఇదే కృతిని తంజావూరు దర్బారు హాలులో త్యాగరాజు అభిమాని మోతీరావు ఎదుట ప్రదర్శించింది. ఆయన కృతికి కమలం అభినయం చూసి ఆమెను ఆస్థాన నర్తకి గా నియమించాడు. చిత్రం ఏంటంటే ఈ కమలం మరల త్యాగరాజుని సందర్శించలేదు. కానీ ముత్తుస్వామి దీక్షితార్ కి శిష్యురాలిగా మారింది. ఆయన వద్ద తిరువారూర్లో చాలా కాలం సంగీతం నేర్చుకుంది.

ఈ కమలం ప్రస్తావన ముత్తు స్వామి దీక్షితార్ జీవిత చరిత్రలోనూ వస్తుంది. ఈ కమలం కథ సాంబమూర్తొక్కరే వివరంగా రాసారు. కాకపోతే ఆయన కమలం రాజనర్తకి కావడానికి ముందు త్యాగరాజుని సందర్శించిన విషయం రాయలేదు కానీ ఆ తరువాత ఆమెకి ఎంతో పేరొచ్చిందని మాత్రం రాసారు. అలాగే మోతీరావు ముందు నాట్య ప్రదర్శన సంగతీ రాయలేదు. ఈ వివరాలు హిందూ దిన పత్రికలో సంగీతంపై వచ్చిన వ్యాసాల్లో దొరికింది. అలాగే ముత్తుస్వామి దీక్షితార్ జీవిత చరిత్ర రాసిన ప్రతివారూ ఈ కమలం గురించి రాసారు. చిత్రంగా వాళ్ళెవ్వరూ త్యాగరాజుని దర్శించిందన్న విషయం రాయలేదు.

వడివేలు, స్వాతి తిరునాళ్: త్యాగరాజు ముఖ్య శిష్యుడైన కన్నయ్య భాగవతార్ ఊరూరా సంగీత కచేరీలు చేస్తూ త్యాగరాజు కృతులు పదిమందికీ తెలిసేలా చేసేవాడు. ట్రావెన్‌కోర్లో అతని కచేరీని ట్రావెన్‌కోర్ మహారాజు స్వాతి తిరునాళ్ ఆస్థానంలో వడివేలు అనే విద్వాంసుడు విన్నాడు. ఈ వడివేలుకి గాత్రంలోనే కాక వయొలిన్‌లో కూడా ప్రవేశం ఉంది. కన్నయ్య భాగవతార్, అలా తన సమక్షంలో చేసిన కచేరీలో స్వాతి తిరునాళ్ త్యాగరాజు కృతుల్లో సంగతుల ప్రయోగం చూసి మురిసిపోయాడు. ఎలాగైనా త్యాగరాజు ని తన ఆస్థాన విద్వాంసుడిగా చేసుకుందామనుకున్నాడు. తన దూతగా వడివేలుని తిరువయ్యారు పంపాడు. అప్పటికే అతని ఆస్థానంలో గోవింద మారార్, శివానంద, పొన్నయ్య, చిన్నయ్య, ఇరవి వర్మన్ తంబి, క్షీరాబ్ది శాస్త్రి, పరమేశ్వర భాగవతార్, మేరుస్వామి వంటి ప్రముఖ సంగీత విద్వాంసులున్నారు. కన్నయ్య భాగవతార్ అప్పటికే శరభోజి రాజు ఆహ్వాన తిరస్కారం వడివేలు కి చెప్పాడు. ఇది తెలిసి వడివేలు తన ప్రయత్నం విరమించుకుందా మనుకున్నాడు. కానీ మహారాజుకి తన నిర్ణయాన్ని చెప్పే ధైర్యం లేక తిరువయ్యారు బయల్దేరాడు.

వెళ్ళేముందు కన్నయ్య భాగవతార్ వీణ కుప్పయ్యర్ ని కలవమనీ, అతను త్యాగరాజుని కలిసేలా చేస్తాడనీ చెప్పాడు. వడివేలు వీణకుప్పయ్యర్ని కలిసినా త్యాగరాజుని కలవలేదు. త్యాగరాజుండే తిరుమంజన వీధి చివర ఓ ఇంట్లో బస చేసాడు. రోజూ ఉదయమూ, సాయంత్రమూ త్యాగరాజు ఆ ఇంటి మీదుగా కావేరీ నదీ స్నానానికి వెళ్ళే సమయం చూసుకొని వడివేలు సంగీత సాధన చేసేవాడు. అతనికి మంచి గొంతుంది. అపారమైన సంగీత జ్ఞానముంది. వడివేలు గాత్ర మాధుర్యాన్ని మెచ్చుకుంటూ తన ఇంటికొచ్చి పాడమని త్యాగరాజు అడిగాడు. ఆ మర్నాడు త్యాగరాజు సమక్షంలో తన సంగీత విద్వత్తునంతా ప్రదర్శించాడు. ఆ సమయంలోనే తను వచ్చిన వైనం చెప్పాడు వడివేలు. తను తప్పకుండా స్వాతి తిరునాళ్ ని తమ ఇద్దరి ఆరాధ్య దైవం సమక్షంలోనే కలుస్తానని త్యాగరాజు జవాబిచ్చాడు. స్వాతి తిరునాళ్ స్వయంగా వెళ్ళి త్యాగరాజుని కలుద్దామనుకున్నాడు. కానీ అప్పటి రాజకీయ పరిస్థితి దృష్ట్యా మానుకోవాల్సి వచ్చింది. అప్పటికే టిప్పు సుల్తాన్, బ్రిటీషు వారి మధ్య యుద్ధాలతో ఆ ప్రాంతాలు అల్లకల్లోలంగా తయారయ్యాయి. స్వాతి తిరునాళ్ ట్రావెన్‌కోర్ విడిచి వెళ్ళే సాహసం చేయలేకపోయాడు. ఆ విధంగా త్యాగరాజుని కలవలేకపోయాడు. చిత్రం ఏంటంటే అతి పిన్న వయసులో త్యాగరాజుకంటే ముందే అనారోగ్యంతో స్వాతి తిరునాళ్ మరణించాడు.

ఈ వడివేలు తిరువయ్యారు వెళ్ళిన కాలం 1829 ప్రాంతాల్లోనని సాంబమూర్తీ, రామస్వామి అయ్యంగార్, వారి రచనల్లో రాసారు. మరి కొంత మంది తేదీలు, సంవత్సరాల జోలికి పోకుండా కథ మాత్రం రాసారు. నిజానికి 1829 సంవత్సరం సరికాదు. ఎందుకంటే స్వాతి తిరునాళ్ మహారాజయ్యింది 1834 సంవత్సరంలో. కాబట్టి వడివేలు త్యాగరాజుని సందర్శించిన కాలం 1834 తరువాతే అయ్యుండాలి. ట్యగరజ – ఆ ఘ్రేత్ ంఉసిచీన్ శైంత్ పుస్తకంలో రామస్వామి అయ్యర్, త్యాగరాజుని వడివేలు కలిసిన కథని ఎంతో నాటకీయంగా సంభాషణలతో సవివరంగా చెప్పారు.
ఉత్తరాది యాత్ర


త్యాగరాజు ఉత్తరాది యాత్ర

జీవితమంతా త్యాగరాజు కావేరీ నదీ తీరాన తిరువయ్యారులోనే గడిపాడు. మహా అయితే తంజావూరు, తిరువారూరు తప్ప చుట్టుపక్కల ఉన్న వూళ్ళకి అంతగా వెళ్ళినట్లుగా తెలీదు. కానీ జీవితం చరమ భాగంలో అంటే డెబ్భై ఏళ్ళు వచ్చాక తీర్థ యాత్రల పేరున కాంచీపురం, తిరుపతి, మద్రాసు, శ్రీరంగం వంటి పుణ్య క్షేత్రాలు దర్శించాడు. ఈ తీర్థయాత్రలకి కారణం మద్రాసులో ఉండే కోవూరి సుందర మొదిలియారనే ఓ సంపన్నుడు. వెంకట రమణ భాగవతార్‌ది మద్రాసు సమీపంలో ఉన్న వాలాజపేట కావడం, శరభోజి రాజు ఆహ్వాన తిరస్కారంతో త్యాగరాజు పేరు మద్రాసు వరకూ ప్రాకింది. ఆ విధంగా త్యాగరాజు గురించి సుందర మొదిలియార్ కి తెలిసింది. ఎలాగైనా త్యాగరాజుని మద్రాసు రప్పించాలని ప్రయత్నించాడు. త్యాగరాజు అనుంగు శిష్యులైన వెంకట రమణ భాగవతార్, వీణ కుప్పయ్యర్ల చేత చెప్పించాడు. స్వయంగా తిరువయ్యారు వెళ్ళి త్యాగరాజుని ఆహ్వానించాడు. చివరికి ఆయన ప్రయత్నం వేరొకరి ద్వారా ఫలించింది. ఆయనే కాంచీపుర మఠాధీశుడు ఉపనిషద్ బ్రహ్మం. ఆ సంఘటనకి దారితీసిన వివరాలు తెలుసుకునే ముందు ఈ ఉపనిషద్ బ్రహ్మం గురించి తెలుసుకోవాలి.

ఈయన అసలు పేరు రామచంద్రేంద్ర సరస్వతి. ఇతను వాసుదేవేంద్ర సరస్వతి శిష్యుడు. సంస్కృతం, వేదోపనిషత్తులూ బాగా నేర్చుకున్నాడు. తంజావూరు రాజుల వద్ద ఉపనిషత్తులపై ప్రసంగాలు చేసేవాడు. అక్కడే ఈ ఉపనిషద్ బ్రహ్మానికీ, త్యాగరాజు తండ్రి రామబ్రహ్మానికీ స్నేహం ఏర్పడింది. తండ్రితో పాటు త్యాగరాజూ ఈ రామాయణ ప్రసంగాలికి వెళ్ళినప్పుడు ఈయన్ని కలిసేవాడు. ఈయన రామబ్రహ్మం కన్నా పాతికేళ్ళు పైగా చిన్నవాడు. త్యాగరాజు కన్నా సుమారు ఇరవై ఏళ్ళు పెద్ద. ఈయనకీ రామభక్తి మెండుగా ఉండేది. తరచు వేదాంత విషయాలపై రామబ్రహ్మానికీ, ఇతనికీ మధ్య చర్చలు జరిగేవి. తంజావూరు రాజకీయ చిత్రపఠం 1780 నాటికి మారింది. ఆ సమయంలో రాజకీయ సుస్థిరత లేని కారణంగా అనేకమంది తంజావూరు దర్బారు విడిచి వెళిపోయారు. ఈ ఉపనిషద్ బ్రహ్మం కూడా తంజావూరు వదిలేశాడు. ఉత్తరాది తీర్థయాత్రలు చేసే నిమిత్తమై వెళ్ళి, చివరికి కాంచీపురం లో ఓ మఠం స్థాపించి స్థిర పడ్డాడు. ఈయన శంకరాచార్యుల వారి అద్వైత మతానికి ప్రచారకుడిగా ఉన్నాడు. అద్వైత మతానికి సంబంధించిన ముక్తోపనిషత్ లోని 108 ఉపనిషత్తులపై ప్రసిద్ధమైన వ్యాఖ్యానాలు రాసాడు. ఈయన కూడా సంగీత విద్వాంసుడు. ఈయన కూర్చిన భజనల ప్రభావం త్యాగరాజుపై కూడా ఉందని సంగీతజ్ఞుల అభిప్రాయం. దివ్యనామ సంకీర్తనలకీ, ఉపనిషద్ బ్రహ్మం కూర్చిన భజన కీర్తనలకీ చాలా పోలికలున్నాయని టి.పార్థసారధి రాసారు. ఉపనిషద్ బ్రహ్మం వాడిన పదజాలం కొన్ని త్యాగరాజు కీర్తనల్లో మెండుగా కనిపిస్తుందని చెప్పారు.

ఓసారి ఈ సుందరేశ మొదిలియార్ కాంచీపురంలోని ఈ ఉపనిషద్ బ్రహ్మం మఠాన్ని సందర్శించాడు. ఈ ఉపనిషద్ బ్రహ్మంతో మాటల సందర్భంలో త్యాగరాజు తండ్రీ, ఈయనకీ స్నేహం ఉందన్న విషయం తెలిసింది. మొదిలియార్ ఇహ ఆలస్యం చేయకుండా త్యాగరాజు సంగీత ప్రతిభ గురించి ఆయనకి ఎంతో ఎక్కువగా చెప్పాడు. ఇంతకుముందూ ఉపనిషద్ బ్రహ్మం త్యాగరాజు గురించి విన్నాడు. తనకి త్యాగరాజుతో ఉన్న పాత అనుబంధంతో కాంచీపురం రమ్మనమని లేఖ రాసి పంపాడు. ఈ లేఖని ముందుగా తంజావూరు రామారావు చేతికి అందేలా చూసాడు. భార్య కమలాంబ మరణానంతరం ఈయన త్యాగరాజుకి కార్యదర్శిలా ఉండేవాడు. మొత్తానికా శ్రీముఖం త్యాగరాజుకి చేరింది. త్యాగరాజుకి తిరువయ్యారొదిలి వెళ్ళడం ఇష్టంలేదు. తను లేకపోతే రోజూ రామపంచాయతనానికెవరు పూజ చేస్తారన్నవుద్దేశ్యంతో ఒప్పుకోలేదు. ఈ సందర్భంలో తోడి రాగంలో ‘కోటి నదులు ధనుష్కోటిలోనుండగ ఏటికి తిరిగెదవే ఓ మనసా’ అనే కృతిని రచించాడనీ చెబుతారు. ఈ కృతి అనుపల్లవిలో ‘సూటిగ శ్యామ సుందర మూర్తిని మాటి మాటికి జూచే మహారాజులకు’ అంటూ తన అయిష్టానికి కారణం చెబుతాడు.

ఉపనిషద్ బ్రహ్మం త్యాగరాజుకి గురు సమానులు. గురువుగారి విన్నపాన్నీ, కోరికనీ తోసిపుచ్చే ధైర్యం లేదు. ముందుగా శ్రీరంగంలో శ్రీ రంగనాధుణ్ణి దర్శించుకొని, అక్కడ నుండి తిరుపతి వెళ్ళి శ్రీ వేంకటేశ్వరుణ్ణి కూడా చూడాలన్ని కోరిక త్యాగరాజు వ్యక్తం చేయడంతో తంజావూరు రామారావు ఏర్పాట్లు చేయడం ప్రారంభించాడు. త్యాగరాజుతో సహా దాదాపు ఇరవైమంది శిష్యుల వరకూ ఈ ప్రయాణం సాగించారు. ఆ విధంగా త్యాగరాజు ఉత్తరదేశ యాత్ర మొదలయ్యింది. ఆ యాత్రే మరికొన్ని పంచరత్న కీర్తనలు స్వరపరచడానికి నాంది పలికింది.

చైత్రమాసంలో ప్రతీఏటా తిరువయ్యారు పంచనదీశ్వర ఆలయంలో సప్తస్థాన ఉత్సవం అని ఒకటి జరుగుతుంది. ఈ ఉత్సవంలో క్రమం తప్పకుండా త్యాగరాజు ప్రతీ ఏడూ పాల్గొనేవాడు. ఈ పంచనదీశ్వర ఆలయం సమీపంలోనే మరో ఆరు దేవాలయాలున్నాయి. అవి తిరుచత్రుదురై, తిరువెదికుడి, తిరుప్పొందురితి, తిల్లైస్థానం, కందియూర్ మరియు తిరుప్పళనం. ఈ సప్తస్థానం ఉత్సవంలో శివుడు ఊరేగింపుగా పంచనదీశ్వరాలయంతో మొదలు పెట్టి, పైన చెప్పిన ఆలయాలన్నీ దర్శించి చివరకి తిరువయ్యారు చేరుకుంటాడు. ఈ ఏడు గుళ్ళకీ సంబంధించిన ఉత్సవం కాబట్టి సప్తస్థాన ఉత్సవం అన్నారు. ఆ ఉత్సవం రోజున తిరువయ్యారులో సంగీత సభలూ, కచేరీలూ అప్పట్లో జరిగేవి. ఉత్సవం తరువాత త్యాగరాజు శిష్యపరివారంతో కలిసి ఉత్తరాది తీర్థయాత్రలకి ముహూర్తం పెట్టారు. ఈ తీర్థయాత్ర జరిగింది 1939 సంవత్సరంలో! అప్పటికే త్యాగరాజుకి డెబ్భై రెండేళ్ళొచ్చేసాయి. వీలయినంత దూరం బండ్లమీద, కుదరనిచోట పల్లకీలోనూ త్యాగరాజుని తీసుకెళ్ళడానికి శిష్యులు ఏర్పాట్లు చేసారు.
శ్రీరంగం

ఉత్తరాది తీర్థయాత్రలో మొదట తిరుచురాపల్లి సమీపంలోనున్న శ్రీరంగం శ్రీ రంగనాథాచార్యుణ్ణి చైత్రోత్సవం సమయానికి దర్శించారు. అక్కడ అయిదు రోజులు బస చేసారు. ఈ అయిదురోజుల్లోనూ అయిదు పంచరత్నాలు స్వర పరిచాడు త్యాగరాజు. అవి - తోడి రాగంలో ‘రాజు వెడలె’, కాంభోజి రాగంలో ‘ఓ రంగ శాయీ’, ఆరభిలో ‘చూతము రారే సుదతులార రంగపతిని’, దేవగాంధారిలో ‘వినరాదా నా మనవి’, మరియు సారంగ రాగంలో ‘కరుణ జూడవయ్య’. ఈ అయిదు కీర్తనల్నీ శ్రీరంగ పంచరత్నాలుగా అభివర్ణిస్తారు. చిత్ర వీధిలో శ్రీరంగనాధ స్వామి ఊరేగింపుత్సవాన్ని చూసాక ‘రాజు వెడలె’ కృతిని స్వరపరిచి పాడాడనంటారు. ఈ శ్రీరంగ పంచ రత్నాల్లో ‘ఓ రంగ శాయి పిలిచితే’ కృతి ధాతు, మాతుల్లో అత్యంత విశేషత కలిగిన సంపూర్ణ రచన. కాంభోజి రాగంలో స్వరపరచినన్ని కృతుల్లోకీ ఇది ఉత్తమ శ్రేణి రచనగా సంగీత కారులు పరిగణిస్తారు. పల్లవిలోనే ఏడు సంగతులున్నాయి. అవి సముద్ర తరంగాల్లా ఒక దానితో ఇంకోటి అనుసరిస్తాయి. ఈ కృతి విని అమితంగా ఆకర్షితుడయ్యి వీణ కుప్పయ్యర్ కాంభోజి రాగంలో ‘కొనియాడిన’ అనే కృతి రచించాడు.

ఈ రథోత్సవ సందర్భంలోనే ఒక కథుంది. ఇది త్యాగరాజుని అద్వితీయమైన భక్తునిగా చిత్రీకరించడానికి భక్తులకి బాగా ఉపయోగపడింది. ఈ ఊరేగింపు సమయంలో రథం మీదున్న రంగనాధ స్వామిని దర్శించుకోవాలని త్యాగరాజు ఆశించాడు. కానీ అంత జనంలో ముందుకు వెళ్ళలేక అక్కడే ఉండిపోయాడు. ఈలోగా వీధి మలుపు తిరుగుతూ రంగనాధుని రథం ఆగిపోయింది. ఎంతమంది లాగినా కదల్లేదు. దేముడికి ఎవరిదో దిష్టి తగిలిందని దేవాలయ పెద్దలు విరుగుడుగా అక్కడున్న దేవదాసిలిద్దర్ని నృత్యం చేయమని ఆదేశించారు. ఇంతలో ఓ భక్తుడికి పూనకం వచ్చి, దూరంగా ఉన్న త్యాగరాజుని చూపిస్తూ, ఆయనకి దైవ దర్శనం ఇస్తే కానీ రథం కదలదనీ చెప్పాడు. అది తెలిసి త్యాగరాజు శ్రీరంగనాధుని దర్శించి, రథం మీద చేయేస్తే, అప్పుడది కదిలిందనీ కథ. ఈ సందర్భాన్ని వివరిస్తూ దేవగాంధారి రాగంలో ‘వినరాదా నా మనవి’ అనే కృతిని పాడాడని చెబుతారు. ఈ కృతి లో చరణాల్లో దేవదాసీలు నృత్యం విషయం కనిపిస్తుంది.

పల్లవి. - విన రాదా నా మనవి
చరణం1. - కనకాంగ కావేటి రంగ శ్రీ
కాంత కాంతలెల్ల కామించి పిలిచితే (విన)
చరణం2. - తేజినెక్కి బాగ తెరువున రాక
రాజ సతులు జూచి రమ్మని పిలిచితే (విన)
చరణం3. - భాగధేయ వైభోగ రంగ శ్రీ
త్యాగరాజ నుత తరుణులు పిలిచితే (విన)

ఆరోజు సాయంత్రం రంగనాథ స్వామికి ముత్యాల హారాలతో అందంగా అలంకరిస్తే అది చూసి ‘ఓ రంగశాయీ’ కృతిని ఆశువుగా స్వర పరిచాడనీ చెబుతారు. ఈ కథ ఎంతో విపులంగా సాంబమూర్తి ‘ది గ్రేట్ కంపోజర్స్’ లో మాత్రమే కనిపిస్తుంది. వెంకట రమణ భాగవతార్, ఆయన కొడుకూ, మనవడూ కృష్ణ, రామస్వామి భాగవతార్లు రాసిన చరిత్రల్లో ఎక్కడా కనిపించదు. సాంబమూర్తి గారి కధనానికి ఆధారాలెక్కడివో తెలీదు. ఈ కథ 1960 దాటిన తరువాతొచ్చిన కొన్ని పుస్తకాల్లోనే కనిపించింది. టి. సుందరేశ శర్మ గారి “త్యాగరాజ చరిత్రం” లో శ్రీరంగం గురించి ఒకే ఒకసారి చిన్నగా ప్రస్తావనుంది. పైన చెప్పిన కథకానీ, కృతులు పాడిన సందర్భం కానీ లేదు. ఏదైతేనేం త్యాగరాజు రామభక్తినీ కథ ఇంకో మెట్టు పైనుంచుతుంది. ఇలాంటి కథలకతీతుడు త్యాగరాజని నా విశ్వాసం.
కాంచీపురం

త్యాగరాజూ, శిష్యులూ శ్రీ రంగం నుండి సరాసరి కాంచీపురం వచ్చారు. ఆ సమయంలో కాంచీపురం వరదరాజస్వామి గరుడోత్సవాన్ని త్యాగరాజు కనులారా తిలకించాడు. ఆ ఆనందంలో స్వర భూషణి రాగంలో ‘వరద రాజ నిను కోరి వచ్చితి మ్రొక్కేరా’ అన్న కృతినీ, రాగపంజర రాగంలో ‘వరదా నవనీతాశ పాహి’ కృతినీ రచించాడు. కంచిలోనున్న కామాక్షీ అమ్మవారిని దర్శించి, ‘వినాయకుని వలెను బ్రోవవే నిను’ అనే కృతిని మధ్యమావతి రాగంలోనూ కట్టాడు. త్యాగరాజు సంగీత ప్రతిభ చూసి ఉపనిషద్ బ్రహ్మం ఎంతగానో పొంగిపోయాడు. దాదాపు రెండు వారాల తరువాత తిరుపతికి బయల్దేరారు. సుందరేశ మొదిలియార్ అభిమానాన్నీ, శ్రద్ధనీ చూసి త్యాగరాజు ఎంతో సంతోషించాడు. తన ఇంటికి మద్రాసు రమ్మనమని మొదిలియారు కోరితే త్యాగరాజు తిరుపతి దర్శనం ముగుంచుకొని వస్తానని చెప్పాడు.

కాంచీపురం నుండి ప్రియ శిష్యుడు వాలాజపేట వెంకట రమణ భాగవతార్ ఇంటికి త్యాగరాజు వెళ్ళాడు. ఆ వూరిలోవున్న భజన మందిరాన్ని దర్శించిన సందర్భంలో మైసూరు ఆస్థాన విద్వాంసుడైన మైసూరు సదాశివరావు తోడి రాగంలో ‘త్యాగరాజు వెడలిన’ అనే కృతిని స్వరపరిచి పాడాడని చెప్పారు. ఈ వాసుదేవరావు వెంకటరమణ భాగవతార్ శిష్యుడు. కానీ ఆ కృతి అందుబాటులో లేదు.
తిరుపతి

త్యాగరాజు శ్రీ వేంకటేశ్వరుణ్ణి దర్శిద్దామని వెళ్ళిన సమయంలో స్వామి వారి గర్భగుడిలో తెర వేసేసారు. అక్కడున్న అర్చకులు త్యాగరాజుని లోపల ప్రవేశించడానికి అనుమతివ్వలేదు. ఇది చూసి ఉండబట్టలేక అప్పటికప్పుడు ‘తెరతీయగ రాదా? అనే కృతిని గౌళిపంతు రాగంలో పాడాడు. త్యాగరాజు పాటకి అక్కడున్న తెర దానంతటదే పైకి లేచిందనీ, అప్పుడు త్యాగరాజు ఎంతో సంతోషించి, మధ్యమావతి రాగంలో ‘వేంకటేశ నిను సేవింప’ అనే కృతిని పాడాడని చెబుతారు. ఈ తెర లేచే సన్నివేశాన్ని తిలకించిన అర్చకులు త్యాగరాజుని ప్రత్యేక అతిధిగా సత్కరించారనీ చెబుతారు. ఈ కథకి బహుళ ప్రాచుర్యముంది. సంగీతంలో ప్రతీ రాగానికీ సమయం కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. పైన చెప్పిన కృతుల రాగాలు, మధ్యమావతీ, గౌళిపంతూ మధ్యాహ్న రాగాలు. సమయానికి తగిన రాగంలో ఆశువుగా స్వరపరచడం త్యాగరాజు సంగీత ప్రతిభకి నిదర్శనం.


తిరుమలలో జరిగిందని చెప్పబడుతున్న తెర తీయగరాదా సన్నివేశం కూడా త్యాగరాజుని రామ భక్తునిగా మరో మెట్టు పైన కూర్చోబెట్టే విధంగానే వుంటుంది. త్యాగరాజు తిరుపతిని సందర్శించిన మాట వాస్తవం. కానీ ఈ కథ జరిగిందని చెప్పడానికి ఆధారాలు లేవు. మొట్టమొదట త్యాగరాజు జీవిత చరిత్ర రాసిన వెంకట రమణ భాగవతార్ కానీ, కృష్ణ స్వామి భాగవతార్ కానీ త్యాగరాజుకి మహిమలు ఆపాదిస్తూ కథలు చెప్పలేదు. కానీ 1908 కాలంలో ‘సద్గురు త్యాగరాజ స్వామి కీర్తనలు’ పేరుతో తిల్లైస్థానం శిష్య పరంపరకి చెందిన నరసింహ భాగవతార్ రాసిన పుస్తకం లో ఈ సంఘటనుంది. ఆ తరువాతొచ్చిన అంటే 1937 లో ప్రచురింపబడిన టి.సుందరేశ భాగవతార్ ‘త్యాగరాజ చరిత్రం’ లో ఈ తిరుపతి సంఘటనే కనిపించదు. ఇలాంటి సంఘటల్ని కొంతమంది చెప్పీ, కొంతమంది చెప్పకపోతే అనుమానాస్పదంగా తయారవుతాయి.

అలాగే ఈ తిరుపతి యాత్రలో భాగంగా పుత్తూరు గ్రామంలో చనిపోయిన మనిషిని బ్రతికించిన సంఘటనపై ఇంకో కథొకటుంది. తిరుపతి యాత్ర ముగించుకుని త్యాగరాజు పొత్తూరు వచ్చాడు. అక్కడ గుడి దగ్గర ఓ వ్యక్తి శవం ముందు ఒకామె రోదిస్తూ కనిపించింది. క్రితం రాత్రి ఆ గుడిలో తలదాచుకుందామనుకొని ఆ వ్యక్తి గుడి గోడ దాటి వచ్చే ప్రయత్నంలో అక్కడున్న బావిలో పడి మరణించాడు. ఈ విషయం తెలిసి త్యాగరాజు ‘నా జీవనాధార’ కృతిని పాడి ఆ శవం పై తులసి తీర్థం జల్లగానే, ప్రాణం పోయినతను బ్రతికినట్లుగా ఈ కథ కూడా ప్రాచుర్యంలోనే ఉంది. అయితే, ఇలాంటి కథలు త్యాగరాజుకి రామ భక్తునిగా మహిమలు ఆపాదించడాని కుపయోగిస్తాయే తప్ప చరిత్రలో వాస్తవాన్ని ధృవీకరించవు.

తిరుపతి నుండి మద్రాసు తిరుగు ప్రయాణంలో శ్రీ కాళహస్తిని దర్శించాడు. అక్కడున్న స్వర్ణముఖీ నదిని చూసి ఆనందంతో బిలహరి రాగంలో ‘నీవే కాని నన్నెవరు కాతురురా నీరజ దళ నయన’ కృతిని స్వరపరిచాడని చెబుతారు. ఈ కీర్తన ఆఖరి చరణంలో స్వర్ణముఖీ నది గురించుంది.

సాగర శయన నదులలో మేలైన
స్వర్ణదీ స్నానంబున కల్గు ఫలము
త్యాగరాజు వరమని బ్రహ్మాదులకు
సత్యము జేసి పల్కిన తారకము

ఆ తరువాత శ్రీ కాళహస్తి నుండి షోలింగర్ లో ఉన్న నరసింహ స్వామిని దర్శించుకున్నాడు. ఈ వూరు అరక్కోణం దగ్గరలో వుంది. అక్కడున్న దైవాన్ని స్తుతిస్తూ బిలహరి రాగంలో ‘నరసింహ నన్ను బ్రోవవే శ్రీలక్ష్మీ’ కృతినీ, ఫలరంజని రాగంలో ‘శ్రీ నారసింహ మాం పాహి’ కృతినీ రచించాడు. అక్కడే ఉన్న ఆంజనేయ విగ్రహాన్ని చూసి, ‘పాహి రామ దూత’ కృతిని వసంత వరాళి రాగంలోనూ స్వరపరిచాడు. అక్కడో నాలుగు రోజులుండి మద్రాసు ప్రయాణమయ్యారు.
మద్రాసు

మద్రాసులో సుందరేశ మొదిలియార్ గృహంలో విడిది చేసారు. ఈ ఇల్లు బందరు వీధిలో ఉండేది. దీన్ని 1870 లో వేరొకరికి అమ్మేయడంతో ఆ ఇల్లు అనేక మార్పులకు గురయ్యింది. సుందరేశ మొదిలియార్ ఎంతో భక్తి, శ్రద్ధలతో త్యాగరాజుకి ఆతిధ్యం ఇచ్చాడు. ఈ సుందరేశ మొదిలియార్ ది కోవూరు. త్యాగరాజుని తీసుకొని అతను కోవూరు లో ఉన్న సుందరేశ స్వామి ఆలయానికెళ్ళాడు. అక్కడే త్యాగరాజు కోవూరు పంచరత్నాలు రచించాడు. పంతువరాళిలో ‘శంభో మహాదేవ’, సహాన రాగంలో ‘ఈ వసుధ నీవంటి’, ఖరహరప్రియలో ‘కోరి సేవింప రారే’, కళ్యాణి రాగంలో ‘నమ్మి వచ్చిన’, శంకరాభరణంలో ‘సుందరేశ్వరుని’ కృతులీ కోవురు పంచరత్నాల్లోకి వస్తాయి. వీటిల్లో ‘శంభో మహాదేవ’ కృతొక్కటే సంస్కృతంలో ఉంటుంది. త్యాగరాజు మద్రాసులో వారం రోజులున్నాడు. ప్రతీ సాయంత్రమూ సంగీత ప్రియుల సమక్షంలో దేవగాంధారి రాగాన్ని విస్తృతంగా పాడాడనీ ఆయన శిష్యుల ద్వారా తెలిసింది.
తిరువట్టియూర్

వీణ కుప్పయ్యర్ పూర్వీకుల సొంతూరు తిరువట్టియూర్. కుప్పయ్యర్ ఇక్కడే పుట్టాడు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన త్రిపుర సుందరి గుడుంది. ఈ గుడిని ఆది శంకరాచార్య దర్శించాడనీ చెబుతారు. త్యాగరాజు కుప్పయ్యర్ ఇంట్లో విడిది చేసి అమ్మవారి మీద అయిదు పంచరత్న కీర్తనలు కట్టాడు. ఇవి - కళ్యాణి రాగంలో ‘సుందరి నీ దివ్య రూపమును’, బేగడ రాగంలో ‘సుందరి నన్నిందరిలో’, శుద్ధ సావేరిలో ‘దారిని తెలుసుకొంటి’ మరియు సావేరి లో ‘కన్న తల్లి నాపాల కలుగ’ కృతులు. వీటిలో త్రిపుర సుందరి మహిమా, పుణ్య క్షేత్ర మహత్యమూ విశేషంగా కనిపిస్తాయి. ఈ అయిదింట్లోనూ “దారిని తెలుసుకొంటి” లో చాలా సంగతుల ప్రయోగం కనిపిస్తుంది. కేవలం పల్లవిలోనే పదహారు సంగతులున్నాయి. అలాగే అనుపల్లవీ, చరణాలకొక్కింటికీ ఎనిమిదేసి సంగతులుంటాయి. కుప్పయ్యర్ ఇంటిలోని శ్రీ కృష్ణుని విగ్రహం చూసి తన్మయత్వం చెందీ, కేదార గౌళ రాగంలో ‘వేణు గాన లోలుని కన వేయి కన్నులు కావలెనే’ కృతిని రచించాడు.
లాల్గుడి

తిరుగు ప్రయాణంలో నాగపట్టణం వెళ్ళారు. అక్కడ కాయారోహణ స్వామీ, నిలయతాక్షిల దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారి మీద - తోడి రాగంలో ‘ఎవరు తెలియ పొయ్యేరు నీ మహిమలు’ కృతినీ, సావేరి రాగంలో ‘కర్మమే బలవంతమాయా తల్లి’ కృతినీ రచించాడు. అక్కడనుండి సరాసరి లాల్గుడి త్యాగరాజు ప్రియ శిష్యుల్లో ఒకడైన లాల్గుడి రామయ్య కోరికపైనే వెళ్ళారు. ఆ వూళ్ళో సప్త ఋషీశ్వర స్వామి దేవాలయముంది. అక్కడే ఆ దేవుడి సమక్షంలో మరో పంచరత్న కృతుల్నీ రచించాడు. వీటినే లాల్గుడి పంచరత్నాలంటారు. అవి - తోడి రాగంలో ‘గతి నీవని నే కోరి వచ్చితి తల్లి పరాకా’, భైరవి లో ‘లలిత శ్రీ ప్రవర్ధే’, కాంభోజి లో ‘మహిత ప్రవృద్ధ శ్రీమతి’, మధ్యమావతిలో ‘దేవ శ్రీ తపస్తీర్థ పుర నివాస’, కళ్యాణి రాగంలో ‘ఈశా పాహిమాం’. లాల్గుడి నుండి తిన్నగా తిరువయ్యారు ఇంటికి చేరుకున్నారు.

త్యాగరాజు చరిత్ర రాసిన ప్రతీవొక్కరూ ఈ యాత్రల గురించీ, అక్కడ స్వర పరచిన పంచరత్నాల గురించీ చెప్పారు. ఈ యాత్రలో జరిగిన కొన్ని సంఘటనలకి ఎన్నో విశేషాలూ, విశేషణాలూ చేర్చి మరీ చెప్పారు. పైన చెప్పిన రీతిలో కాకుండా యాత్రస్థలాల్ని అటు ఇటూగా మార్చి చెప్పారు. ‘త్యాగరాజ - ఎ గ్రేట్ మ్యుజీషియన్ సైంట్’ పుస్తకంలో, రామ స్వామి అయ్యర్ మద్రాసు సుందరేశ మొదిలియార్ తో త్యాగరాజు సంభాషణ ఎంతో నాటకీయంగా చెప్పారు. ఆ యాత్రా విశేషాలు మొత్తమూ త్యాగరాజుని దైవాంశ సంభూతిడిగా చిత్రీకరించడానికే వినియోగించారు.

పైన చెప్పిన సంఘటనా విశేషాలు కాక మరో సంఘటనుంది. ఇది మాత్రం 1900 తరువాత త్యాగరాజు పై వచ్చిన విశేష ప్రచార సమయంలో బయల్పడిన కథ. వెంకట రమణ బాగవతార్ కానీ, ఆయన కొడుకూ, మనవడూ ఎవరూ ఉటంకించని సంఘటనది. త్యాగరాజు రామ భక్తుడు కాబట్టి ఆయనకి రామ దర్శనమయ్యిందీ, ఆయన్ని ఎల్లవేళలా ఆ రాముడే కాపాడాడని చెప్పడానికీ క్రింది కథని చెప్పినట్లుగా తోస్తుంది. ఈ కథా సమయంలో స్వరపరిచినట్లుగా చెప్పబడిన కృతుల సాహిత్యాన్ని బట్టి వెనక్కి సంఘటనల్లిన జాడలు కనిపిస్తాయి.

మద్రాసు నుండి తిరువయ్యరు తిరుగు ప్రయాణంలో కోవూరు సుందరేశ మొదిలియార్ ఓ వెయ్యి బంగారు వరహాలు శిష్యులకిచ్చాడు. ఆ వరహాలు త్యాగరాజు ప్రతీ ఏటా జరిపే శ్రీరామనవమి ఉత్సవానికుపయోగించమనీ శిష్యులకి చెప్పాడు. ఈ విషయం త్యాగరాజుకి తెలీకుండా ఆయన పల్లకీలో పెట్టాడు. దారిలో ఓ అడవి వచ్చింది. ఎత్తైన చెట్లూ అవీ చూసి కొంత సేపక్కడ విశ్రమిద్దామని నిశ్చయించుకున్నారు. ఆ అడవి ప్రాతం నాగలాపురం దొంగలకి ప్రసిద్ధి. దారినపోయే వారిపై రాళ్ళతో దండెత్తి, వారి వద్దనున్న సొమ్ము దోచుకునేవారు. ఆ వేళ కొంతమంది దొంగలు దూరాన్నుండి త్యాగరాజు బస చేసిన ప్రదేశంపై వెనుకనుండి రాళ్ళు రువ్వడం పారంభించారు. త్యాగరాజు వద్దకి శిష్యులొచ్చి విషయం చెప్పారు. తమ వద్ద దోచుకోడానికేముందనీ, ఈ దొంగలకి భయపడనవసరం లేదనీ చెప్పాడు. అప్పుడు ఒక శిష్యుడు (వీణ కుప్పయ్యర్) వచ్చి వెయ్యి బంగారు వరహాల విషయం చెప్పాడు. అయితే అవి దొంగలకి వదిలేసి వెళిపోదామన్నాడు త్యాగరాజు. ఈ లోగా ఇంకో శిష్యుడొచ్చి (తంజావూరు రామారావు) ఆ వెయ్యి వరహాలూ త్యాగరాజుకోసం కాదనీ, శ్రీ రామనవమి ఉత్సవానికనీ చెబుతూ, అది రాముడి సొమ్మనీ చెప్పాడు. అది రాముడి సొమ్ము కాబట్టి రాముడే చూసుకుంటాడనీ త్యాగరాజన్నాడు. అలా చెబుతూ రాముడి ప్రార్థనలో మునిగిపోయాడు. ఆ భక్తిలో దర్బారు రాగంలో ఈ క్రింది కృతి కట్టాడనీ చెప్పారు.

పల్లవి. - ముందు వెనుకయిరు పక్కల తోడై
ముర ఖర హర రారా

అనుపల్లవి. - ఎందు కాన నీయందము వలె రఘు
నందన వేగమే రారా (ము)

చరణం. - చండ భాస్కర కులాబ్ధి చంద్ర
కోదండ పాణియై రారా
అండ కొలుచు సౌమిత్రి సహితుడై
అమిత పరాక్రమ రారా (ము)

చరణం. - ఓ గజ రక్షక ఓ రాజ కుమార
ఓంకార సదన రారా
భాగవత ప్రియ బాగ బ్రోవవయ్య
త్యాగరాజ నుత రారా (ము)

ఈ కృతి చివర్లో ఉండగా యవ్వనంలో ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు ఆ దొంగలపై బాణాలు కురిపించారు. దాంతో ఆ దొంగలు వెనక్కి పారిపోయారు. ఆ కుర్రాళ్ళిద్దరూ త్యాగరాజు వద్దకొచ్చి దొంగల భయం పోయిందని చెప్పి, త్యాగరాజు పల్లకీకిరువైపులా ఉండి ఆ అడవిని దాటించారు. పక్కనే ఉన్న ఊర్లో ఒక సత్రంలో దిగారు. ఆ దొంగలు దూరాన్నుంఛే త్యాగరాజుని అనుసరించారు. సత్రంలో దిగాక దొంగలొచ్చి త్యాగరాజు కాళ్ళపై పడి క్షమాపణలు కోరారు. పల్లకీ కిరువైపులా కాపలా వున్న కుర్రాళ్ళిద్దరూ కురిపించిన బాణ వర్షానికి తట్టుకోలేకపోయామనీ, ఆ కుర్రాళ్ళెవరనీ అడిగారు. అప్పటికే ఆ కుర్రాళ్ళు వెళిపోయారు. అప్పుడర్థమయ్యింది త్యాగరాజుకి. ఆ వచ్చిన వారెవరో కాదు, సాక్షాత్తూ రామ, లక్ష్మణులేనని. దాంతో ఆనందం పట్టలేక సారంగ రాగంలో ఈ క్రింది కృతి పాడాడనీ చెబుతారు.

పల్లవి. - ఎంత భాగ్యము మాపాల కల్గితివి
ఎవరీడు ముజ్జగములలో తన (కెంత)

అనుపల్లవి. - చెంత జేరి సౌజన్యుడై పలికి
చింత బాగ తొలగించి బ్రోచితివి (ఎంత)

చరణం. - మున్ను నీ సమీపమున వెలయు
సన్మునుల నెల్లనణిమాది లీలలచే
తిన్నగాను పాలనము జేసినట్టు
నన్ను కాచితివి త్యాగరాజ నుత (ఎంత)

ఇదీ ఈ కృతుల కథ. త్యాగరాజు పై వచ్చిన తొలినాటి రచనల్లో ఈ కథ కనబడదు. తరువాతొచ్చిన రచనల్లో ఎంతో వివరంగా, అద్భుతంగా చిత్రీకరిస్తూ వుంది. సాంబమూర్తి గారి ‘ది గ్రేట్ కంపోజర్స్’ లో ఈ కథ శిష్యుల పేర్లతో సహా వుంది. సాంబమూర్తి గారి ఊహలో తంజావూరి రామారావు ఈ యాత్రని మొదట్నుండీ పర్యవేక్షించాడు కాబట్టి ఆయనకీ బంగారు వరహాల గురించీ తెలుసుండాలి. అలాగే తంజావూరు రామారావు కి త్యాగరాజుతో చనువెక్కువ కాబట్టి ఆయన చెప్పిన సమాధానం వింటాడనీ అనిపించుండాలి. ఈ విధంగా మొదటి శిష్యుడి పేరు వీణ కుప్పయ్యర్ గానూ, రెండో ఆయన పేరు రామారావు గానూ చూపిస్తూ వివరంగా రాసారు. ఈ కథకి ఆథారాలు మాత్రం రాసినవారెవ్వరూ చూపించలేదు. ప్రయత్నంకూడా జరగలేదు. కేవలం కృతుల సాహిత్యాన్ని ఉటంకిస్తూ ఈ సంఘటనకి ఆపాదిస్తూ చెప్పారు. 1904వ సంవత్సరంలో సుబ్బరామ దీక్షితార్ అనే ఆయన తమిళంలో రాసిన త్యాగరాజు జీవిత చరిత్రలో ఈ కథలేదు. కానీ 1908లో వచ్చిన టి.నరసింహ భాగవతార్ (తిల్లైస్థానం శిష్యులు) రాసిన జీవిత చరిత్రలో ఈ కథుంది. ఆ తరువాతొచ్చిన ప్రతీ పుస్తకంలోనూ ఈ కథ సవివరంగా వుంది.

వెంకట రమణ భాగవతార్ కూర్చిన త్యాగరాజు కృతులుతో పాటు గురువుగారిపై ఆయన తెలుగులో రాసిన ప్రతి అందుబాటులో వుంది. అందులో త్యాగరాజుని స్వామి గా చిత్రీకరిస్తూ ఆయన్ని రామ అంశగా భావిస్తూ స్తుతించారు. అంతలా త్యాగరాజుని దేవుని అంశగా భావించిన వెంకట రమణ భాగవతార్ పైన చెప్పిన కథని విస్మరిస్తాడనుకునే ఆస్కారం కనిపించదు. పోనీ ఆయన అసంపూర్తిగానే త్యాగరాజు జీవిత చరిత్ర రాసాడని అనుకున్నా, చివరి దశలో త్యాగరాజుతో గడిపిన ఆయన కొడుకు కృష్ణ స్వామి భాగవతార్ కీ కథ తెలియకుండా ఉంటుందన్న అనుమానం రాదు. ఒకరు కాకపోయినా ఇంకో శిష్యుడైనా ఇలాంటి మహత్తరమైన సంఘటనలు చెప్పి తీరుతారు. కానీ ఎవరితో ప్రారంభమయ్యిందో తెలీదు, ఈ కథ మాత్రం 1900 తరువాతే బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. నిజానిజాలు పక్కన బెడితే ఈ సంఘటనకి సాధికారిత దొరకలేదు. ఇదొక్కటే కాదు, ఇలాంటివే మరికొన్ని కథలు మరికొన్నున్నాయి.

కేవలం రామభక్తుడిగా చిత్రీకరించే ప్రయత్నంలో త్యాగరాజు సంగీతాన్ని కొంచెం వెనక్కి నెట్టినట్లనిపిస్తుంది. త్యాగరాజు అసమాన్య ప్రతిభ కలిగుండడానికి కారణం రామభక్తుడవడంవల్లనే అన్న రీతిలో ఈ కథలు మలిచారు. త్యాగరాజు రామ భక్తుడే. ఎవరూ కాదనరు. కానీ ఈ మహత్యాల కథల్లో నిజా నిజాలెవరూ ధృవీకరించే ప్రయత్నం చేయరు. అందువల్ల త్యాగరాజుని ఓ సంగీత కారుడిగానే భావిస్తూ ఆయన జీవిత చరిత్రని చూసే అవకాశం లేకుండా పోయింది. పైగా వచ్చిన పుస్తకాలలో చాలా భాగం తేదీలు తప్పులతో నిండున్నాయి. పైన చెప్పిన ఉత్తరాది యాత్రనే తీసుకుంటే, కొంతమంది త్యాగరాజు సతీ సమేతంగా వెళ్ళాడని రాసారు. మరికొంతమంది భార్య పోయిన కొంత కాలాని కెళ్ళాడనీ రాసారు. ఇంకొంతమంది రామ విగ్రహాలు పోయినప్పుడు మనసు కుదుట పరుచుకోడం కోసం యాత్రలకెళ్ళాడనీ రాసారు. కొంతమంది ఈ యాత్రా సమయం 1839 అని రాసి, భార్యా సమేతంగా వెళ్ళాడని రాసారు. ఇంకొకరు భార్య సంగతి ఎత్తకుండా 1839లో ఈ యాత్ర జరిగిందని రాసారు. ఇలా తలోక్కరూ తలో విధంగా చెబితే ఏది ప్రామాణికంగా తీసుకోవాలో తెలీదు. ఏది చరిత్రకి దగ్గరగా ఉందో తెలీదు. మనకి చరిత్రని పొందుపరచుకునే అలవాటు లేదు. ఇలాంటివి ఆధారాలు చూపించాలంటే శిలా శాసనాలు కావాలి. లేదా చరిత్రకారులు రాసినవయ్యుండాలి.

పైన చెప్పిన కథలో త్యాగరాజు 1839లోనే మద్రాసు వెళ్ళాడు. అప్పటికి త్యాగరాజు వయాసు 72 ఏళ్ళు. ఈ యాత్రకి సంబంధించి కొన్ని వివరాలు మద్రాసు మ్యూజిక్ అకాడమీలో ఉన్నాయి. అలాగే కొన్ని మదురై సౌరాష్ట్ర సభలో ఉన్నాయి. అలాగే త్యాగరాజు భార్య 1804 లో పోయింది. కాబట్టి ఈ యాత్రలో భార్య ఉండే అవకాశం ఎంతమాత్రమూ లేదు. ఇలా ప్రతీ చిన్న విషయాన్నీ అతుక్కుంటూ పోతేనే మనకి చరిత్రకి దగ్గరగా వెళ్ళే అవకాశం వుటుంది.
జ్యోతి స్వరూపిణి

అమృత వర్షిణీ రాగం పాడితే వర్షం కురుస్తుందనీ సంగీతాభిమానుల నమ్మకం. ముత్తుస్వామి దీక్షితార్ ఈ రాగం పాడితే కరువు కాలంలో వర్షం కురిసిందనీ చెబుతారు. అలాగే సంగీతంలో కొన్ని రాగాలకి నిర్ధారిత ఉద్దేశ్యమే కాదు, నిర్దిష్టమైన అర్థం కూడా వుంది. త్యాగరాజు ‘జ్యోతి స్వరూపిణీ’ రాగం ఆలాపిస్తే కొడిగట్టిన దీపం వెలిగిందనీ ఒక కథుంది. పుదుకుట్టయి గెజిట్ లో పొందుపర్చిన వివరమే ఈ కథకి ఆధారం. పుదుకుట్టయి రాష్ట్ర నివేదిక రెండవ సంపుటి మొదటి భాగంలో “త్యాగరాజు పుదుకుట్టయి సందర్శించిన సందర్భంలో పుదుకుట్టయి రాజు సంగీత విద్వాంసులకి ఒక విచిత్రమైన పరీక్ష పెట్టాడు. ఆరిపోయిన దీపాన్ని అగ్ని లేకుండా వారి గాత్ర శక్తితో వెలిగించాలని. ఆ సభలో అప్పుడున్న గురువు గారి ప్రోద్బలంతో త్యాగరాజు జ్యోతిస్వరూపిణి రాగంలో ఆశువుగా స్వరపరిచి పాడితే, ఆ గాత్ర మహిమకి ఆ దీపం వెలిగింది. వెలగడమే కాదు, రాగ ఎత్తుగడలననుసరించి ఆ కాంతి పెరిగి తగ్గుతూ వచ్చింది.’ అని రాసుంది. ఎవరు దీన్ని పుదుకుట్టయి గెజిట్ లో పొందుపరిచారో తెలీదు. ఈ గెజిట్ ప్రతి ఒకటి తంజావూరు సరస్వతీ మహల్ లో వుంది. అలాగే ఈ కథలో శొంఠి వెంకట రమణయ్య పేరు చెప్పకుండా గురువని మాత్రమే రాసి వూరుకున్నారు. వెంకట రమణయ్య తంజావూరు ఆస్థాన సంగీత విద్వాంసుడు. ఆయనా, ఆయన తండ్రీ జీవితమంతా అక్కడే గడిపారు. మరి ఈ పుదుకుట్టయి ఆస్థానంలో ఏ సందర్భంలో ఉన్నారో తెలీదు. పైన చెప్పిన గెజిట్ ఆధారం తప్ప ఈ కథని త్యాగరాజు శిష్యులెవరూ రాయలేదు. ఇంతకుముందు చెప్పినట్లుగా శ్రీరంగంలో రథం కదలడమూ, ఇలా జ్యోతి ప్రజ్వలన కావడమూ వంటి సంఘటనలు తెలిసి తెలిసీ శిష్యులెవరూ రాయకుండా వదిలేయరు. ఈ ఒక్క కథా తప్ప, త్యాగరాజు పుదుకుట్టయి వెళ్ళినట్లు ఆధారాలు కూడా అస్సల్లేవు. ఇలాంటి కథలు త్యాగరాజు యొక్క భక్తి తత్వానికి మహిమలు ఆపాదించడానికుపయోగ పడతాయి చారిత్రాత్మక ప్రమాణం ఇవ్వలేవు.
కథలూకల్పితాలూ

త్యాగరాజు పై 1930 తరువాతొచ్చిన కొన్ని పుస్తకాల్లో కొత్త కథలు చోటు చేసుకున్నాయి. మొదటి తరం శిష్యులు రాసినవాటిలో లేనివి మరికొన్ని పుట్టుకొచ్చాయి. కొంతమందయితే శ్యామశాస్త్రికి సంబంధించిన కథల్ని త్యాగరాజు కథలుగా మలిచి చెప్పేసారు. అలాంటు కథొకటి తెలుసుకుందాం.

బొబ్బిలి కేశవయ్య: బొబ్బిలి కేశవయ్యని ఆంధ్ర ప్రాంతంలో ఓ జమీందారుండేవాడు. ఒకసారాయన తిరువయ్యారొచ్చాడు. త్యాగరాజు గురించి తెలుసుకున్నాడు. ముందు నాద స్వర విద్వాంసులతో పల్లకీ యెక్కి ఓ రోజున త్యాగరాజింటికొచ్చాడు. కేశవయ్య గురించెవరికీ తెలీక రాజ వంశీయులెవరో అనుకున్నారు. సంగీతంలో తనెంత ప్రతిభావంతుడో, ఎంతమంది రాజుల మెప్పు పొందాడో త్యాగరాజుతో చెప్పాడు. రాముని మెప్పు తప్ప రాజుల మెప్పుతో తనకి పనిలేదని చెబితే ఆగ్రహించి త్యాగరాజు సంగీతాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో ఆయన్ని పాడమన్నాడు. అప్పుడు ‘విదులకు మ్రొక్కెద’ కృతిని పాడితే విని కేశవయ్య కాళ్ళమీద పడ్డాడనీ చెప్పే కథది. చివరకి త్యాగరాజు శిష్యుడిగా మారాడనీ ఈ కథ ముగించారు. ఈ కథ సాంబమూర్తి, ఎం. వెంకట్రామయ్య,ఎస్. వై. కృష్ణస్వామి రాసిన పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఎస్. వై. కృష్ణస్వామి తనకి 1910 నుండీ 1930 వరకూ త్యాగరాజు శిష్యుల ద్వారా లభించినట్లుగా చెప్పారు. సాంబమూర్తి ఈ కథని రాసారే తప్ప ఆధారాలు చూపలేదు. బహుశా త్యాగరాజు రెండో తరం శిష్యుల ద్వారా వినుండచ్చు. ఈ కథ 1950 తరువాతొచ్చిన పుస్తకాల్లోనే కనిపించింది.

కానీ, ఈ కథ విని కాస్త చారిత్రాత్మక ఆధారాల్లోకి వెళితే ఇందులో నిజానిజాలు తెలుస్తాయి. ఈ బొబ్బిలి కేశవయ్య తిరువయ్యారు రాలేదు. త్యాగరాజూ, ఈ కేశవయ్యా అస్సలు కలవలేదు. ఈ కేశవయ్య శ్యామశాస్త్రితో సంగీత వాదన చేసాడు. ఇది శ్యామశాస్త్రి గురించొచ్చిన కథల్లోనే కనిపిస్తుంది. శ్యామశాస్త్రి తిరువారూర్లోనే ఉండేవాడు. పైగా ఈ కేశవయ్య పుదుకుట్టయి రాజుని దర్శించాక రామేశ్వరం వెళుతూ అక్కడే శ్యామశాస్త్రిని కలిసాడు. త్యాగరాజూ, శ్యామశాస్త్రీ ఒకే కాలం వారయ్యుండడంవల్లా, మరీ దగ్గరున్న వూళ్ళల్లోనే నివసించడంవల్ల ఇలాంటి తప్పులు జరిగే అవకాశాలున్నాయి. కానీ ఈ కథలు పుస్తక రూపంలో ప్రచురణకి నోచుకోడం వల్ల అందరూ ఇవే వాస్తవమని నమ్ముతారు.

పైన చెప్పిన కథలే కాకుండా త్యాగరాజు మదురై, శివగంగా, రామేశ్వరం వెళ్ళాడనీ శుద్ధానంద భారతీ అనే ఆయన ‘త్యాగరాజ - ది డివైన్ సెయింట్’ అనే పుస్తకంలో రాసారు. ఇవన్నీ ఉత్తరాది యాత్ర లో భాగంగానే రాసారు. ఈ సమాచారానికి ఆధారాలు మాత్రం చెప్పలేదు. అలాగే ఎవరూ చెప్పని త్యాగరాజు జీవిత విశేషాలు కొత్తవి కొన్ని చెప్పారు. త్యాగరాజు అన్నగారు పంచనదయ్య తమ్ముడిపై అక్కసుతో శిష్యులు పొందుపరిచిన తాళపత్ర కృతుల్నీ అగ్నిలో పడేసాడనీ చెప్పారు. కానీ త్యాగరాజు మనవడి భార్య గురవమ్మ ఆ ప్రతుల్ని మంటల్లోంచి బయటకు తీసి కొన్ని కాపాడిందనీ రాసారు. ఇది మాత్రం ఖచ్చితంగా సరికాదని చెప్పగలను. త్యాగరాజు అన్నయ్య పంచనదయ్య సుమారు 1812 ప్రాంతంలో చనిపోయాడు. త్యాగరాజు కూతురి పెళ్ళి 1810 ప్రాంతంలో జరిగింది. మనవడికి పదిహేనేళ్ళ వయసులో వివాహం జరిగిందనుకొన్నా, పైన చెప్పిన సంఘటన సుమారు 1825 తరువాతే జరిగుండాలి. కానీ అప్పటికే త్యాగరాజు అన్నయ్య పంచనదయ్య మరణిస్తే, మరలా ఈ త్యాగరాజు మనవడి భార్య రక్షించిన ప్రతులు, పంచనదయ్య మంటల్లో పడేసినవయ్యే అవకాశం ఎంత మాత్రం లేనేలేదు.

ఇలా తప్పుడు సమాచారంతో ఎవరికి తోచిన కథలు వారు రాసేసారు. వీటిల్లో ఎక్కువ భాగం కల్పితాలేనని కాస్త తేదీలూ, చుట్టరికాలూ చూస్తే అర్థమవుతాయి. కాకపోతే 1930 సంవత్సరంలో, డెబ్భై ఏళ్ళ క్రితం రాసిన ప్రతులు చాలా శ్రమిస్తే కానీ ఇప్పుడు దొరకడం కష్టం. పునః ముద్రణలకి అన్ని రచనలూ నోచుకోవు. ఈ పాత కథలాధారంగా కొత్త పుస్తకాలొస్తే అవే ఇప్పటి తరాలకి ప్రామాణికం అవుతాయి. అందువల్ల ఇవే కథలని పాఠకులు విశ్వసించే అవకాశముంది. త్యాగరాజు విషయంలో జరిగిందిదేనని ఖచ్చితంగా చెప్పగలను.
తిరువయ్యూరు

ఉత్తరాది యాత్రలు ముగించుకొచ్చాక త్యాగరాజు తిరువయ్యారు విడిచి ఎక్కడకీ వెళ్ళలేదు. ఎక్కువకాలం రామ భజనల్లోనూ, సంగీత సాధనా, బోధనల్లోనే కాలం గడిచిపోయేది. ఉన్న శిష్యులు తలొక్కరూ తలో ప్రాంతానికీ చెందిన వారు కావడం వల్ల త్యాగరాజు పేరు నలుమూలలా ప్రాకింది. కాంచీపురం, మద్రాసుల్లో అనేకమంది త్యాగరాజు సంగీత ప్రతిభని కళ్ళారా చూసారు. కొంతమంది తిరువయ్యారు వెళ్ళి సందర్శించారు. తిరువయ్యారులో త్యాగరాజు ఇల్లు ప్రతీరోజూ కొత్త కొత్త సందర్శకులతో నిండుండేది. తంజావూరు విచ్చేసిన ఏ సంగీతకారుడూ, తిరువయ్యారు దర్శించకుండా వెనక్కి వెళ్ళలేదు. ఉత్తరాదిన కాశీ నుండి, దక్షిణాన తిరువనంతపురం వరకూ ఎంతో మంది విద్వాంసులు తిరువయ్యారు వచ్చి వెళ్ళారు.

గోపీనాధ భట్టాచార్య: కాశీ లో గోపీనాధ భట్టాచార్య అనే ప్రముఖ హిందూస్తానీ సంగీత విద్వాంసుడుండేవాడు. ఎలాంటి రాగాన్నయినా గుక్క తిప్పుకోకుండా గంటలకొద్దీ పాడగల దిట్టనీ ఈయనకి చాలా పేరుండేది. త్యాగరాజు శిష్యులు కొంతమంది కాశీ యాత్రకెళ్ళినప్పుడు భట్టాచార్యకి త్యాగరాజు గురించి తెలిసింది. ఆయన దక్షిణాది యాత్రలో భాగంగా తిరువయ్యారు వెళ్ళాడు. తను కాశీనుండి వచ్చాననీ, త్యాగరాజు సంగీతం వినాలన్న కోరికతో తిరువయ్యారు వచ్చాననీ చెప్పాడు. ఇది విని సంతోషించిన త్యాగరాజు తోడి రాగంలో ఓ కృతి పాడాడు.

పల్లవి. - దాశరథీ నీ ఋణము దీర్ప నా
తరమా పరమ పావన నామ

అనుపల్లవి. - ఆశ తీర దూర దేశములను
ప్రకాశింప జేసిన రసిక శిరోమణి (దాశరథీ)

చరణం. - భక్తి లేని కవి జాల వరేణ్యులు
భావమెరుగ లేరని కలిలోన జని
భుక్తి ముక్తి కల్గునని కీర్తనముల
బోధించిన త్యాగరాజ కరార్చిత (దాశరథీ)

తన రామ భక్తినీ, సంగీతాన్నీ పలుదిశలా వ్యాపింపచేసినట్లుగా రామునిపై కృతి కట్టాడు. దక్షిణాది యాత్రా నిమిత్తమై కాశీ నుండొచ్చిన ఒక సంగీత విద్వాంసుడితో త్యాగరాజు హిందీలో సంభాషించాడనీ టి.లక్ష్మణ పిళ్ళై రాసారు. కానీ ఆ విద్వాంసుడి పేరు రాయలేదు. బహుశా ఆ విద్వాంసుడు ఈ గోపీనాథ భట్టాచార్య అయ్యే అవకాశముంది.

గోపాలకృష్ణ భారతి: నాగపట్టణం దగ్గర మాయవరం అనే వూళ్ళో గోపాలకృష్ణ భారతీ అనే ఒక తమిళ వాగ్గేయకారుడుండేవాడు. ఈయన తమిళంలో మంచి కవి. సంగీతకుటుంబం నుండి వచ్చినవాడవడం వల్ల అందులో కూడా ప్రావీణ్యముంది. ఓ సారి తంజావూరు వెళ్ళి తిరుగు ప్రయాణంలో త్యాగరాజుని కలుద్దామనీ వెళ్ళాడు. భారతి కోరిక మీద త్యాగరాజు తను స్వరపరిచిన కృతులు పాడాడు. ఆయన శిష్యులు ఆభోగి రాగంలో కృతులు పాడారు. అదయ్యాక గోపాలకృష్ణ భారతి ఆభోగి రాగంలో ‘సభాపతిక్కు వెరు దైవం’ అనే తమిళ కృతిని కట్టాడనీ చెబుతారు. త్యాగరాజుని కలిసిననంతరం ఆయన్ని చూసి స్పూర్తి పొంది గోపాలకృష్ణ భారతి అనేక రాగాల్లో కృతులు స్వరపరిచాడనీ అంటారు. ఈ గోపాల కృష్ణ భారతి త్యాగరాజుని 1841 సంవత్సరంలో కలిసాడు. ఈ విషయాన్ని ఆయనే ఓ చోట రాసుకున్నాడు. ఈ గోపాలకృష్ణ భారతి త్యాగరాజుని కలిసే సరికి సుమారుగా ముఫ్ఫై ఏళ్ళు. ఈయన 1896 లో చనిపోయాడు.

మహరత్త: తిరువయ్యారులో మహరత్త సైనికుడొకాయన వుండేవాడు. ఆయన ప్రతీ త్యాగరాజు భజనకీ, కచేరీకీ విధి తప్పకుండా వెళ్ళేవాడు. ఓ సారి అతని శ్రద్ధా, భక్తీ చూసి త్యాగరాజు సంగీతం నేర్పనాని అడిగాడు. తనకి పాడడం రాదనీ, సంగీతానికి బదులు త్యాగరాజు గుర్తుగా ఆయన వదిలేసిన పాత పాదరక్షలిమ్మనీ అడిగాడు. త్యాగరాజు దానికి బదులుగా తను ధరించే పాదరక్షలిచాడనీ చెబుతారు. ఈ పాదరక్షల్ని మహరత్త కుటుంబం వారూ చాలాకాలం పూజించేవారు. ఆ తరువాతివి మదురై సౌరాష్ట్ర సభకి తరలించారు.

షట్కళ గోవింద మరారు: ట్రావెన్‌కోర్ సమీపంలో రామమంగళం అనే ఊరుండేది. అక్కడ గోవింద మరారు అనే సంగీత విద్వాంసుడుండేవాడు. ఈయన 1798లో పుట్టాడు. సంగీతంలో ఈయన జతిస్వరాలు పాడడంలో దిట్ట. మహత్తరమైన లయజ్ఞానం, రవజతి స్వరాల్లో ప్రావీణ్యం ఉండడంవల్ల ఏ పాటనయినా ఆరు కాలల్లో చక్కగా పాడగలిగేవాడు. ఈయన స్వాతి తిరునాళ్ ఆస్థాన విద్వాంసుడిగా వున్నాడు. త్యాగరాజుని 1842లో కలిశాడు.

ఈ గోవింద మరార్ ఏడు తీగలున్న తంబుర వాయించేవాడు. సాధారణంగా తంబురకి నాలుగే తీగలుంటాయి. ఒక్క మంద్ర స్థాయి తీగ మినహాయించి ఈయన తంబురకి మిగతావి రెండేసి చొప్పున తీగలుంటాయి. ఒక చేత్తో తంబురనీ, రెండో చేత్తో కంజీరనీ కలిపి వాయించేవాడు. త్యాగరాజు మరార్ కోరికపై కొన్ని కృతులు పాడాడు. ఆరోజు ఏకాదశి అవ్వడం వల్ల శిష్యులు దివ్యనామ కీర్తనలు పాడారు. పాడడానికి గోవింద మరార్ వంతొచ్చింది. ముందుగా అతి మెల్లగా అతి అతి విలంబిత కాలంలో పాడ్డం మొదలెట్టేసరికి త్యాగరాజు శిష్యులు ఆశ్చర్యపోయారు. ఆ తరువాత మెల్లగా అతి విలంబిత (2వ కాలం), విలంబిత (3వ కాలం), మధ్యమ కాలం (4వ కాలం), ధృత (5వ కాలం), అతి ధృత (5వ కాలం) లో పాడడం మొదలెట్టాడు. చివరగా అతి అతి ధృత కాలం (7వ కాలం ) లో పాడడం వచ్చేసరికి, ఏమాత్రం లయ తప్పకుండా అంత వేగంగా పాడడం చూసి ఆశ్చర్యపోయారనీ చాలామంది రాసారు. త్యాగరాజు ఈయన్ని ఎంతో మెచ్చుకున్నాడనీ బహుమతిగా ఈయన తంబురనిచ్చాడనీ, దానికి ప్రతిగా త్యాగరాజు ‘ఎందరో మహాను భావులు’ కృతి ఈయనకి నేర్పాడనీ చెప్పారు. ఆ తరువాత ఈయన ఉత్తరాది యాత్రలకెళ్ళినపుడు 1843లో పండరీపురంలో మరణించాడు.

ఈ గోవింద మరార్ కథ కూడా త్యాగరాజు చరిత్ర రాసినందరూ చెప్పారు. కాకపోతే ఎవరి శక్తికి మించి వారు ఊహాకల్పన చేసి రాసారు. ఒక్క సాంబమూర్తి గారిదే ఏ మాత్రం అతిశయోక్తులు లేకుండా ఉంది. ఎం. వెంకట రామయ్య రాసిన ‘త్యాగరాజ’ పుస్తకంలో కాస్త ఊహాకల్పనెక్కువగా కనిపిస్తుంది. ఈ గోవిందమరార్ ని కొంతమంది గోవిందదాసుగా రాసారు. ఈయనకి కలలో రాముడు కనిపించి తిరువయ్యారు వెళ్ళి త్యాగరాజుని కలవమనీ, ఆ తరువాతే ఉత్తరాది యాత్రలకి వెళ్ళమనీ చెప్పినట్లుగా రాసారు.

( సశేషం )

No comments:

Post a Comment